రిచ్ పీపుల్ కూడా బెంబేలెత్తేలా బంగారం ధర రోజు రోజుకీ బరువెక్కిపోతోంది. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా 10 గ్రాముల బంగారం దాదాపు 90 వేలకు దగ్గరౌతుందా అనే డౌట్ వస్తోంది. అవును, ఆల్ టైమ్ హైలో బంగారం ధర 89 వేలను తాకబోతోంది. ఇలా, రికార్డ్ స్థాయిలో ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు చూస్తుంటే… రాబోయే రోజుల్లో లక్ష దాకా చేరుకుంటుందనే అనుమానం కలుగుతోంది. పెరుగుతున్న ఈ బంగారం ధరలతో కొనుగోలుదారులకు చెమటలు పడుతున్నాయి. రాబోయేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో… గోల్డ్ మారథాన్ ఇలాగే కొనసాగితే… ఏం చేయాలా అని అంతా ఆందోళనపడుతున్నారు. అసలు, పసిడి ఎందుకిలా పరుగులు పెడుతోంది…?
రూ. 90 వేల మార్కును తాకే అవకాశం
బంగారం ధరలు గత వారం సరికొత్త రికార్డును తాకాయి. సరిగ్గా పదిరోజుల క్రితం బంగారం ధర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆల్ టైమ్ హైకి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు గాను 88 వేల రూపాయలు దాటిందంటేనే అర్థం అవుతుంది. ఇది చరిత్రలోనే సరికొత్త బెంచ్ మార్క్‌గా చెప్పొచ్చు. ట్రెండ్ ఇలాగే కొనసాగితే చరిత్రలో తొలిసారిగా బంగారం ధర రూ. 90 వేల మార్కును తాకే అవకాశం కనిపిస్తుంది. నిజానికి, గడచిన రెండు నెలలుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే వచ్చాయి. ఈ పరిస్థితిని చూస్తుంటే… 90 వేలు దాటి… లక్ష రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
పెరుగుతాయా? తగ్గుతాయా?
తొలిసారిగా ఆర్నమెంట్ బంగారం అంటే… 22 క్యారెట్ల బంగారం రూ.80 వేల రూపాయలు దాటేసింది. దీంతో ఆభరణాలు కొనుగోలు చేసేవారికి చెమటలు పట్టాయి. తులం బంగారు గొలుసు చేయించుకోవాలి అంటే దాదాపు 90 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఎందుకంటే 22 క్యారెట్ల బంగారంతో పాటు జీఎస్టీ, మేకింగ్ చార్జీలు ఇందులో అదనంగా ఉంటాయి. ఈ లెక్కన చూస్తే ఒక తులం చైన్ కొనుగోలు చేయాలంటే దాదాపు 90 వేల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంది. దీంతో సామాన్యులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వెనకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా లేక భవిష్యత్తులో కాస్తైనా తగ్గుతాయా అనే అయోమయంలో ఉన్నారు.
ఎందుకు తగ్గుతోంది? ఎందుకు పెరుగుతోంది?
ఈ నెల ప్రారంభం నుంచి దాదాపు పది వేల రూపాయలు పెరిగిన బంగారం ధర, ఇప్పుడు ఆల్ టైమ్ గరిష్టాలకు పాకుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫిబ్రవరి 25న స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2 వేల 950 డాలర్లపైన ఉండేది. ఒక్కరోజు వ్యవధిలో ఇది 30 డాలర్లకుపైగా తగ్గి ఫిబ్రవరి 26 నాటికి 2 వేల 920 డాలర్ల దిగువకు పడిపోయింది. ఒక దశలో ఇది 60 డాలర్లకుపైగా పడిపోవడం గమనార్హం. ఇంట్రాడేలో 2 వేల 890 డాలర్ల లెవెల్స్‌లో కూడా ట్రేడయింది. అయితే, ఇటీవల భారీగా బంగారం ధర పెరగ్గా.. ఆ లాభాల్ని సొమ్ము చేసుకోడానికి ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా పతనం కనిపించిందని నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ పరిస్థితులే కారణమా?
