Indian Rupee Fell: పడుతోంది. పడేకొద్దీ.. ఇంకా పడుతోంది. అలా.. పడి.. పడి.. ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోయింది మన రూపాయి. ఇప్పుడు ఒక్క అమెరికన్ డాలర్ విలువ.. 90 రూపాయలు. ఇది.. అమెరికాలో ఉండే వారికి గొప్పగానే ఉండొచ్చు. కానీ.. భారత కరెన్సీ విలువ పడిపోవడం ఎంతమాత్రం గొప్ప విషయం కాదు. రోజులు గడిచేకొద్దీ రూపాయి విలువ దారుణంగా పతనమవుతోంది. అసలు.. మన రూపీ ఎందుకిలా పడిపోతోంది. దీని వెనకున్న కారణాలేంటి?
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో.. ఇండియా కరెన్సీ రూపాయి విలువ.. దారుణంగా పతనమైంది. తొలిసారి డాలర్‌తో పోలిస్తే ఏకంగా 90 మార్క్‌ను దాటి ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. ప్రపంచ, దేశీయ అంశాల నుంచి కరెన్సీపై కొన్ని వారాలుగా ప్రెజర్ పెరుగుతోంది. ఈ క్రమంలో రూపాయి పతనమైన తీరు అందరినీ షాక్‌కి గురిచేసింది. విదేశీ పెట్టుబడిదారులు.. భారత మార్కెట్ల నుంచి డబ్బుని ఉపసంహరించుకోవడం, షార్ట్ కవరింగ్ కొనసాగడంతో.. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడింది. ఇవన్నీ.. రూపాయి క్షీణించేందుకు కారణమయ్యాయ్. భారత్-అమెరికా వాణిజ్య చర్చలపై సందిగ్ధత, విదేశీ సంస్థాగత మదుపర్ల లాభాల స్వీకరణ లాంటివి కూడా.. రూపాయి విలువని బలహీనపరుస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలాగే కొనసాగితే.. రూపాయి విలువ 91కి పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఇంకా కుదరకపోవడం, పదే పదే జాప్యం కారణంగా.. రూపాయి తొలిసారి 90 మార్క్ కంటే దిగువకు పడిపోయింది. మార్కెట్లు ఇప్పుడు విస్తృతమైన హామీల కంటే బలమైన సంఖ్యలను కోరుకుంటున్నాయి. ఫలితంగా.. కొన్ని వారాలుగా రూపాయిలో అమ్మకాలు వేగంగా సాగుతున్నాయి. పెరిగిన వస్తువుల ధరలు.. సెంటిమెంట్‌ని మరింత దెబ్బతీశాయి.
అధిక స్థాయిలో మెటల్, బంగారం ధరలు భారతదేశ దిగుమతి బిల్లుని మరింత దిగజార్చాయి. అమెరికా సుంకాలు సైతం ఎగుమతుల పోటీతత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లు ఖనిజ ఇంధనాలు, యంత్రాలు, విద్యుత్ పరికరాలు, రత్నాల లాంటి దిగుమతుల రంగాలతో పోలిస్తే.. ఇది ఈక్విటీలలో సెంటిమెంట్‌ను బలహీనపరిచిందని చెబుతున్నారు. ఆర్బీఐ జోక్యం లేకపోవడం వల్లే.. రూపాయి క్షీణించిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్పష్టమైన సంకేతం కోసం మార్కెట్ వెయిట్ చేస్తోంది. ఆర్బీఐ విధాన ప్రకటనతో.. కరెన్సీని స్థిరీకరించడానికి సెంట్రల్ బ్యాంక్ అడుగుపెడుతుందా? లేదా? అనే దానిపై మార్కెట్లు స్పష్టతని ఆశిస్తున్నాయ్. టెక్నికల్‌గా.. రూపాయి ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. ఇప్పుడది.. 89 లోపు బలపడటం ఎంతో అవసరం. అందువల్ల.. రూపాయి 90 పైన స్థిరపడుతుందా? మరింత పడిపోతుందా? అనేదే ఇప్పుడున్న మేజర్ టెన్షన్. కానీ.. దిగుమతి, ఇతర రంగాలు వెంటనే అధిక ఖర్చుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంధనం, ఎలక్ట్రానిక్స్, అవసరమైన దిగుమతులు.. బలహీనమైన కరెన్సీకి సర్దుబాటు చేసుకున్న తర్వాత.. ప్రజలపై ఆ ప్రభావం పడుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న.. యూఎస్-భారత్ ట్రేడ్ డీల్‌లో కదలిక వస్తుందా? లేదా? అనేది కూడా ఆసక్తిగా మారింది. అప్పటివరకు రూపాయి మారకం విలువ.. అస్థిరంగా ఉంటుందని, వరల్డ్ సెంటిమెంట్‌లో చిన్న మార్పులు సంభవించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత రూపాయి విలువ దారుణంగా పతనమవడం.