Women Reservation: భారత్.. మరో చరిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతోంది. ప్రజాస్వామ్య పునాదులను మరింత పటిష్టం చేసేందుకు, సమానత్వం పట్ల మనకున్న నిబద్ధతని నొక్కి చెప్పేందుకు.. ఈ దేశ రాజకీయ యవనికపై.. చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. నారీ శక్తి వందన్ అధినియం పేరుతో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నుంచే అమలు చేసే దిశగా కేంద్రం కీలక ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం దేశ రాజకీయాలనే కాదు, భవిష్యత్‌ని కూడా మార్చబోతోంది.
ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో నవశకానికి నాంది పలకనున్నాయ్. ఈ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లుని ప్రవేశపెట్టనున్నారు. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం.. కొత్త జనగణన, పునర్విభజన తర్వాతే రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన చేసి, 2029 జనరల్ ఎలక్షన్స్ నాటికి.. మహిళా రిజర్వేషన్ కోటాను అమలు చేయాలని నిర్ణయించింది. దేశంలోని కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు.. మహిళా రిజర్వేషన్ చట్టం ప్రతిబింబంగా కనిపిస్తోంది.
భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే ఉన్నారు. ఈ దేశానికి వారు అందిస్తున్న సేవలు, ప్రతి రంగంలో వాళ్లు సాధిస్తున్న అద్భుతమైన విజయాలకు.. భారత్ గర్వపడుతోంది. ఈ దేశాభివృద్ధిలో పురుషులతో పాట మహిళలు కూడా ఎంతో కీలకంగా ఉన్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న అనేక ప్రయత్నాల తర్వాత.. మహిళా సాధికారతకు సానుకూల వాతావరణం ఏర్పడింది. సమాజంలో వచ్చిన అనేక మార్పులతో.. ఆర్థిక, సామాజిక విషయాల్లో మహిళల వాటా పెరిగింది.
సమాజంలో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యానికి అనుగుణంగా రాజకీయ రంగంలోనూ, చట్టసభల్లోనూ వారి ప్రాతినిథ్యం పెరగలేదు. అందుకే, పాలనలోనూ, నిర్ణయాధికారంలోనూ మహిళల పాత్ర పెరగాలనే డిమాండ్లు పెరిగాయ్. అందుకోసమే.. 2029లో లోక్‌సభకు, అనేక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగే నాటికల్లా.. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి తేవాలనే ధృడ నిశ్చయంతో ఉంది కేంద్ర ప్రభుత్వం. శాసన వ్యవస్థల్లో మహిళల పాత్రను బలోపేతం చేస్తూ, వారి ఆకాంక్షలను నెరవేర్చే రోజు వచ్చేందుకు.. ఇక ఎక్కువ సమయం పట్టదు.
మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చాక.. భారతదేశంలో జరిగే ఎన్నికల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయ్. ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాల సంఖ్య ఏకంగా 816కి పెరుగుతుంది. వీటిలో 33 శాతం కోటా మహిళలకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఆ లెక్కన.. 816 స్థానాల్లో 273 సీట్లు మహిళలకే రిజర్వ్ అవుతాయి. రాష్ట్రాల శాసనసభలకు సైతం ఇదే వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో మహిళా నేతలు చట్టసభల్లోకి వెళతారు. మహిళా రిజర్వేషన్.. వారసత్వ రాజకీయాలను సవాల్ చేస్తుంది. ఇప్పటివరకు పురుషాధిపత్యం, కొన్ని కుటుంబాలకే పరిమితమైన నియోజకవర్గాల్లో.. ఇకపై మహిళల గళం వినిపించే అవకాశముంది.
రిజర్వేషన్ల కారణంగా.. పార్టీలు తప్పనిసరిగా మహిళా అభ్యర్థులను వెతకాల్సి వస్తుంది. ఇది.. క్షేత్రస్థాయి నుంచి కొత్త నాయకత్వాన్ని తయారుచేస్తుంది. చట్టసభల్లో మహిళల సంఖ్య పెరిగితే.. ఆరోగ్యం, విద్య, శిశు సంక్షేమం, మహిళా భద్రత లాంటి అంశాలకు.. బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత దక్కే అవకాశాలుంటాయ్. మహిళల కోణంలో సమస్యల విశ్లేషణ జరుగుతుంది కాబట్టి.. పాలన మరింత సమగ్రంగా మారుతుంది. నియోజకవర్గాల పునర్విభజన 2011 జనాభా ప్రాతిపదికన జరుగుతుండటం వల్ల.. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశాలున్నాయ్. ఇది జాతీయ రాజకీయాల్లో.. దక్షిణ భారతదేశ రాష్ట్రాల ప్రభావంపై ఇప్పటికే చర్చను లేవనెత్తింది.
