BigTV English

Kaleshwaram Project: కాళేశ్వరం విచారణకు సారొస్తారా?

Kaleshwaram Project: కాళేశ్వరం విచారణకు సారొస్తారా?

Kaleshwaram Project: తెలంగాణ రాజకీయం.. ఒక్కసారిగా హీటెక్కింది. ఇందుకు.. మాజీ సీఎం కేసీఆర్‌కు.. కాళేశ్వరం కమిషన్ పంపిన నోటీసులే కారణం. ఈ ఒక్క పరిణామం.. కాళేశ్వరం కమిషన్ విచారణలో.. కీలక మలుపుగా కనిపిస్తోంది. కేసీఆర్‌ గనక విచారణకు హాజరైతే.. ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై ఆరోపణలపై విచారణ ఓ కొలిక్కి వస్తుందనే చర్చ జరుగుతోంది? అయితే.. ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నల్లా ఒక్కటే! అదే.. కేసీఆర్.. విచారణకు వస్తారా? లేదా? అంతా అయిపోయిందనుకున్న టైమ్‌లో.. కేసీఆర్‌కు ఎందుకు నోటీసులు పంపారు?


ఎందరో అధికారులు, ఇంజనీర్లను విచారించిన కమిషన్

కాళేశ్వరం కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఇక.. నెక్ట్స్ ఏం జరగబోతోంది అనుకుంటున్న సమయంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై మరింత లోతుగా విచారణ జరిపేలా.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువుని పెంచింది. ఇప్పటికే.. ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన ఎందరో అధికారులను, ఇంజనీర్లను విచారించిన కమిషన్.. ఈసారి ఏకంగా మాజీ సీఎం కేసీఆర్‌కే నోటీసులు పంపింది. ఆయనతో పాటు ప్రాజెక్టు నిర్మాణం జరిగిన సమయంలో ఇరిగేషన్ మినిస్టర్‌గా ఉన్న హరీశ్ రావుకు, ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌కు కూడా నోటీసులు పంపారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.


కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, ఇతర బ్యారేజీలలో లీకేజీలు, నిర్మాణంలో నాణ్యత లోపాల లాంటి ఆరోపణలపై తెలంగాణ సర్కార్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ విచారణలో భాగంగా.. ప్రాజెక్టుకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో.. అప్పటి సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి, ఆర్థిక మంత్రిగా ఉన్నవారి పాత్రపై స్పష్టత కోసం ఈ నోటీసులు జారీ చేశారు. అయితే.. ఇప్పటివరకు జరిగిన కమిషన్ విచారణలో అధికారులు, ఇంజినీర్లంతా.. ప్రాజెక్ట్ నిర్మాణంలో అప్పటి ముఖ్యమంత్రి సూచనలే పాటించామని చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది. చాలా మంది ఇంజనీర్లు, అధికారులు.. తమ వాంగ్మూలాల్లో.. ముఖ్యమంత్రి ప్రత్యక్ష ఆదేశాల మేరకే వ్యవహరించామని చెప్పినట్లు తెలుస్తోంది. విచారణకు హాజరైన ఉన్నతాధికారులు కూడా.. మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నిల్వ చేసేందుకు.. ఉన్నత వర్గాల నుంచి ఆదేశాలు వచ్చాయని కమిషన్‌కు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తవకుండానే ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చారనే వాదనలున్నాయ్. నిర్మాణ సంస్థలు, ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా.. ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచే తప్పిదాలు జరిగాయనే ఆరోపణలున్నాయ్.

ప్రాజెక్ట్ నిర్మాణమంతా ఇంజనీర్లే చూసుకున్నారన్న కేసీఆర్

మాజీ సీఎం కేసీఆర్ కూడా గతంలో.. ప్రాజెక్ట్ నిర్మాణంలో తన పాత్ర ఉందని చెప్పారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక.. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టాక.. ఓ సందర్భంలో.. ప్రాజెక్ట్ నిర్మాణమంతా ఇంజనీర్లే చూసుకున్నారన్నారు. అయితే.. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, రెండో టర్మ్‌లో ఇరిగేషన్ మంత్రిగానూ వ్యవహరించారు. మేడిగడ్డ బ్యారేజీ స్థలం ఎంపిక లాంటి కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉందని కమిషన్ భావిస్తోంది. దాంతో.. 15 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. జూన్ 5 లోగా కేసీఆర్ విచారణకు రావాలని, అదేవిధంగా జూన్ 6న హరీశ్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్ విచారణకు రావాలని నోటీసులిచ్చారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక, నిర్మాణపరమైన అంశాలపై.. వారి హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని కమిషన్ కోరింది.

