BigTV English

Tuni Politics: తునిలో ఏం జరుగుతుంది..? గెలుపు ఎవరిది..? ఓటమి ఎవ్వరిది ?

Tuni Politics: తునిలో ఏం జరుగుతుంది..? గెలుపు ఎవరిది..? ఓటమి ఎవ్వరిది ?

Tuni Politics: కాకినాడ జిల్లా తుని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నాలుగో సారి కూడా వాయిదా పడింది. తుని మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్- 2(టూ) ఎన్నిక రణరంగంగా మారుతుంది. రెండుసార్లు నోటిఫికేషన్లు, నాలుగు సార్లు ఎన్నిక కోసం యంత్రాంగం ఏర్పాట్లు చేసినా ఎన్నిక మాత్రం జరగడం లేదు. 28 మంది కౌన్సిలర్లు ఉన్న తుని మున్సిపల్ కౌన్సిల్ లో ఎవరు మద్దతు ఎవరి వైపు ఉందో అర్థం అంతుపట్టడం లేదు. వైస్ చైర్మన్ పదవిని కచ్చితంగా గెలిచి తీరాలని టిడిపి పట్టుదలతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పట్టు చేజార్చుకోకూడదని వైసీపీ పావులు కదుపుతుంది. ఆ క్రమంలో తునిలో పొలిటికల్ రచ్చ యావత్తు రాష్ట్రం దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది. అసలు పెద్దగా ప్రాధాన్యత లేని ఆ పదవి కోసం రెండు పార్టీలు ఎందుకంత మంకు పట్టు పడుతున్నాయి?


ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న తుని

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పటి నుంచి 2004 ఎన్నికల వరకు అంటే రెండు దశాబ్దాలకు పైగా మాజీమంత్రి, సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు తునిలో చక్రం తిప్పుతూ తన కంచుకోటగా మార్చుకున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి రాజా అశోక్‌బాబు చేతిలో పరాజయం పాలైన యనమల ఇక ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. తునిలో అన్న వారసత్వాన్ని అంది పుచ్చుకున్న యనమల కృష్ణుడికి మూడు సార్లు పోటీ చేసినా ఒక్కసారి కూడా విజయం దక్కలేదు.


వరుసగా 2 సార్లు గెలిచిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా

తుని నియోజకవర్గం నుండి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి వరుసగా గెలిచిన దాడిశెట్టి రాజా మంత్రి పదవి దక్కించుకుని సెగ్మెంట్లో సొంత కేడర్ని సెట్ చేసుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో యనమల తన తమ్ముడ్ని కాదని కూతురు దివ్యని ఎన్నికల బరిలో దింపి గెలిపించుకోగలిగారు. ఇక అప్పటి నుంచి తుని రాజకీయం హాట్‌హాట్‌గా తయారైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడికక్కడ స్థానిక సంస్థలపై ఆ పార్టీ నాయకులు ఫోకస్ పెడుతున్నారు. అందులో భాగంగా టీడీపీ తుని మున్సిపల్ కౌన్సిల్ లోని రెండో వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో అనివార్యం అవుతున్న ఎన్నికలు

టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీడీపీలోకి జాయిన్ అవుతుండటంతో స్థానికి సంస్థల్లో కీలక పదవులకు ఎన్నికలు అనివార్యం అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ వారికి రాజకీయ ఉపాధి కల్పించడానికి మున్సిపల్‌ కౌన్సిల్స్‌లో ఇద్దరు వైస్ చైర్మన్‌ల సంప్రదాయానికి తెర లేపింది. చైర్మన్, వైస్ చైర్మన్ వన్.. పదవీకాలం ఐదు సంవత్సరాలు ఉంచిన వైసీపీ.. వైస్ చైర్మన్ టూ .. పదవీకాలం రెండున్నర సంవత్సరాలు ఉండేలా చట్ట సవరణ చేసింది. రెండున్నరేళ్ల తర్వాత కొత్త వాళ్లకు అవకాశం కల్పించడానికి ఏర్పాటు చేశారు. వైసిపి గతంలో చేసిన ఆ తప్పే ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారింది.

4 సార్ల నుంచి కోరం లేక వాయిదా పడుతున్న ఎన్నిక

ఆ క్రమంలో తుని మున్సిపల్ కౌన్సిల్లోని వైస్ చైర్మన్ – టూ పదవికి జరుగుతున్న ఎన్నిక ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రెండుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చి నాలుగు సార్లు ఎన్నికల ప్రక్రియ జరపడానికి ప్రయత్నం చేసినా.. కోరం లేక ఎప్పటికప్పుడు ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. తుని మున్సిపల్ కౌన్సిల్లో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వాస్తవానికి తుని మున్సిపాల్టీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లకుగాను వైసీపీ బలం 27గా ఉండేది. ఒకరు చనిపోగా, ప్రభుత్వ ఉద్యోగం రావడంతో మరొకరు రాజీనామా చేసి వెళ్లిపోయారు. మిగిలిన 28 మంది కౌన్సిలర్లకు తోడు తుని ఎమ్మెల్యే యనమల దివ్యకి ఎక్స్ అఫీషియో సభ్యురాలి హోదా ఉండటంతో మొత్తం 29 ఓట్లతో ఎన్నిక జరగాల్సి ఉంది.