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కలిగించే అంశం. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి విలువ పడిపోవడానికి అనేక అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక అంశాలున్నాయ్. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీ రేట్లు పెంచినప్పుడు.. అంతర్జాతీయ పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే.. అమెరికన్ డాలర్ వైపు మొగ్గు చూపుతారు. దీని వల్ల.. డాలర్‌కు డిమాండ్ పెరిగి, అది మరింత బలపడుతుంది. ఫలితంగా.. మన రూపాయి సహా ఇతర దేశాల కరెన్సీల విలువ పడిపోతుంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కూడా మరో కారణం. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాల కారణంగా.. మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతుంది. ఇలాంటి సమయాల్లో, విదేశీ ఇన్వెస్టర్లు.. తమ పెట్టుబడులను భారత మార్కెట్ల నుంచి ఉపసంహరించుకుని, సురక్షితమైన డాలర్‌లోకి మారుస్తారు. వాణిజ్య లోటు వల్ల కూడా రూపాయి విలువ క్షీణిస్తుంది. ఒక దేశం చేసే దిగుమతుల విలువ, ఎగుమతుల విలువ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దానిని వాణిజ్య లోటు అంటారు. భారత్ దిగుమతులు పెరుగుతున్నా.. ఆ మేరకు పెరగడం లేదు. దిగుమతులకు డాలర్లలో చెల్లించాల్సి వస్తుంది కాబట్టి.. డాలర్ కోసం డిమాండ్ విపరీతంగా పెరిగి.. రూపాయి విలువ తగ్గుతోంది. ఇక.. దేశంలో ధరల పెరుగుదల రేటు ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.. రూపాయి కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది.. ఇన్వెస్టర్లకు అంత ఆకర్షణీయంగా ఉండదు. దాంతో.. రూపాయి బలహీనపడుతుంది.
రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. మరి.. నెక్ట్స్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో.. రూపాయి స్థిరపడుతుందా? మరింత కిందకు పడిపోతుందా? అనేదే ఇప్పుడు మేజర్ క్వశ్చన్. ఆర్బీఐ పాలసీ సిగ్నల్, విదేశీ పెట్టుబడులు, భారత్-యూఎస్ ట్రేడ్ డీల్స్ మీదే.. రూపాయి ఫ్యూచర్ ఆధారపడి ఉందా? మన రూపీ ఇలాగే పడిపోతూ ఉంటే.. మన దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితేంటి? రూపాయి విలువ పడిపోవడం వల్ల ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
ఇదే.. ఇప్పుడు హాట్ టాపిక్. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లని ఎలా నిర్ణయిస్తుందనేది ఇప్పుడు చాలా ముఖ్యం. వడ్డీ రేట్లు పెంచడం వల్ల విదేశీ పెట్టుబడులు దేశంలోకి వచ్చే అవకాశాలు పెరిగి.. రూపాయికి మద్దతు లభిస్తుంది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో.. దేశంలోకి డాలర్లు ఎంత ఎక్కువగా వస్తే.. రూపాయి అంత స్థిరంగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు.. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వల్లే రూపాయి బలహీనపడుతోంది. ఈ పరిస్థితుల్లో రూపాయి విలువ మరింత పడిపోకుండా నియంత్రించడానికి.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మారక ద్రవ్య నిల్వల నుండి డాలర్లను విక్రయిస్తుందా? మరేదైనా చర్యలు తీసుకుంటుందా? అన్నది ఆసక్తిగా మారింది. అమెరికాతో సానుకూల వాణిజ్య ఒప్పందాలు కుదిరితే.. భారత ఎగుమతులు పెరిగి, డాలర్ల రాబడి పెరుగుతుంది. ఇది రూపాయికి కొంత బలాన్ని ఇస్తుంది. అంతేకాదు.. క్రూడ్ ఆయిల్ రేట్లు రూపాయిపై అత్యంత ఎక్కువ ప్రభావం చూపుతాయ్. మన దేశం ఎక్కువగా చమురుని దిగుమతి చేసుకుంటుంది కాబట్టి.. ధరలు పెరిగితే, డాలర్ల కోసం డిమాండ్ పెరిగి.. రూపాయి పడిపోతుంది.