కమిషన్ గడువు మరో రెండు నెలల పాటు పొడగింపు

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే.. అనేక మంది అధికారులను, ఇంజనీర్లను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది. ప్రాజెక్టుకు సంబంధించి డాక్యుమెంట్లు, ఫైళ్లను పరిశీలించింది. కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండగా.. ప్రభుత్వం దానిని మరో రెండు నెలల పాటు పొడిగించింది. దీనికంటే ముందు.. త్వరలోనే కమిషన్ తన ఫైనల్ రిపోర్ట్‌ని కూడా సమర్పించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే.. కీలక నాయకులను విచారించకుండా నివేదిక సమర్పిస్తే.. అంసపూర్ణంగా ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో.. కమిషన్ గడువుని పొడిగించి.. కేసీఆర్‌కు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇది.. తెలంగాణ రాజకీయాల్లో ఓ కీలక మలుపుగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం రాజకీయంగానే కాదు, న్యాయపరంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్, హరీశ్, ఈటల విచారణతో.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ కొలిక్కి వస్తుందా? లేదా? అనేది కూడా ఆసక్తిగా మారింది.

కేసీఆర్‌కు.. కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపండం పెద్ద విషయమే. కానీ.. దీనిని మించిన క్వశ్చన్ మరొకటుంది? అసలు.. కేసీఆర్ విచారణకు హాజరవుతారా? ఇదే కాదు.. పీసీ ఘోష్ కమిషన్ విచారణలో.. కేసీఆర్‌కు వ్యతికంగా వచ్చిన అంశాలేంటి? ఏయే అంశాల్లో కేసీఆర్ ప్రస్తావన వచ్చిందనేది కూడా ఆసక్తిగా మారింది. అసలు.. కేసీఆర్ ఎందుకు విచారణకు రావాలి? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణలేంటి? తేలాల్సిందేమిటి? ఇవన్నీ కాదు.. కేసీఆర్ హాజరవకపోతే.. పరిస్థితి ఏంటి?

తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని నిర్ణయం

ఇదే.. ఇప్పుడున్న బిగ్ సస్పెన్స్. సహజ న్యాయ సూత్రాల ప్రకారం.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి.. తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని.. కాళేశ్వరం కమిషన్ నిర్ణయించింది. అందుకోసమే.. కేసీఆర్‌తో సహా హరీశ్ రావు, ఈటల రాజేందర్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. కానీ.. కేసీఆర్ విచారణకు వెళతారా? లేదా? అనేదే మెయిన్ క్వశ్చన్. ఎందుకంటే.. గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు.. కేసీఆర్‌ని పిలిచినప్పుడు.. ఆయన విచారణకు హాజరవకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో.. ఇప్పుడు కాళేశ్వరం అవకతవకలపై విచారిస్తున్న పీసీ ఘోష్ కమిటీ విచారణకు.. కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

అసలు.. కేసీఆర్ ఎదుర్కొంటున్న ఆరోపణలేంటి?

అసలు.. కేసీఆర్ ఎదుర్కొంటున్న ఆరోపణలేంటి? అనే విషయాల్లోకి వెళితే.. మేడిగడ్డ బ్యారేజీని.. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం లాంటి కీలక నిర్ణయాలు.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి. ఈ స్థలం మార్పు.. ప్రాజెక్టు వ్యయం పెరిగేందుకు, టెక్నికల్ సమస్యలకు దారితీసిందనే ఆరోపణలున్నాయ్. చాలా మంది అధికారులు, ఇంజనీర్లు కూడా తమ వాంగ్మూలాల్లో.. ఈ కీలక నిర్ణయాలు ఉన్నత స్థాయిలో, ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగాయని చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లీకేజీలు రావడం లాంటి నిర్మాణ లోపాలకు గల కారణాల్ని కూడా కమిషన్ విచారిస్తోంది.