అలాగే, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర హెచ్చుతగ్గుల ప్రభావం దేశీయ మార్కెట్లలో ఉదయం 10 గంటల తర్వాత కనిపిస్తుంది. అంటే దేశీయంగా ఉదయం 10 గంటల తర్వాత పసిడి ధరలు తగ్గుతాయి. దీని ప్రకారం, ఫిబ్రవరి 26న దేశీయంగా గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. కానీ, హైదరాబాద్ నగరంలో స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర ఫిబ్రవరి 26న.. 10 గ్రాములు రూ.81 వేల 350 రూపాయలకు చేరింది. అలాగే, 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 89 వేల 450 రూపాయులగా ఉంది. దాంతోపాటు ఒక కేజీ వెండి ధర రూ. 98,550 పలికింది. బంగారం ధర 89 వేల రూపాయలు దాటి ఎప్పుడూ లేనంత సరికొత్త రికార్డును సృష్టించింది. మరోవైపు బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులు కారణమని నిపుణులు అంటున్నారు.
డోనాల్డ్ ట్రంప్ వల్లే ఈ మార్పు?
అమెరికాలో ఒక ఔన్సు బంగారం ధర ఇప్పటికే 2 వేల 950 డాలర్లు పలికింది. ఇది కూడా ఆల్ టైమ్ రికార్డే. అయితే, ఇలా బంగారం ధర భారీగా పెరగడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్యయుద్ధమే కారణమని అంటున్నారు నిపుణులు. డోనల్డ్ ట్రంప్ విధించిన సుంకాలతో అనిశ్చితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పుడు, ప్రజలు తమ పెట్టుబడులకు భద్రత కోరుకుంటారు. అందువల్ల, బంగారం డిమాండ్ పెరుగుతుంది, దాని కారణంగా బంగారం ధరలు కూడా పెరుగుతాయి. ఇప్పటికే అమెరికా స్టాక్ మార్కెట్‌తో సహా అన్ని స్టాక్ మార్కెట్లలో గడచిన కొన్ని వారాలుగా వరుస నష్టాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల పెట్టుబడిదారులు తమ డబ్బులు స్టాక్ మార్కెట్ నుంచి తరలించి బంగారం వైపు విపరీతంగా పెడుతున్నట్లు తెలుస్తోంది.
స్టాక్ మార్కెట్ పతనం.. బంగారంపై పెట్టుబడి
బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం కాగా…. స్టాక్ మార్కెట్ పతనం అవుతున్న తరుణంలో… ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని కాపాడుకునేందుకు బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఏర్పడి, బంగారం ధరలు ఆకాశాన్ని తాకడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా చైనా సెంట్రల్ బ్యాంక్ పెద్ద ఎత్తున బంగారాన్ని సేకరిస్తుంది. ఇప్పటికే చైనా ప్రతినెల వందలాది టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డాలర్ మారకాన్ని ప్రపంచ వాణిజ్య లావాదేవీలకు ఉపయోగించకపోతే అన్ని దేశాల పైన పెద్ద ఎత్తున సుంకాలను విధిస్తానని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికా డాలర్ ఆధిపత్యానికి ఎవరు అడ్డంకిగా నిలిచిన వారి పైన చర్యలు తప్పవని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు. ఇది కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణమని అంటున్నారు.
మరింత బలహీనపడుతోన్న రూపాయి
ఒకవైపు బంగారం ధర పెరగుతుంటే, మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడుతోంది. మెక్సికో, కెనడా, చైనాలపై అమెరికా అధ్యక్షుడు కొత్త సుంకాలు విధించడం, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో బలహీన ధోరణి దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ తీసుకున్న కఠిన చర్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగొచ్చనే భయం ఏర్పడింది. దీంతో సెంట్రల్ బ్యాంక్‌లు బంగారాన్ని కొనడం ప్రారంభించాయి. డాలర్ విలువతో రూపాయి మరింత బలహీనపడడం, మిడిల్ ఈస్ట్‌లో అనిశ్చితి, రష్యా-యుక్రెయిన్ యుద్ధాల కారణంగా కూడా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు.
యూఎస్ డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో వారి రిజర్వులను పెంచుకోడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య, బంగారంపై పెట్టుబడులను చాలామంది హెడ్జింగ్ వ్యూహంగా భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లలో నష్టాలు వచ్చే అవకాశముందని భయపడుతున్నారు. అందుకే బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో, బంగారం ధర పెరుగుదల ట్రెండ్ కొనసాగవచ్చని అంటున్నారు విశ్లేషకులు.
బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అనేక ట్రంప్ నిర్ణయాలు, అంతర్జాతీయ కారణాలతో పాటు దేశీయంగా కూడా పలు కారణాలు ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఎత్తున పతనం అవుతున్నాయి. ముఖ్యంగా, ఐటీ కంపెనీలు అదేవిధంగా ఫార్మా రంగానికి చెందిన కంపెనీలు పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. వీటితో పాటు, ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధం… ఈక్విటీ మార్కెట్లు బలహీన పడటం వంటివి తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో బంగారాన్ని అందనంత ఎత్తుకు తీసుకెళ్తాయనే అంచనాలు ఉన్నాయి.
