Modi Selfie: స్వేచ్చ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోలను వరుసగా పోస్టు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో సభలు, ప్రభుత్వ కార్యక్రమాలు, రేడియో ప్రసంగాల ద్వారా ప్రజలతో ఎక్కువగా సంభాషించిన మోడీ ఇప్పుడు నేరుగా కెమెరా ముందుకు వచ్చి సెల్ఫీ వీడియోల రూపంలో సందేశాలు ఇవ్వడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువతను, జెన్ జీ తరాన్ని మరింతగా ఆకర్షించడమే ఈ మార్పు వెనుక ప్రధాన ఉద్దేశమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
గత కొన్నేళ్లుగా జెన్ జీ ఓటర్లు తమకు అనుకూలంగా ఉంటారనే ధీమాను భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేసింది. డిజిటల్ ప్రచారం, సోషల్ మీడియా వినియోగంలో బీజేపీ ముందంజలో ఉండటంతో యువతలో కూడా పార్టీకి మంచి ఆదరణ ఉందనే అంచనాలు వెలువడ్డాయి. అయితే నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం, దానికి అనుసంధానంగా చోటుచేసుకున్న పరిణామాలు, విద్యార్థుల్లో వ్యక్తమైన అసంతృప్తి వంటి అంశాలు యువతలో ప్రభుత్వంపై ప్రతికూల భావనకు దారితీయడంతో యువతతో తిరిగి అనుబంధాన్ని బలోపేతం చేసుకునేందుకు సెల్ఫీ వీడియోల వైపు మోడీ మొగ్గుచూపారనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.
ఇటీవల ప్రధాని మోడీ వ్యక్తిగత శైలిలో రూపొందించిన సెల్ఫీ వీడియోలను సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా పంచుకోవడం కూడా ఇదే వ్యూహంలో భాగమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంప్రదాయ రాజకీయ ప్రసంగాల కంటే చిన్న నిడివి కలిగిన వీడియోలు, సోషల్ మీడియాకు అనువైన కంటెంట్ ద్వారా యువతను చేరుకోవచ్చనే అంచనాతో ఈ తరహా ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు భావిస్తున్నారు.
Alao Read: డిజిటల్ సేవల్లో తెలంగాణ నయా రికార్డు.. దేశంలోనే నెంబర్ వన్ స్థానం!
డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో యువత భాగస్వామ్యం అధికంగా ఉండటంతో వారిని నేరుగా ఆకట్టుకునే ప్రయత్నంగా దీనిని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే గతంలోనూ కేంద్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని, తక్కువ నిడివి ఉండే రీల్స్ ద్వారా ప్రజలను, యువతను కనెక్ట్ అవ్వాలని ప్రధాని మోడీ దిశానిర్దేశం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే చెప్పడం కంటే చేసి చూపిస్తే బెటర్ అని భావించి తానే స్వయంగా సెల్ఫీ వీడియోల ద్వారా కనెక్ట్ అయి.. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని రూట్ మార్చారే చర్చ కూడా జరుగుతోంది.
ఇదిలాఉండగా తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈనేపథ్యంలో ఆ విద్యార్థి వర్గాలను తమవైపు ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యా రంగానికి సంబంధించిన అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటూ యువతతో మరింత అనుసంధానం పెంచుకునేందుకు పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే ఇంజినీర్లతో దిల్ సుఖ్ నగర్ లో ధర్నాకు పిలుపునిచ్చినట్లు సమాచారం.
Alao Read: 2027 వరల్డ్ కప్ లో టీమిండియా సులభంగా మైదానాలు కేటాయించారు !
అయితే ప్రధాని మోడీ సెల్ఫీ వీడియోలపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ ప్రచార విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దేశ భవిష్యత్ అయిన యువత జీవితాల్లో వెలుగు కంటే మోడీ చర్మం చాలా ప్రకాశవంతంగా ఉందని ఆయన విమర్శించారు. యువత ఎదుర్కొంటున్న విద్య, ఉపాధి, పరీక్షల నిర్వహణ వంటి కీలక సమస్యలపై దృష్టి సారించకుండా ప్రచార కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.
మరోవైపు బీజేపీ వర్గాలు మాత్రం సోషల్ మీడియా ద్వారా ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం కొనసాగించడం ఆధునిక రాజకీయాల్లో సహజ ప్రక్రియేనని చెబుతున్నాయి. యువత ఎక్కువగా వినియోగించే వేదికల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దేశానికి సంబంధించిన సందేశాలను చేరవేయడమే లక్ష్యమని పేర్కొంటున్నాయి. అయితే మోడీ సెల్ఫీ వీడియోలు నిజంగానే యువతను తిరిగి ఆకర్షించే వ్యూహమా? లేక సాధారణ డిజిటల్ ప్రచారంలో భాగమేనా? అన్నది రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.
Also Read: ఆయిల్ పామ్ రైతులకు బిగ్ షాక్.. అనుకున్న టార్గెట్ అంతా తుస్సేనా..!