డిజైన్ నిర్మాణ నాణ్యతలో రాజీ, నిబంధనలు ఉల్లంఘన

ఈ లోపాలకు ప్రధాన కారణం.. డిజైన్, నిర్మాణ నాణ్యతలో రాజీపడటం, నిబంధనల్ని ఉల్లంఘించడం లాంటి అంశాలను.. ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయ్. ఈ నిర్ణయాలు అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జరిగాయని కొందరు అధికారులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిజైన్‌కు ఆమోదాలు, నాణ్యత నియంత్రణ, ప్రాజెక్ట్ అమలు లాంటి కీలక నిర్ణయాలు.. ఉన్నత స్థాయిలోనే తీసుకున్నారని, ప్రాజెక్ట్ సిబ్బంది జోక్యం లేకుండా జరిగాయని కొందరు సీనియర్ ఇంజనీర్లు కమిషన్‌కు తెలిపారు. మరోవైపు.. బ్యారేజీల్లో లీకేజీలతో పాటు ఇతర లోపాలను కూడా 2022లోనే నిర్మాణ సంస్థ గుర్తించినా.. వాటిని మరమ్మత్తు చేయకుండా నీటిని నిల్వ చేయడం వల్ల మరింత దెబ్బతిన్నాయనే ఆరోపణలున్నాయ్. ఈ విషయంలోనూ ఉన్నత వర్గాల ఆదేశాలున్నాయని కొందరు అధికారులు చెప్పినట్లు సమాచారం.

మేడిగడ్డ బ్యారేజి స్థలం మార్పు వెనుక కేసిఆర్ పాత్ర!

ప్రధానంగా.. మేడిగడ్డ బ్యారేజీ స్థలం మార్పు వెనుక కేసీఆర్ పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. ప్రాజెక్ట్‌కి సంబంధించిన డిజైన్ ఆమోదాలు, నిర్మాణ ప్లానింగ్‌లో కేసీఆర్ పాత్ర గురించి కూడా కమిషన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ విధమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నందు వల్ల.. కేసీఆర్‌కు కూడా తన వాదన వినిపించుకునే అవకాశం కల్పించేందుకే.. పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిందనే వాదనలున్నాయి. ఆయన గనక విచారణకు హాజరై.. తన వాదన వినిపిస్తే.. ఈ ఆరోపణలు, మిగతా అంశాలపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ.. కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయన గనక హాజరవకపోతే.. నోటీసుల్ని లెక్క చేయనట్లు, విచారణ ప్రక్రియను సీరియస్‌గా తీసుకోలేదనే సంకేతం వెళుతుంది. అంతేకాదు.. కేసీఆర్ దగ్గర దాచిపెట్టాల్సిన సమాచారం ఏదో ఉందని.. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు సంబంధించిన సమాచారం ఆయనకు ఏదో తెలుసనే బలమైన అనుమానం కూడా ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. విచారణకు సహకరించకపోవడం వల్ల.. న్యాయపరమైన ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని.. రాజకీయ ప్రత్యర్థులు ఆరోపించే అవకాశం ఉంది.

ఇప్పటికే ఉన్న సాక్ష్యాలు, వాంగ్మూలాలతో తుది నివేదిక

అయితే.. కేసీఆర్ హాజరుకాకపోయినా.. ఎలాంటి వాదనలు లేకుండానే కమిషన్ తన విచారణ కొనసాగించి.. అందుబాటులో ఉన్న సాక్ష్యాలు, వాంగ్మూలాల ఆధారంగా తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించొచ్చు. ఆయన హాజరుకాలేదనే విషయాన్ని కూడా రిపోర్టులో తెలియజేయొచ్చు. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. కేసీఆర్ హాజరుకాకపోవడం, విచారణకు సహకరించకపోవడం లాంటి అంశాలు.. ప్రభుత్వ వాదనలకు బలం చేకూర్చే అవకాశం ఉంటుంది. మరోవైపు.. కేసీఆర్ కూడా ఈ నోటీసులను కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. గతంలో.. విద్యుత్ కమిషన్ పంపిన నోటీసులను న్యాయస్థానంలో సవాల్ చేసి.. తనకు అనుకూలమైన ఆదేశాలను పొందారు.

Also Read: బీజేపీ, వైసీపీ ఒక్కటై టీడీపీకి షాక్ ఇస్తారా?

ఇప్పుడు కూడా అదే తరహాలో.. పీసీ ఘోష్ కమిషన్ నోటీసులను కూడా సవాల్ చేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలు.. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని, విచారణను ఎదుర్కొనే ధైర్యం లేదని ఆరోపించే చాన్స్ ఉంది. దాంతో.. కాళేశ్వరం కమిషన్ పంపిన నోటీసులపై.. కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై సంపూర్ణమైన నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకే.. కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌కు.. విచారణ నోటీసులు పంపింది. అయితే.. వీళ్లు హాజరవుతారా? లేదా? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఒకవేళ హాజరైతే.. వారి వాదన ఎలా ఉండబోతోంది? తమపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సమాధానం చెబుతారనేది కూడా ఇంట్రస్టింగ్‌గా మారింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×