Today Gold Price: తులం 90వేలు దాటేసింది.. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి మూడు వేల డాలర్ల పలుకుతోంది. కొన్ని రోజులుగా చుక్కల్లో విహరిస్తున్న బంగారం ధరలు త్వరలోనే లక్ష రూపాయలు తాకుతుందా అనే డౌట్ వస్తుంది. పెరుగుతున్న బంగారం ధరలతో పసిడి ప్రియులకు ముచ్చెమటలు పడుతున్నాయి. బంగారం పట్టాలంటే లక్ష కొట్టాల్సిందేనా అనే భయం పట్టుకుంది. రాబోయేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. గోల్డ్ మారథాన్ ఇలాగే కొనసాగితే.. ఏం చేయాలా అని అంతా ఆందోళనపడుతున్నారు. అసలు, పసిడి ఎందుకిలా పరుగులు పెడుతోంది..? ఈ ధరల పెరుగుదల ఎప్పటిదాకా ఉంటుంది..? తగ్గే అవకాశామే లేదా..?
దేశీయ విపణిలో తొలిసారి తులం పసిడి రూ. 90 వేల మార్కు
గత కొంతకాలంగా ఆకాశాన్ని అంటుతున్న పసిడి ధరలు మరోసారి భగ్గున మండాయి. దీనితో బంగారం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారు ఆభరణాలు కొనడం ఇప్పట్లో కష్టమే అనుకుంటున్నారు సామాన్యులు. ధనవంతులు సైతం మరీ ఇంత ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలా అని వాపోతున్నారు. దేశీయ విపణిలో తొలిసారి రూ. 90 వేల మార్కును చేరుకుని జీవితకాల గరిష్ఠానికి చేరుకున్న పసిడి ధరను చూసి అవాక్కవుతున్నారు. పాత రికార్డులు బద్దలు కొట్టి సరికొత్త రికార్డును సృష్టించిన బంగారం ధర రూ. 90,000 దాటింది. దీనితో పసిడి ప్రైజ్ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,100
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మార్చి 13న 10 గ్రాముల బంగారం ధర తొలిసారి రూ. 90 వేలు దాటింది. పసిడితోపాటు పెరిగే వెండి కిలో ధర రూ. 1.03 లక్షలకు చేరింది. ఇక ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,560 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,100గా ఉంది. అలాగే, ఒక కేజీ వెండి ధర ఒక లక్షా 14 వందల 7 రూపాయలు పలికింది. ఈ పరిస్థితిని చూస్తుంటే.. పది గ్రాముల బంగారం త్వరలోనే లక్ష రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తోంది.
మార్చి 14న బంగారం తొలిసారిగా ఔన్సుకు $3,000
అంతర్జాతీయ మార్కెట్‌లో మార్చి 14న బంగారం తొలిసారిగా ఔన్సుకు $3 వేల డాలర్ల మైలురాయిని దాటింది. అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా రేటు తగ్గింపు వైఖరితో ఈ చారిత్రాత్మక ర్యాలీ ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం, స్పాట్ గోల్డ్ ఔన్సుకు $3000.87 డాలర్ల వద్ద 0.4% పెరిగింది. ఇక, యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.7% పెరిగి $3 వేల13.60 డాలర్లకు చేరుకుంది. అలాగే, బులియన్ ఈ సంవత్సరం, ఇప్పటివరకూ.. 13 ఆల్ టైమ్ గరిష్టాలను సాధించింది. వరుసగా రెండవ వారం లాభాల బాటలో ఉంది.
ఆర్థిక మార్కెట్లో కుదుపు, మాంద్యం భయాలు
మరోవైపు, ఫెడ్ రేటు కోతల అవకాశాలతో పాటు.. భౌగోళిక రాజకీయ, ఆర్థిక ఆందోళనలతో సహా పసిడి ఇంత అధిక ధరలను చేరడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధంతో… బంగారం డిమాండ్‌ను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. దీనితో పాటు ఆర్థిక మార్కెట్లో కుదుపు, మాంద్యం భయాలను పెంచిన వైనం వల్ల ప్రపంచ వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది. ఈ పరిణామంతో పసిడి పరుగులు పెడుతోంది.
