Ramnath Kovind Report: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకే దేశం, ఒకే ఎన్నికల నినాదాన్ని మొదటి టర్మ్‌లోనే ఎత్తుకుంది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో జమిలి ఎన్నికలు నిర్వహించే నిర్ణయాన్ని పొందుపరిచింది. ప్రధాని మోదీ ఈ విధానాన్ని మొదటి నుంచి సమర్థిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో బీజేపీ మూడోసారి వరుసగా అధికారాన్ని చేపట్టిన తర్వాత జమిలి ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలు, నిర్వహణకు ఎదురయ్యే అడ్డంకులు, పరిష్కారాలపై సమగ్ర నివేదిక ఇవ్వడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టును అందించింది. తాజాగా మోదీ సారథ్యంలోని మంత్రివర్గం ఈ నివేదికకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా అంగీకరించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఒక వైపు కేంద్ర ప్రభుత్వం జమిలి విధానాన్ని ముందుకు తెస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తాజాగా కాంగ్రెస్ సారథ్యంలో 15 ప్రతిపక్ష పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశాయి. జమిలి ఎన్నికల విధానాన్ని ముందుకు తేవాల్సిన అవసరం ఏమిటీ? ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే ఎవరికి లాభం?.. ఈ వివరాలు తెలుసుకుందాం.
దేశంలో ఎన్నికల ప్రక్రియ ఎడతెగని విధంగా ఉంటుందని, ప్రతి నెలా ఏదో ఒక చోట ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరంలో కనీసం మూడు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. స్థానిక ఎన్నికలు మరోసారి జరుగుతాయి. ఉపఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా ఎన్నో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఎన్నికల కోసం ప్రత్యేకంగా అధికారులకు విధులు వేయడం, నిధులు ఖర్చు పెట్టుకోవడం, భద్రతా సిబ్బందిని ఉపయోగించడం, పాలనా సమయాన్ని వెచ్చించడం, ఈ ఎన్నికల కోసం తరుచూ ఎన్నికల కోడ్ విధించడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడటం వంటివి జరుగుతున్నాయి. వీటన్నింటికి విరుగుడుగానే జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నది. తద్వార సమయాన్ని, నిధులను ఆదా చేసుకోవచ్చని, భద్రతా బలగాలు, అధికారులకు ప్రత్యేక విధులు వేసి, అడ్మినిస్ట్రేటివ్‌పై అనవసర భారాన్ని తగ్గించవచ్చని వాదిస్తున్నది.
Also Read: కశ్మీర్ ఎన్నికలు.. కమలానికి అగ్నిపరీక్షే..
వాస్తవానికి ఏకకాలంలో దేశంలోని అన్ని అసెంబ్లీలు, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. అందుకు అవసరమయ్యే ఈవీఎంలు మొదలు భద్రతా బలగాలు, అధికారుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఇందుకు ఇంకా ఎక్కువ మొత్తంలోనే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రాంతీయ పార్టీలు తరుచూ జరిగే ఎన్నికల కోసం ప్రచారానికి, నిధుల కోసం ఇబ్బందులు పడుతాయని, కాబట్టి, జమిలి ఎన్నికలు వాటికి కలిసివస్తాయని కొందరు చెబుతున్నారు. కానీ, జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు అత్యధిక వనరులుండే జాతీయ పార్టీలతో తలపడాల్సి రావడం పెద్ద మైనస్‌గా చెప్పుకోవచ్చు. అన్ని ఎన్నికలు ముగిశాక.. మళ్లీ ఐదేళ్ల వరకు రాజకీయ నాయకులు బేఫికర్‌గా ఉంటారని, దగ్గరలో ఎన్నికలు ఉన్నాయంటే వారు(ముఖ్యంగా జాతీయ నాయకులు) కొంత బాధ్యతగా మెలుగుతారని సాధారణ అభిప్రాయం ఒకటి ఉన్నది.
కానీ, ప్రతిపక్షాలు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి? జమిలి ఎన్నికలు సాధ్యం కావని కాంగ్రెస్ పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు అవసరమైతే.. అప్పుడు ఎన్నికలు నిర్వహించే స్వేచ్ఛ ఉండాలని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ విధానం ప్రజాస్వామ్యాన్ని, మన దేశంలోని సమాఖ్యస్ఫూర్తిని దారుణంగా దెబ్బతీస్తుందని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ప్రచారం చేయాలనే ఆరాటంలో ఉన్న కేంద్రంలోని పెద్దల కోసం ఈ విధానం తీసుకురావడం సరికాదని ఎదురుదాడి చేశారు.
ఈ విధానాన్ని అమలు చేయడానికి ముందుగా రాజ్యాంగపరమైన అడ్డంకులు తొలగించుకోవాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి నిర్వహించేలా కొన్నింటిని రద్దు చేయడమో.. పొడిగించడమో చేయాల్సి ఉంటుంది.
బీజేపీ ఆలోచనాధారలో నుంచే?
అనేక శీతోష్ణస్థితులు, నైసర్గిక స్వరూపం, సంస్కృతి, సంప్రదాయాలు, మతాలు, వేష, భాషలు వేరుగా ఉంటాయి. బహుళత్వం, వైవిధ్యత గల మన దేశాన్ని అందుకే ఉపఖండం అని కూడా పిలుచుకుంటారు. దేశాన్నంతా ఒకే గాటన కట్టడాన్ని అందుకే ప్రజాస్వామికవాదులు వ్యతిరేకిస్తుంటారు. ఒకే నిర్ణయం అన్ని రాష్ట్రాలకు ఒకే రూపంలో అమలు చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ, బీజేపీ ఆలోచనలు చాలా వరకు దేశాన్ని యూనిఫైడ్‌గా.. ఒకే తలంగా భావించడం మనం అర్థం చేసుకోవచ్చు. ప్రాంతీయ పార్టీల ముప్పును దృష్టిలో పెట్టుకుంటే వాస్తవానికి బీజేపీకి అది అవసరం కూడా. అందుకే దేశవ్యాప్తంగా లేదా.. మెజార్టీ ప్రజలపై ప్రభావం చూపే అంశాలను బీజేపీ తన అజెండాగా మార్చుకుంటుంది. అఖండ భారత్‌ను కాంక్షించే ఈ పార్టీ.. దేశభక్తి, మతం, జీఎస్టీ, వన్ నేషన్, వన్ రేషన్ కార్డు వంటి ఆలోచనల్లాగే వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను కూడా చూడొచ్చు.