KCR: నిన్నటి వరకు ఒక లెక్క.. ఈ రోజు నుంచి ఒక లెక్క అన్న కేసీఆర్ మీడియా సమావేశం అనంతరం మళ్లీ తిరిగి ఫాంహౌజ్ కే పరిమితమయ్యారు.. కేవలం ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడటం మాత్రమే కాదు సత్తా ఉంటే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రా అంటూ కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.. దీంతో కొద్ది రోజుల్లో జరగబోయే శాసనసభ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారన్న ప్రచారం హాట్‌టాపిక్‌గా మారింది..
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 29న ప్రారంభం కానున్నాయి.. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు, సాగునీటి ప్రాజెక్ట్ లపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొన్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు అత్యంత ఉత్కంఠ రేపుతున్నాయి.. సాగునీటి ప్రాజెక్ట్ లపై కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బహిరంగ వ్యాఖ్యలు చేశారు.. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రావాల్సిందిగా కేసీఆర్ కు సవాల్ విసిరారు..
ఇంతకీ కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కేవలం నామమాత్రంగా తొలి బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. అప్పటి నుంచి ఫాం హౌజ్ కే పరిమితమైన కేసీఆర్ మళ్లీ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు.. అయితే ఈ నెల 29న నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.. కృష్ణాజలాల విషయంలో ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు.. ఎలాగైనా కేసీఆర్ ను సభకు రప్పించి పాత ప్రభుత్వం వైఫల్యాలను లేవనెత్తాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అనంతరం ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఓ ప్రెస్ మీట్ పెట్టి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ లపై ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు..
అయితే ఇదే అంశంపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలా కూర్చుని మాట్లాడటానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా? లేరా? అనే చర్చ జోరుగా సాగుతోంది.. అయితే కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారని, మునుపటిలా అసెంబ్లీలో ఆయన గొంతు వినిపిస్తారని బీఆర్ఎస్ పార్టీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుదీర్ఘకాలం తర్వాత యాక్టివ్ అయిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అసెంబ్లీ సెషన్స్‌లో పాల్గొంటారన్న ప్రచారం హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై బీఆర్ఎస్ అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. గెలిచిన కొత్తలో ఒక రోజు బడ్జెట్ సెషన్స్‌లో కనిపించి వెల్లిపోయిన కేసీఆర్.. ఈ సారి సమావేశాల్లో ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీకి హాజరుకావాలని బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్షనాయకుడు కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 29న ప్రారంభమయ్యే సమావేశాలకు తాను వస్తానని. అధికార పక్షం ఎలాంటి అజెండాను ఖరారు చేస్తుందో చూసి దాన్ని బట్టి ముందుకు వెళదామని ఆయన పార్టీ నేతలతో పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ నాయకులతో కేసీఆర్ తాజాగా ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో సమావేశమయ్యారు.
అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై నేతలకు కేసీఆర్ దిశానిర్ధేశం చేశారంట. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశంపై అటు అసెంబ్లీ సమావేశాల్లో, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బలంగా పోరాటం చేద్దామని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్రాల వైఖరి కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశంపై అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్‌నగర్ సమీపంలోని మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులుండేలా అధికారపక్షాన్ని డిమాండ్ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో కేసీఆర్ కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోశారంట, కాంగ్రెస్ నాటి నుంచి నేటి వరకు తెలంగాణకు ఎప్పుడూ ద్రోహమే చేస్తుందని, తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్‌కు తప్ప మరే ఇతర పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పట్టింపు ఉండదని వ్యాఖ్యానించారంట.
నీళ్ల ప్రయోజనాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడతామని పార్టీ నేతలను దిశానిర్ధేశం చేశారంట, ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాలు నిర్మిద్దామని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామని పేర్కొన్నారంట, నీటి హక్కుల పరిరక్షణకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎష్ నుంచి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు పట్టుపడతామని, అధికారపక్షం ఎలా స్పందిస్తుందో చూసి దానికనుగుణంగా ముందుకు వెళదామన్నారంట.
ఆ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై గులాబీ నేతలు ఒక అజెండా రెడీ చేసుకున్నారు. రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. ఎరువులు దొరక్క రైతులు అవస్థల పాలవుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రైతులకు బోనస్ ఇవ్వట్లేదు. కరెంట్ కూడా సరిగ్గా రావడం లేదు. వీటన్నిటినీ ప్రస్తావిస్తూ రైతాంగ్ సమస్యలపై అసెంబ్లీలో బలంగా పోరాడాలని నిర్ణయించారంట. విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ రావడం లేదని, ఉద్యోగులు, రిటైర్ట్ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీటన్నింటిపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌ను నిలదీయాలని కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారంట, మరి చూడాలి సుదీర్ఘ కాలం తర్వాత అయినా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీ మెట్లు ఎక్కుతారో? లేదో?
Story by Ajay, Big Tv