గోల్డ్-బ్యాక్ ETF అయిన SPDR గోల్డ్ ట్రస్ట్ ప్రకారం..
ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్ ETF అయిన SPDR గోల్డ్ ట్రస్ట్ ప్రకారం.. ఫిబ్రవరి చివరిలో దాని హోల్డింగ్స్ 905.81 మెట్రిక్ టన్నుల వద్ద ఉన్నట్లు తెలిపింది. అయితే, ఆగస్టు 2023 తర్వాత దాని గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే, నాటి డేటా ప్రకారం యూఎస్ కన్జ్యూమర్ ధరలు… విశ్లేషకులు ఊహించిన దానికంటే ఎక్కువగా తగ్గాయి. ఇది ఫెడరల్ రిజర్వ్ రేటు కోతలకు ఎక్కువ అవకాశాన్ని సృష్టిస్తుందని నిపుణులు అంటున్నారు.
ఈ సంవత్సరం స్పాట్ ధరలు ఇప్పటికే 14.20% పెరుగుదల
అయితే, ఫెడ్ తదుపరి సమావేశం మార్చి 19న జరగనుంది. అయితే, ఈ సమావేశంలో దాని బెంచ్‌మార్క్ వడ్డీ రేటును మార్చకుండా ఉంచాలని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే, గత క్యాలెండర్ సంవత్సరాన్ని 27.24% లాభంతో ముగించిన తర్వాత ఈ సంవత్సరం స్పాట్ ధరలు ఇప్పటికే 14.20% పెరిగాయి. అయితే, విధాన నిర్ణేతలు జూన్‌లో రుణ ఖర్చులను తగ్గించడం తిరిగి ప్రారంభిస్తారని వ్యాపారులు భావిస్తున్నారు.
డాలర్ బలహీనత 103.75 కంటే తక్కువ
ఇక, ప్రపంచవ్యాప్తంగా ప్రధాన కేంద్ర బ్యాంకులు… ముఖ్యంగా చైనా, ఫిబ్రవరిలో వరుసగా నాలుగో నెల కూడా బంగారం కొనుగోళ్లను పొడిగించింది. దీని వల్ల పసిడి ధర పెరుగుదలకు మద్దతు లభిస్తోంది. అంతేకాకుండా, ఊహించిన దానికంటే తక్కువ CPI డేటా మధ్య.. డాలర్ బలహీనత 103.75 కంటే తక్కువగా ఉంది. దీంతో ధరలు మరింతగా ఊపందుకున్నాయి. అయితే, ఇది అమెరికా, భారత్ రెండింటిలోనూ వడ్డీ రేటు తగ్గింపుల అంచనాలకు బలం చేకూర్చింది. అలాగే, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో.. బంగారం దిగుమతులపై సుంకాలు విధించవచ్చనే భయాలు కూడా పెరుగుతున్నాయి.
ప్రపంచ ఆర్థిక వృద్ధి 0.3%కి తగ్గుతుందని ఆర్థికవేత్తలు అంచనా
ఇటీవలి నివేదికల ప్రకారం, అమెరికాలోని కొన్ని అతిపెద్ద బ్యాంకులు వాణిజ్య విమానాల్లో లండన్ నుండి న్యూయార్క్ నగరానికి బంగారు కడ్డీలను రవాణా చేయాలని కూడా వెల్లడించాయి. ఇలా రోజు రోజుకూ పెరుగుతున్న పసిడి ధరల మధ్య.. విశ్లేషకుల అంచనా వేసిన దానికంటే అధికంగా బంగారం దూసుకుపోతుందని అనుకుంటున్నారు. దీని ప్రకారం.. ఈ ఏడాది మూడవ త్రైమాసికం నాటికి, బంగారం ఔన్సుకు $3,500 డాలర్లకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే, ఈ సంవత్సరం మూడవ త్రైమాసికం నాటికి ప్రపంచ ఆర్థిక వృద్ధి 0.3%కి తగ్గుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్న నేపధ్యంలో.. బంగారం కీలకమైన సురక్షితమైన ఆస్తిగా మిగిలిపోయే అవకాశం ఉంది.