మరోవైపు ‘ద్రవ్యోల్బణం’ దెబ్బ
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితులు కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం అన్ని దేశాల్లోనూ ఉంది. ఇటీవల, మెక్సికో, కెనడా నుండి వచ్చే దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం ఒక నెల పాటు సుంకాన్ని నిలిపివేసినప్పటికీ… ఈ ఉపశమనం తాత్కాలికమేననీ.. కొన్ని వారాల్లో ట్రంప్ అనుకున్నట్లే టారిఫ్‌లు ఖాయంగా వేస్తారనే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి, ద్రవ్యోల్బణం ఆందోళనతో పాటు బంగారం ధర మళ్లీ పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కెనడియన్, మెక్సికన్ ఉత్పత్తులపై 25% సుంకాలు… చైనా వస్తువులపై 10% సుంకాలు విధించడం వల్ల అమెరికాలోని అనేక వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇదే ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నట్లు తెలుస్తోంది.
బంగారం ధర తగ్గే అవకాశాలు తక్కువే
ఇక, పన్నులను తగ్గించి, వలసలను సరిదిద్దుతామని ట్రంప్ చేస్తున్న ప్రతిజ్ఞలు… అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. దీనితో ధరలు మరింత పెరుగుతాయని కూడా ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఇది ప్రపంచ వృద్ధిపై పెద్ద ప్రభావాన్ని చూపబోతుండగా… బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో కొత్త పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ ఇంకా కొనసాగే అవకాశం కూడా ఉంది. దీంతో, గోల్డ్ మారథాన్‌కి ఇప్పుడప్పుడే బ్రేక్ పడేటట్లు కనిపించట్లేదు.
యుద్ధ భయమూ కారణమే..
ఇక, అంతర్జాతీయంగా నడుస్తున్న వాణిజ్య యుద్ధ భయం బంగారాన్ని రికార్డు స్థాయికి తీసుకెళుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనా వస్తువులపై ట్రంప్ 10% దిగుమతి సుంకం వేసిన తర్వాత… ప్రతీకారంగా, అమెరికా నుండి బొగ్గు, LNG దిగుమతులపై 15% సుంకాలను చైనా విధించింది. ముడి చమురు, వ్యవసాయ యంత్రాలు, భారీ రవాణా వాహనాలు, పికప్ ట్రక్కులకు సంబంధించి అమెరికా నుండి వచ్చే దిగుమతులపై 10% సుంకాలు ఉంటాయని కూడా ప్రకటించింది.
కాగా… ఇది సరఫరా గొలుసులను భారీగా దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే, ప్రపంచ వృద్ధిని మందగించే వాణిజ్య యుద్ధం భయాలను కూడా పెంచుతోంది. ఇక, ఆర్థిక, భౌగోళిక రాజకీయాలు అత్యంత అస్థిరంగా ఉన్న సమయంలో బంగారాన్ని సాంప్రదాయకంగా సురక్షితమైన ఆస్తిగా చూస్తున్నారు. దీనితో, దేశీయంగా కూడా పలు సంస్థలు, ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది పసిడి ధరలు పెరుగుదల ఊపును మరింత కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.
ఈక్విటీ మార్కెట్ పోకడలూ.. కారణమే
బలహీనమైన త్రైమాసిక ఆదాయాలు, విదేశీ పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాల మధ్య ఇటీవలి నెలల్లో దేశీయ మార్కెట్లు షార్ప్ అమ్మకాలను చూశాయి. ఇలా నిదానంగా నడుస్తున్న ఈక్విటీ మార్కెట్ పోకడలు కొంతమంది పెట్టుబడిదారుల డబ్బును బంగారం, వెండి లాంటి విలువైన లోహాలవైపు తిప్పుతోంది. ఇలాంటి తక్కువ-రిస్క్ ఆస్తులకు వారి డబ్బంతా మళ్లిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో… గతవారంలో యూఎస్ డాలర్ సూచిక మూడు వారాల గరిష్ట స్థాయికి చేరి, రూ.109.88కి చేరుకుంది. దీనికి తోడు… అమెరికాలో రేటు కోతలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి.