తొలిసారి 28 మంది కౌన్సిలర్లు హాజరైనా జరగని ఎన్నికలు

ఇప్పటికే రెండుసార్లు తుని మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ పదవికి ఎన్నిక జరపడం కోసం నోటిఫికేషన్ ఇచ్చి నాలుగుసార్లు ఎన్నికలు జరపడానికి ప్రయత్నం చేసినా.. సరిపడా కోరం లేకపోవడంతో ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికలను వాయిదా వేసారు. మొదటిసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి వైస్ చైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు చేశారు 28 మంది కౌన్సిలర్లు హాజరు అయ్యారు. అయితే అప్పుడు టిడిపి నాయకులు, కార్యకర్తలు వైసిపి కౌన్సిలర్లను కౌన్సిల్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. మరుసటి రోజు రెండోసారి ఎన్నికకు ఏర్పాట్లు చేశారు. రెండోసారి కూడా అదే సీన్ రిపీట్ అయింది.

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన 10 మంది కౌన్సిలర్లు

రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చి ముచ్చటగా మూడోసారి ఎన్నిక కోసం ఏర్పాట్లు చేసే సమయానికి వైసీపీ నుండి 10 మంది కౌన్సిలర్లు టిడిపిలోకి జంప్ అవడంతో రచ్చ మొదలైంది. ఒక కార్పొరేటర్ అనారోగ్యంతో హైదరాబాదులో ఉండటంతో.. మిగిలిన 17 మంది కార్పొరేటర్లు ఎక్కడ చేజారి పోతారనే ఆందోళనతో.. వారందర్నీ మున్సిపల్‌ చైర్‌పర్సన్ సుధారాణి ఇంటి వద్దకు వైసీపీ నేతలు తరలించారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్వయంగా రంగంలోకి దిగడంతో వైస్ చైర్మన్ ఎన్నిక కాస్తా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.

చలో తునికి పిలుపునిచ్చిన దాడిశెట్టి రాజా

తాజాగా నాలుగోసారి వైస్ ఛైర్మన్ ఎన్నికలకు రంగం సిద్దం చేస్తే.. వైసీపీ నేతల రంగ ప్రవేశంతో మళ్లీ ఉద్రిక్తంగా మారింది.ఈ ఎన్నిక సజావుగా జరగాలన్న పేరుతో దాడిశెట్టి రాజా .. చలో తుని.. కి పిలుపిస్తూ.. వైసీపీ శ్రేణులు తరలిరావాలని కోరడం మరింత హీట్ పెంచింది. టిడిపికి చెందిన పదిమంది కౌన్సిలర్లు ఎన్నిక కోసం కౌన్సిల్ కి రావడం, వైసీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో మళ్లీ నాలుగోసారి వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఛైర్‌పర్సన్‌ సుధారాణి ఇంట్లో ఉన్న 17 మంది వైసీపీ కౌన్సిలర్లు బయటకు రాకుండా దాడిశెట్టి రాజా, ఇతర నాయకులు గేటుకు తాళాలు వేయడంతో దాడిశెట్టి రాజాపై పోలీసు కేసు నమోదైంది.

Also Read: కిరణ్ రాయల్ రాజకీయ జీవితానికి చెక్ పడనుందా?

మాజీ మంత్రులకు ప్రతిష్టాత్మంకంగా మారిన వైస్ ఛైర్మన్-2 పదవి

తుని నియోజకవర్గంలో ప్రస్తుతం టిడిపి అధికారాన్ని చేపట్టడం.. మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ప్రభావం ఉన్న నియోజకవర్గం కావడం, ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నిక కావడంతో అటు యనమల రామకృష్ణుడికి ఇటు ఆయన కూతురు ఎమ్మెల్యే దివ్యకి కూడా వైస్ చైర్మన్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. వైస్ చైర్మన్ టు పదవి అనేది చూడడానికి చిన్న పదవిగానే కనిపిస్తున్నా తునిలో మాత్రం ఇద్దరు మాజీ మంత్రుల మధ్య వైరంలా మారింది.

ఏ స్థాయికి వెళ్లడానికైనా వెనకాడని నాయకులు

మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దాడిశెట్టి రాజాలు తమ ప్రాభవాన్ని కాపాడుకోవడంతోపాటు , తమ కేడర్‌కు భరోసా ఇవ్వడానికి.. ఈ ఎన్నికను కీలకంగా తీసుకోవడంతో.. ఆ స్థాయిలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. అటు వైసీపీ ఇటు టిడిపి రెండు పార్టీలు ఆ పదవిని కైవసం చేసుకోవడానికి ఏ స్థాయికి వెళ్లడానికైనా వెనకాడడం లేదు.. మరి ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడిన ఎన్నిక రానున్న రోజుల్లోనైనా జరుగుతుందో? లేదా ఇలాగే పొలిటికల్ వార్‌తో వాయిదాల పర్వమే కొనసాగుతుందో చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×