BigTV English
Advertisement

Chandra Babu, Pawan and Modi Alliance: కొత్త పొత్తులు.. నూతన సమీకరణాలు.. విక్టరీ ఫార్ములా రిపీట్ అయ్యేనా..?

Chandra Babu, Pawan and Modi Alliance: కొత్త పొత్తులు.. నూతన సమీకరణాలు.. విక్టరీ ఫార్ములా రిపీట్ అయ్యేనా..?


BJP alliance with TDP, JSP in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో కొత్త పొత్తులు కొత్త సమీకరణాలకు దారి తీస్తున్నాయి. గెలుపుపై విశ్వాసంతో ఈ పొత్తులు ముందుకెళ్లాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి పాత చరిత్రను కొత్తగా తిరగరాయాలని అనుకుంటున్నాయి. 2014 నాటి ఫలితాన్ని రిపీట్ చేయాలనుకుంటున్నాయి. పట్టు పెంచుకున్న వైసీపీని ఓడించే లక్ష్యంతో మళ్లీ ఒక్కటయ్యాయి. ఒక్కటిగా ముందుకు కదులుతున్నాయి. సీట్ల సర్దుబాట్లు, అంతర్గత సమస్యలను పరిష్కరించుకుని ఒక మెట్టు దిగైనా సరే ఎన్నికల్లో దూకుడు పెంచాలనుకుంటున్నాయి. ఇంతకీ టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులు ఏమేరకు కలిసిరానున్నాయి? ఏమేం ప్లస్ అవబోతున్నాయి? చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య కుదిరిన పొత్తు రాజకీయాల్లో కీలకంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ కు ముందు కుదిరిన ఈ కొత్త పొత్తులు పొలిటికల్ గా కొత్త సమీకరణాలకు వేదికగా మారుతున్నాయి. 2014 నాటికి విక్టరీ ఫార్ములాను రిపీట్ చేసేందుకు ఆ మూడు పార్టీలు చాలా చర్చలు, సంప్రదింపుల తర్వాత ఒక్కతాటిపైకి వచ్చాయి. సీట్లు, సర్దుబాట్లు, అంతర్గత సమస్యల పరిష్కారం తర్వాత పొత్తులకు లైన్ క్లియర్ అయింది.


నిజానికి ఏపీలో విపక్షాలన్నీ పొత్తు పెట్టుకోవడం ఒక దశలో కష్టమే అనుకున్నారు. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేయడం వల్ల ఓట్లు చాలా వరకు ఆ మూడు పార్టీల మధ్య చీలిపోయాయి. అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చాలా ప్లస్ అయ్యాయి. గెలుపు ఈజీ అయింది. అంతే కాదు. విడివిడి పోటీతో మెజార్టీ స్థానాలు జగన్ పార్టీకి దక్కించుకోవడానికి కారణమైందంటారు. గత రెండేళ్ల నుంచి ఏపీలో విపక్షాల పొత్తులపై ఊహాగానాలు, ప్రాథమిక చర్చలు మొదలయ్యాయి. కలిసి ఉంటే కలదు సుఖం అనుకోవడంతో ఆ పొత్తులు ఇప్పుడు రియాల్టీగా మారాయి.

Also Read: అసైన్డ్ భూముల కుంభకోణం.. చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్‌షీట్

ఏపీలో విపక్షాల పొత్తులకు ఇన్నాళ్లూ కొన్ని విషయాల్లో అడ్డుకట్ట పడింది. నిజానికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధికారికంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ వస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం 2019 ఎన్నికలకు ముందు సడెన్ గా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ తో జట్టుకట్టింది. అయితే 2019 ఎన్నికల్లో అటు కేంద్రంలో కాంగ్రెస్ ఓడిపోవడం, ఇటు ఏపీలో టీడీపీకి ఘోర పరాజయం ఎదురవడంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. ఆ తర్వాత అటు ఎన్డీఏకు, ఇటు కాంగ్రెస్ కూటమికి దూరం పాటిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం రానే వచ్చింది. అలాగే సైలెంట్ గా ఉంటే వర్కవుట్ కాదనుకున్నారో ఏమోగానీ చక్రం తిప్పేశారు. చాలా చర్చలు, సంప్రదింపుల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులకు రూపురేఖలు వచ్చాయి.

నిజానికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన ముందు నుంచి టీడీపీతో జట్టు కట్టేందుకు సిద్ధమని సంకేతాలు ఇస్తూ వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవద్దన్న మాట పవన్ కల్యాణ్ మొదటి నుంచి చెబుతూ వచ్చారు. అదే మాటకు కట్టుబడి ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజల కోసం ఏదైనా భరించేందుకు సిద్ధమన్నారు. పొత్తు పెట్టుకుంటేనే జగన్ పార్టీని ఓడించవచ్చు అన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ విషయంలో భాగస్వామ్య కూటమి బీజేపీ నుంచి ఎలాంటి సిగ్నల్స్ లేకపోయినా తన దూకుడు మాత్రం ఆపలేదు. టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ ఆశీర్వాదం ఉండాలని చెబుతూ వచ్చారు. నిజానికి ఈ మూడు పార్టీల పొత్తుల విషయంలో కమలం పార్టీ కాస్త వెనకా ముందు ఆలోచన చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఇంకెన్నాళ్లు ఒకటి అరా సీట్లు అనుకున్నది. ఇప్పటి నుంచి పునాది వేస్తూ సింగిల్ గా బలపడేందుకు బీజేపీ ప్రణాళికలు రచించింది. అందుకే పొత్తులు అనగానే చాలా ఆలోచన చేసింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను ఇన్నాళ్లూ వెయిటింగ్ లిస్టులో పెట్టింది. అయితే ప్రస్తుతం ఎన్డీఏను బలోపేతం చేసుకోవడం, రాష్ట్రాల్లో అధికార కూటముల్లో భాగస్వామ్యం పెంచుకునే ఉద్దేశంతో పొత్తుకు ఓకే చెప్పింది ఢిల్లీ బీజేపీ.