బంగారం పెరుగుతుందా? తగ్గుతుందా?
బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక ట్రంప్ నిర్ణయాలు, అంతర్జాతీయ కారణాలు చాలానే ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవడంతో పాటు… ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధం.. ఈక్విటీ మార్కెట్లు బలహీన పడటం వంటివి కూడా పసిడి ధరపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో బంగారం ధరను మరింత పెంచే అవకాశం లేకపోలేదు. అలాగనీ పసిడి ధర తగ్గదా.. అంటే ఏమో తగ్గొచ్చేమో..! అయితే, ధరలు తగ్గడానికి కూడా కొన్ని పరిస్థితులు సహకరిస్తాయి. అవేంటీ..? అంటే, బంగారం ధర తగ్గుతుందని అనుకోవచ్చా..?
తగ్గిన అమెరికా వృద్ధి రేటు అంచనాలు
గత కొంత కాలంగా బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుండీ ప్రారంభంలో స్టాక్ మార్కెట్ లాభలను తాకినప్పటికీ… తర్వాత భారీ నష్టాలను చవిచూస్తోంది. దీంతో పాటు డాలర్ బలహీనంగా మారడం.. అమెరికా వృద్ధి రేటు అంచనాలు తగ్గడంతో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ కన్నా బంగారంలో పెట్టుబడి పెట్టడమే సురక్షితంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో.. పెద్ద ఎత్తున బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు.
ఆస్తి విలువ భారీగా పెరిగితే మార్పుకు గురయ్యే ఛాన్స్
ఇన్వెస్టర్లు ఎక్కువగా గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడులు భారీగా పెడుతున్నారు. ఇప్పుడు, భారత్, చైనా యూరప్ దేశాల్లో కూడా బంగారానికి డిమాండ్ పెరిగింది. అయితే, ఈ ధరలు ఇలాగే కొనసాగుతాయా అంటే కచ్ఛితంగా చెప్పలేని పరిస్థితి. దేనికైనా ఒక పరిమితి ఉండకపోదు. అందుకే, ఇది ఇలాగే కొనసాగే అవకాశం లేదని కూడా చెప్పొచ్చు. ఏదైనా ఒక ఆస్తి విలువ భారీగా పెరిగినప్పుడు అది మళ్లీ మార్పుకు గురయ్యే అవకాశం ఉంటుంది. మదుపర్లు భారీ లాభాలను బుక్ చేసుకునే పరిస్థితులు వచ్చినప్పడు ఆ ప్రభావం బంగారం ధరలను మళ్ళీ తగ్గిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి లాభాల బుకింగ్
అయితే, బంగారం ధర తగ్గడానికి దారి తీసే ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి, గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి లాభాల బుకింగ్. గత మూడు నెలలుగా బంగారం ఈటీఎంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా మధుపరులు పెద్ద ఎత్తున ఇందులో పెట్టుబడులు పెట్టారు. అయితే, ఈ గోల్డ్ ఈటీఎఫ్ బాండ్ల నుంచి లాభాలను సాధించడానికి తాత్కాలిక లాభం కోసం ఎదురు చూసే పెట్టుబడిదారులు ఆసక్తి చూపే అవకాశం ఉంది.
రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంపై ఇంకా లేని స్పష్టత
ఒకవేళ అదే జరిగితే బంగారం ధర మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. అలాగే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుకు అవకాశం కూడా లేకపోలేదు. అగ్రదేశం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గిస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే, ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు బంగారం మార్కెట్లో స్తబ్దత నెలకొనే అవకాశం ఉంది. ఒకవేళ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచినట్లయితే, దాని ప్రభావం బంగారంపై పడి దాని ధర తగ్గే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
యూఎస్ ట్రెజరీ బాండ్ల రాబడి పెరిగితే పసిడిపై ప్రభావం
ఇక, అమెరికా డాలర్ పటిష్టంగా మారి… యూఎస్ ట్రెజరీ బాండ్ల రాబడి పెరిగినా కూడా దాని ప్రభావం పసిడి ధరపై ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లో డాలర్ బలపడితే మదుపరులు తమ పెట్టుబడులను బంగారం కన్నా కూడా డాలర్‌లో పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, డాలర్ బలపడినప్పుడు అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల పైన వడ్డీ కూడా పెరుగుతుంది. ఫలితంగా బాండ్స్ నుంచి స్థిరమైన ఆదాయం పొందడానికి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం కన్నా కూడా అమెరికా జారీ చేసే యూఎస్ ట్రెజరీ బాండ్ల పైన ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశం ఎక్కువ. ఫలితంగా బంగారం డిమాండ్ తగ్గి ధర తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
స్టాక్ మార్కెట్ రికవరీ అయ్యే అవకాశం
ఇక, స్టాక్ మార్కెట్ రికవరీ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. నిజానికి, బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం స్టాక్ మార్కెట్ పతనం దిశగా వెళ్లడమే. అయితే మార్కెట్ ట్రెండ్స్ సూచిస్తున్న సూచికల ప్రకారం.. పలు ప్రధాన సూచీల్లో డౌన్ ట్రెండ్ అనేది దాదాపు ముగిసినట్లే ఉందనే వాదనలు వస్తున్నాయి. ఇక్కడ నుంచి మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుంది. అయితే, కరెక్షన్ అనంతరం మళ్లీ షేర్లను కొనుగోలు చేసేందుకు మధుపర్లు ఆసక్తి చూపించే అవకావం ఉంది.
ధర దాదాపు రూ.75వేల నుండి 70వేల మధ్యలో తగ్గే అవకాశం
ప్రస్తుతం బంగారం ఒక ఔన్సు ధర $3000 డాలర్ల సమీపంలో ఉంది. వచ్చే రెండు మూడు నెలల్లో ఇందులో గణనీయమైన తగ్గుదల ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బంగారం ధర కనీసం 10% తగ్గే అవకాశం ఉంది. అప్పుడు దేశీయ మార్కెట్లో బంగారం ధర దాదాపు రూ.75 వేల రూపాయల నుంచి రూ.70 వేల రూపాయల మధ్యలో తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పసిడి ధరలో చారిత్రాత్మకమైన తగ్గుదల కనిపించదు
నిజానికి, ఆస్తి ఎలాంటిదైనా దాని భవిష్యత్తు ధరను ఖచ్చితత్వంతో అంచనా వేయడం అసాధ్యం. అయితే, మార్కెట్ పరిస్థితులు నాటకీయంగా మారకపోతే… భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారీగా చల్లబడకపోతే… లేదంటే, స్టాక్ మార్కెట్ పనితీరు స్థిరంగా మెరుగుపడటం మొదలవ్వకపోతే… బంగారం ధరను ఆపడం కష్టమే. అయితే, పసిడి ధర పెరుగుదల అలాగే కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు ఈ ఆందోళనలను మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, బంగారం ధరను అంతర్జాతీయంగా చాలా అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అయినప్పటికీ… కొన్ని అంశాల్లో పురోగతి ఉంటే, ధర తగ్గే అవకాశం లేకపోలేదు. అయితే, ఒకసారి బంగారం ధర పెరిగిన తర్వాత, చారిత్రాత్మకమైన తగ్గుదల అనేది అందులో కనిపించదు. అంటే, పెద్దగా తగ్గదు. కాబట్టి రాబోయే నెలల్లో బంగారం ఔన్సుకు $3,500 వైపు వెళ్లడం చూసి ఖంగుతినాల్సిన అవసరం లేదు. దానికంటే తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.