రూపాయి విలువ పడిపోవడం వల్ల.. ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, బంగారం లాంటి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఎందుకంటే.. ఆ వస్తువులని డాలర్లలో కొనడానికి మనం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు పెరగడం వల్ల.. దేశీయంగా ప్రజల జీవన వ్యయం కూడా పెరుగుతుంది. రూపాయి పతనం అవడం అనేది.. ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ తన చమురు అవసరాల్లో.. 85 శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడి ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు, మనం డాలర్లలో ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల డాలర్‌కు డిమాండ్ పెరిగి, రూపాయి విలువ క్షీణిస్తుంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, రవాణా ఖర్చులు పెరగడం వల్ల.. నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయ్. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు డబ్బులు పంపించాలంటే.. ఎక్కువ మొత్తంలో ట్రాన్స్‌ఫర్ చేయాల్సి వస్తుంది. విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లాలనుకునేవారికి.. డాలర్‌తో పోలిస్తే ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇక.. డాలర్లలో రుణాలు తీసుకున్న భారతీయ కంపెనీలు, సంస్థలపై.. తిరిగి చెల్లించే భారం పెరుగుతుంది. రూపాయి బలహీనపడటం వల్ల.. భారతీయ ఎగుమతిదారులకు లాభం చేకూరుతుంది. దీనివల్ల.. భారతీయ ఎగుమతిదారులు తమ వస్తువులను విదేశీ మార్కెట్‌లో ఎక్కువ రేటుకు విక్రయించగలుగుతారు. విదేశాల నుండి భారతదేశానికి డబ్బు పంపేవారికి.. డాలర్‌కు అధిక రూపాయలు వస్తాయ్.
రూపాయి విలువ ఇలాగే పడిపోతూ ఉంటే.. దాని ప్రభావం కచ్చితంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. రూపాయి పతనం వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగి.. ఆ భారం ప్రజలపై పడి, దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. రూపాయి బలహీనపడటం వల్ల.. భవిష్యత్తులో నష్టాలు రావొచ్చనే భయంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు ఉపసంహరించుకునే ప్రమాదం ఉంది. ఇది.. మరింత పతనానికి దారితీయొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. రూపాయి స్థిరపడాలంటే.. విదేశీ పెట్టుబడులు భారీగా పెరగాలి. వాణిజ్య లోటు తగ్గాలి. అంతర్జాతీయ చమురు ధరలు దిగిరావాలి. అప్పుడే.. రూపాయి తిరిగి బలపడడం మొదలవుతుంది. ఈ ఒడిదొడుకులను నివారించేందుకు.. ఆర్బీఐ కూడా జోక్యం చేసుకుంటుంది. రూపాయి విలువ పడిపోవడమనేది దేశ ఆర్థిక వ్యవస్థకు ఓ సవాల్. దీనిని అధిగమించడానికి.. ప్రభుత్వం, ఆర్బీఐ సమన్వయంతో దీర్ఘకాలిక విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది.
ప్రధానంగా.. వాణిజ్య లోటును తగ్గించడానికి దేశీయ ఉత్పత్తిని, ఎగుమతులను పెంచాలి. విదేశీ పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచి, మరింత మంది పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టేందుకు అనుకూలమైన విధానాలను తీసుకురావాలి. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గించి.. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలి. రాజకీయ, ఆర్థిక విధానాలలో స్థిరత్వం, స్పష్టత ఉండేలా చూసుకోవడం వల్ల.. విదేశీ పెట్టుబడిదారుల నమ్మకాన్ని కాపాడుకోవచ్చు. రూపాయి విలువ పతనం అనేది కేవలం.. సంఖ్యాపరమైన మార్పు కాదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న లోపాలు, అంతర్జాతీయ మార్కెట్ల ఒత్తిడికి నిదర్శనం. దీర్ఘకాలికంగా బలంగా ఉండే ఆర్థిక వ్యవస్థను నిర్మించడం ద్వారా మాత్రమే.. రూపాయి విలువను స్థిరీకరించే అవకాశం ఉంది.
Story by Anup, Big Tv