Also Read: విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీఈఆర్సీ కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే..

సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీకి గట్టి బేస్ దొరకడం లేదు. ఒకవైపు కర్ణాటక, ఇటు తెలంగాణలో కాస్తో కూస్తో పట్టు ఉన్నా మిగితా చోట్ల గ్రౌండ్ జీరో ఉంది. సో ఏపీలో ఇప్పుడు కీలక సమయంలో టీడీపీ జనసేనతో కలిసి నడిచేందుకు సిద్ధ పడింది. పనిలో పనిగా ఎక్కువ ఎంపీ సీట్లు అడుగుతోంది. ముచ్చటగా మూడు పార్టీలు పొత్తులపై సంయుక్త ప్రకటన రిలీజ్ చేశాయి. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనలకు 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్‌ స్థానాలను ఇస్తున్నట్టు చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలకు చెప్పినట్లుగా తెలిసింది. ఈ విషయంలో టీడీపీ-బీజేపీ-జనసేన నేతల మధ్య కీలక మీటింగ్స్ జరుగుతున్నాయి. అయితే మరికొద్ది రోజుల్లో ఎవరికెన్ని సీట్లు అన్నది క్లారిటీ రానుంది. మొత్తంగా ఢిల్లీ బీజేపీ చంద్రబాబుకు చాలా తర్జన భర్జనల తర్వాత ఎన్డీఏ గేట్లు ఎత్తడం కీలకంగా మారింది. ఇన్ని రోజులుగా ఏపీలో పొత్తులపై ఇంత చర్చ జరుగుతున్నా.. ఏపీ బీజేపీ నేతలు మాత్రం మాట మాట్లాడలేకపోయారు. పొత్తులపై ఏమీ మాట్లాడవద్దని ఢిల్లీ బీజేపీ నుంచి ఆదేశాలు రావడంతో ఆ సబ్జెక్ట్ కు పూర్తి దూరంగా ఉండిపోయారు. కేంద్ర నాయకత్వం ఆదేశాల ప్రకారమే నడుచుకున్నారు. ఎక్కువ సీట్లు తీసుకుని ఓడిపోవడం కన్నా గెలిచే స్థానాలను మాత్రమే తీసుకోవడం వల్ల కూటమిలోని మిగతా పార్టీలకు ఇబ్బంది ఉండదన్న ఆలోచన చేస్తున్నారు. పక్కా ఈక్వేషన్స్ తో సీట్ల సర్దుబాటుకు ప్లాన్ చేస్తున్నారు.

ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరడం ఇదే మొదటిసారి కాదు. 1996లో టీడీపీ మొదటిసారి ఎన్డీయే కూటమిలో చేరింది. తిరిగి 2014లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఈ కూటమికి జనసేన బయటి నుంచి మద్దతు ప్రకటించింది. ఇప్పుడు ఈసారి మూడు పార్టీలు కలిసి 2024లో పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకున్నట్లు జనానికి ఈ మూడు పార్టీల నేతలు వివరణలు ఇస్తున్నారు. అటు సీఎం జగన్ మాత్రం తాను సింగిల్ అని, పేద ప్రజలే తనకు స్టార్ క్యాంపెయినట్లు అంటూ ప్రచారాలు హోరెత్తిస్తున్నారు. దీంతో ఈ తరహా ప్రచారానికి పొత్తులు పెట్టుకున్న పార్టీలు చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నాయి.

జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి, ఏపీ ప్రయోజనాలు, ప్రజలకు మేలు చేయడానికి పొత్తులు అవసరమన్న భావనను టీడీపీ, జనసేన, బీజేపీ జనంలోకి తీసుకెళ్తున్నాయి. తమ పొత్తులు అధికారం కోసం కాదని, ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడం కోసమే అన్న పాయింట్ ను ప్రచారం చేస్తున్నాయి.

తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఇన్ని రోజులుగా ఏపీలో ఉన్న సందిగ్ధతకు తెర పడింది. జనం కూడా ఒక ఆలోచనకు వచ్చేందుకు ఈ పొత్తు నిర్ణయం ఉపయోగపడనుంది. ఎటువైపు మొగ్గు చూపుదామా అని ఆలోచిస్తున్న స్వింగ్ ఓటర్లు కూడా డిసైడ్ అయ్యేందుకు ఈ పొత్తులు క్లియర్ ఇండికేషన్ ఇచ్చినట్లయింది. టీడీపీ తన పట్టున్న స్థానాలను జనసేనకు కేటాయించడం ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సీనియర్లను సర్దుకుపోవాలని ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిస్తూ వస్తున్నారు. ఈ పొత్తులతో పార్టీల మధ్య ఓట్ల బదిలీ పకడ్బందీగా సాగించడం కీలకంగా మారింది. అప్పుడే పొత్తు ప్రయోజనం నెరవేరే అవకాశం ఉంటుంది. పొత్తుల కారణంగా 160 స్థానాలు గెలుచుకుంటామని టీడీపీ జనసేన బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. ఓవైపు పొత్తులతో బెనిఫిట్ జరగబోతోందని విపక్షాలు అంటుంటే 2014 ఫలితాలు రిపీటయ్యే అవకాశమే లేదంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. అన్ని విపక్షాలు ఒక్కటయ్యాయంటేనే.. వైసీపీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ లాజిక్ లెక్కలు వినిపిస్తున్నారు.

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Big Stories

×