ట్రంప్ టారిఫ్ వార్తల కారణంగా…. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి అంచనా వేసిన దానికంటే త్వరగా రేటు కోతల ఆశలపై స్టాక్ మార్కెట్లు నమ్మకం కోల్పోయాయి. ప్రెసిడెంట్ ట్రంప్ రేటు కోతలకు పలుమార్లు పిలుపునిచ్చినప్పటికీ… సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడు వడ్డీ రేట్లను ఎక్కువ కాలం స్థిరంగా ఉంచుతుందని భావిస్తున్నారు. ఇక, నిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా సడలింపు వేగం మందగించవచ్చని కూడా ఫెడ్ తన సెప్టెంబర్ సమావేశం తర్వాత హెచ్చరించింది. ఇది మార్కెట్లకు మరో అనిశ్చితికి కారణం అయ్యింది. కాగా, ఇది సురక్షితమైన ఆస్తుల వైపు డిమాండ్‌ను పెంచింది.
కస్టమ్స్ సుంకం తగ్గింపు ప్రభావం
ఇక, దేశీయ మార్కెట్లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 2, 2025 నుండి అమలులోకి వచ్చేలా ఆభరణాలు, విడిభాగాలపై కస్టమ్స్ సుంకం తగ్గింపును 25% నుండి 20%కి ప్రకటించారు. ఆభరణాల సుంకాన్ని తగ్గించడం వల్ల దేశీయ డిమాండ్ పెరుగుతుందనీ… ముఖ్యంగా లగ్జరీ విభాగంలో ఇది పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిస్థితి బంగారం ధరలను పెంచవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో… ఫిబ్రవరి మొదట్లోనే ప్రధాన భారతీయ ఆభరణాల వ్యాపారుల షేర్లు 9% వరకు పెరిగాయి. ఇది బంగారం ధరలను మరింత పెంచే అవకాశం ఉందని అప్పుడే ఒక అంచనా వచ్చింది. ఈ మధ్యలో, భారత ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్-SGB పథకాన్ని నిలిపివేయాలనే ఆలోచన చేసింది.
కేంద్ర బడ్జెట్ 2025 SGBల గురించి బడ్జెట్‌లో ఏమీ ప్రస్తావించనప్పటికీ… బడ్జెట్ తర్వాత జరిగిన సంభాషణలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు సూచించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మార్కెట్ నుండి రుణాలను సమీకరించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించింది. కానీ ఇది అధిక ఖర్చుతో కూడుకున్న రుణంగా మారింది. అందువల్ల ఈ మార్గాన్ని కొనసాగించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.
మీడియా నివేదికల ప్రకారం, రుణాలు తీసుకోవడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం SGB పథకాన్ని నిలిపివేయనుంది. ఇటీవలి అనుభవాల ప్రకారం, ఇది ప్రభుత్వానికి చాలా ఎక్కువ ఖర్చుతో కూడిన రుణంగా భావిస్తున్నారు. ఫలితంగా, ప్రభుత్వం దాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ ఆ మధ్య మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ పథకాన్ని కేంద్ర మంత్రివర్గం… సెప్టెంబర్ 2015లో ఆమోదించింది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం బంగారు దిగుమతులను తగ్గించడం.
చివరి సావరిన్ గోల్డ్ బాండ్ ఫిబ్రవరి 2024లో జారీ చేశారు. కాగా, గ్రాముల బంగారంలో సూచించిన SGBలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ముందుగా డిసైడ్ చేసిన రేటు ప్రకారం వడ్డీ చెల్లిస్తారు. కాగా, SGBలపై ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 2.5%గా ఉంది. అయితే, గోల్డ్ బాండ్ స్కీంలో బంగారం రేటు పెరిగితేనే లాభాలు వస్తాయి. కనుక, ప్రభుత్వం భారం తగ్గించుకోవాలని పథకాన్ని నిలిపివేసింది. దీంతో, మధ్య తరగతి కాస్త అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు, బంగారం ధర ఆకాశానికి అంటుతున్న తరుణంలో… పసిడి ప్రియులు నిరాశకు గురౌతున్నారు.
ఏ వ్యాపారానికైనా డిమాండ్ ఉంటేనే ధర పెరుగుతుంది. బంగారం కూడా ఈ సిద్ధాంతంలో భాగమే. అందుకే, ధర పెరిగిందని కస్టమర్లు కొనడం మానేస్తే… ఆటోమేటిక్‌గా బంగారం ధర దిగాల్సిందే. మరి, ఈ ఆటలో మార్కెట్‌ను మార్చే ట్రంప్ నిర్ణయాలు గెలుస్తాయో… ఏ వస్తువు డిమాండ్‌నైనా నియంత్రించగలిగిన వినియోగదారుడు గెలుస్తాడో చూద్దాం.