Indian Railways: దేశంలోని ప్రముఖ మెట్రో వ్యవస్థలలో ఒకటిగా కొనసాగుతున్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక నిర్ణయం తీసుకుంది. తన నెట్ వర్క్ లో అర్బన్ ఫ్రైట్ (కార్గో) సేవలను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. రద్దీ లేని సమయాల్లో ఢిల్లీ-NCR అంతటా పార్శిళ్లను రైళ్ల ద్వారా రవాణా చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు DMRC, ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ బ్లూ డార్ట్ తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కొద్ది రోజుల పాటు చివరి కోచ్ లను సరుకు రవాణా కోసం వినియోగించనున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల ప్రయాణీకులపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. సరుకు రవాణాకు ఇలాంటి పైలట్ ప్రాజెక్ట్ ను చేపట్టిన మాడ్రిడ్ మెట్రో నుంచి ప్రేరణ పొందినట్లు ఢిల్లీ మెట్రో వెల్లడించింది.
ఆన్ రోడ్ రద్దీ తగ్గే అవకాశం
ఢిల్లీలో మెట్రో సేవలు చాలా లైన్లలో ఉదయం 6 గంటలకు ప్రారంభం అవుతాయి. సరుకు రవాణా నిర్ణయం దక్షిణాసియా పసిఫిక్ ప్రాంతంలో ఇదే తొలిసారి అని ఢిల్లీ మెట్రో అధికారులు వెల్లడించారు. ఇదో వినూత్న చొరవగా DMRC కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ దయాల్ అభిప్రాయపడ్డారు. పర్యావరణ నిర్వహణ, మరింత స్థిరమైన లాజిస్టిక్స్ పరిష్కారాలను పెంపొందించడంలో భాగంగా DMRC, బ్లూ డార్ట్ కలిసి పని చేయబోతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం కారణంగా సరుకు రవాణా సేవలో ఆన్ రోడ్ రద్దీని తగ్గించడంలో కీలక ముందగుడు పడే అవకాశం ఉందని ఢిల్లీ మెట్రో అధికారులు వెల్లడించారు. “ఈ వినూత్న నిర్ణయం కారణంగా సరుకుల రవాణా రోడ్డు రవాణాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. తద్వారా రోడ్ల మీద రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. వాహన ఉద్గారాలను అరికట్టే అవకాశం ఉంటుంది. అదే సమయంలో DMRC పర్యావరణ అనుకూల రవాణా పరిష్కారాలకు అందిస్తుందన్నారు.
మాడ్రిడ్ మెట్రో పార్శిల్ సర్వీసు సేవల ప్రేరణతో..
అటు స్పెయిన్ లోని మాడ్రిడ్ మెట్రో తన నెట్ వర్క్ ద్వార పార్శిల్‌లను డెలివరీ చేస్తోంది. అక్టోబర్ 2024లో అక్కడ ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యింది. రాత్రి 7- 8 గంటల మధ్య సరకు పార్శిళ్లను రవాణా చేయడానికి ప్రత్యేక రైలును ఉపయోగిస్తుంది. ప్రస్తుతం తాము కూడా మాడ్రిడ్ ప్రాజెక్ట్ ను అధ్యయనం చేస్తున్నట్లు DMRC తెలిపింది. అయితే కార్గో కోసం ప్రత్యేక రైలును ఉపయోగించకుండా.. ప్రయాణీకులు, సరుకు ఒకే రైలులో ప్రయాణించే హైబ్రిడ్ మోడల్ ను ఉపయోగించనున్నట్లు తెలిపింది. “నగరంలో సరుకు రవాణాలోఉత్తమ పద్ధతులను పాటించేందుకు DMRC మాడ్రిడ్ మెట్రోను ఆదర్శంగా తీసుకుంటుంది. వారి పద్దతులను ఇక్కడికి అనుగుణంగా మలిచి అమలు చేయబోతోంది” అని ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ సేవలను విస్తృత పరచనున్నట్లు వెల్లడించారు. మరికొద్ది రోజుల్లోనే పార్శిళ్ల రవాణాపై పూర్తి స్థాయిలో అవగాహన వస్తుందన్నారు. అటు దేశంలోని వివిధ మెట్రో సంస్థలు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నాయి.
Read Also: ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైపర్ లూప్ ట్యూబ్, వేగం ఎంతో తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!