నారీ శక్తి అనేది.. కేవలం ఓ నినాదం కాదు. నిర్మాణాత్మకమైన శక్తి అని.. మహిళా రిజర్వేషన్ చట్టం నిరూపిస్తుంది. ఏప్రిల్ 16 తర్వాత పడబోయే అడుగులు.. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకుండా, దేశంలో సగంగా ఉన్న జనాభాకు.. నిజమైన భాగస్వామ్యాన్ని కల్పించేలా ఉండబోతోంది. ఈ భారతదేశం.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశంగా వెలిగే అవకాశం ఉంటుంది.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోటా.. భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఓ గ్రేట్ మైల్ స్టోన్. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, 2029 నాటికి అమల్లోకి రానున్న ఈ చట్టం.. కేవలం ఓ రాజకీయ మార్పు మాత్రమే కాదు. మరో సామాజిక విప్లవం. చట్టసభల్లో మహిళా శక్తికి అధికారం దక్కితే.. ఈ దేశ ముఖచిత్రమే మారిపోతుందనే గొప్ప అంచనాలున్నాయ్. భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది ఉన్న మహిళలకు, దేశ భవిష్యత్తును నిర్ణయించే చట్టసభల్లో తగిన ప్రాతినిథ్యం లేకపోవడం పెద్ద లోటు. ఇప్పుడు ఆ అడ్డంకి తొలగబోతోంది. 2029 ఎన్నికల నుంచి లోక్‌సభతో పాటు రాష్ట్రాల శాసనసభల్లోనూ.. మూడింట ఒక వంతు స్థానాలు మహిళలకే కేటాయిస్తారు.
మహిళలు అధికారంలోకి వస్తే.. బడ్జెట్ రూపకల్పన నుంచి సంక్షేమ పథకాల వరకు ప్రతి అంశంలోనూ ఓ మానవీయ కోణం కనిపిస్తుంది. పురుషులు ప్రాధాన్యత ఇచ్చే రక్షణ, మౌలిక సదుపాయాలతో పాటు మహిళలు విద్య, ఆరోగ్యం, పాఠశాల్లో మౌలిక వసతులు, ప్రసూతి సంబంధిత అంశాలు, శిశు పోషణపై ఎక్కువగా ఫోకస్ పెడతారు. అంతేకాదు.. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టేలా కఠినమైన చట్టాలు, మెరుగైన పోలీసింగ్ వ్యవస్థపై రాజీలేని పోరాటం చేస్తారు. ఇంటి అవసరాలు బాగా తెలిసిన మహిళలు, క్షేత్ర స్థాయిలో అనేక సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యంతో పాటు పరిష్కారం కూడా చూపుతారనే అభిప్రాయాలున్నాయ్.
పంచాయతీలు, మున్సిపాలిటీల్లో.. మహిళా రిజర్వేషన్ల ఫలితాలు ఇప్పటికే మనకు కనిపిస్తున్నాయ్. అనేక రిపోర్టుల ప్రకారం, మహిళా ప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారని, ప్రజలకు అందుబాటులో ఉంటారని తేలింది. చట్టసభల్లో మహిళల సంఖ్య పెరిగితే, రాజకీయాల్లో క్రమశిక్షణ, నిర్మాణాత్మక చర్చలు పెరిగే అవకాశం ఉంటుంది. మహిళా ప్రజాప్రతినిధులు పెరిగితే ఆటోమేటిక్‌గా.. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, పనికి తగ్గ వేతనం, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చే దిశగా భరోసా కలుగుతుంది. ఇది దేశం జీడీపీ వృద్ధికి నేరుగా తోడ్పడుతుంది.
మహిళా రిజర్వేషన్ల అమలులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయ్. భర్తలు, తండ్రుల పేరుతో మహిళలు నామ్ కే వాస్తే నాయకులుగా కాకుండా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా ఉండాలి. రాజకీయ పార్టీల్లోనూ, సభల్లోనూ మహిళల గొంతు నొక్కే ధోరణి మారాలి. మహిళలకు అధికారం దక్కడమంటే.. చట్టసభల్లో కేవలం కొన్ని కుర్చీలు దక్కడం కాదు. దేశాభివృద్ధిలో సగం మేధస్సుని వినియోగించుకోవడం. సమాజ కష్టనష్టాలు తెలిసిన మహిళలు చట్టసభలకు వెళితే.. చట్టాలు మరింత బాధ్యతతో రూపుదిద్దుకుంటాయ్. 2029 నుంచే భారత పార్లమెంట్ సహా రాష్ట్రాల అసెంబ్లీలు సైతం.. కొత్త వెలుగులతో మెరవబోతున్నాయ్.
మహిళా శక్తికి అధికారం లభిస్తే.. కేవలం మహిళలకే కాదు, మొత్తం భారత సమాజానికి మేలు చేస్తుందనే భావన ఉంది. నవ భారతం వైపు సాగుతున్న ఈ ప్రయాణంలో ఇది అతిపెద్ద ముందడుగుగా నిలవబోతోంది. రాజ్యాంగ విలువలను బలోపేతం చేసేలా, దేశ ప్రగతి కోసం మహిళా శక్తికి సాధికారత కల్పించేలా.. జాతీయ ప్రయోజనాలే పరమావధిగా, భావి తరాల కోసం మహిళలకు మంచి అవకాశం రాబోతోంది. మార్పులను స్వీకరిస్తూ, అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్.
Also Read: పనిలో స్పీడ్.. ప్రచారంలో డెడ్.. నాగర్ కర్నూల్ హస్తం పార్టీలో వింత పరిస్థితి!
Story by: Anup, Big Tv