YS Jagan: జగన్ అధికారంలో ఉన్నప్పుడు, అంతకు ముందు కూడా వైసీపీలో వన్ మ్యాన్ షో చేశారన్న విమర్శలున్నాయి. పార్టీ క్యాడర్‌కి ఆయన్ని కలిసే అవకాశం ఉండేది కాదని వైసీపీ నేతలే పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఘరో పరాజయం తర్వాత జగన్ వైఖరిలో మార్పు వచ్చిందంటున్నారు. పార్టీ పటిష్టతపై దృష్టి సారిస్తున్న వైసీపీ అధ్యక్షుడు మునుపెన్నడూ లేని విధంగా క్యాడర్‌కు ప్రయారిటీ ఇస్తున్నారంట. తాడేపల్లి వచ్చినప్పుడల్లా పార్టీ వర్గాలను కలిసి, పార్టీలో వారి సమస్యలు పరిష్కరించి మనోస్థైర్యం నింపాలని చూస్తున్నారంట.. ఆ క్రమంలో జగన్‌లో వచ్చిన మార్పు వైసీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేస్తోందంట
వైసీపీ అధ్యక్షుడు జగన్ మునుపెన్నడూ లేని విధంగా పార్టీ నేతల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నారు. ఓటమి తర్వాత పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల కాలంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కావడంతో పాటు ప్రాంతాల వారీగా పార్టీలో ఉన్న సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఫోకస్ పెట్టారు.
నియోజక వర్గాల సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ నేతలతో భేటీ అవుతూ ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్న జగన్… ఇటీవల కాలంలో తనను కలిసేందుకు వస్తున్న కార్యకర్తలను కలుస్తూ ప్రత్యేకంగా ఆయా అంశాలపై చర్చిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా పార్టీ నేతలు, కార్యకర్తలను జగన్ కలిసే పరిస్థితి ఉండేది కాదన్నవిమర్శలకు చెక్ పెట్టడంతో పాటు, తనను కలవాలి అనుకున్న కార్యకర్తలకు ప్రత్యేకించి సమయాన్ని కేటాయిస్తున్నారు. వారితో మాట్లాడి ప్రాంతాలవారీగా ఉన్న వాస్తవ పరిస్థితులను, పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను అడిగి తెలుసుకుని, అవసరమైతే భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్లాలని దానిపై వ్యూహాలు రచిస్తున్నారు.
ఓటమి తర్వాత వైపీపీ క్యాడర్ నిస్తేజంలో ఉంది. పార్టీ నేతలకు మాత్రమే జగన్ అపాయింట్మెంట్ ఇస్తున్నారన్న అపవాదు సైతం ఇటీవల కాలంలో మూట కట్టుకున్నారు. దీంతో ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం దృష్టికి అనేక వినతులు రావడంతో జగన్ దిగివచ్చి, పార్టీ బలోపేతంపై సీరియస్‌గా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారంట. ఎవరెవరైతే తనను కలవాలి అనుకుంటున్నారో వారిని నేరుగా కలుస్తున్నారు. జిల్లాల వారీగా కార్యకర్తలను కలిసి వారితో ఫోటోలు దిగి వారి మంచి చెడులు అడిగి తెలుసుకోవడంతో పాటు, జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీ పరంగా సంస్థగతంగా ఎలా ముందుకు వెళ్లాలి? దానికి సంబంధించిన అభిప్రాయాలను వారితోనే చర్చిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా జరుగుతున్న అరెస్టులు, నమోదు అవుతున్న కేసులు, జరుగుతున్న దాడులతో వైసీపీ క్యాడర్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. అందుకే క్యాడర్ మనోగతం తెలుసుకుంటూ, వారికి భరోసా ఇవ్వాలని భావిస్తున్న జగన్ ప్రత్యేకంగా కేంద్ర కార్యాలయంలో వారిని కలుస్తున్నారుంట. బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చిన ప్రతిసారి తనను కలవాలనుకుంటున్న కార్యకర్తలకు సమయం కేటాయిస్తూ, తాడేపల్లి నివాసంలో ఉన్నన్ని రోజులు పార్టీ శ్రేణులతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీలో కేవలం నాయకులకు మాత్రమే జగన్‌ని కలిసే అవకాశం ఉంటుందన్న ప్రచారానికి చెక్ పెట్టడంతో పాటు, సామాన్య పార్టీ కార్యకర్తలకు కలిసే అవకాశం ఇవ్వడం ద్వారా వారితతో గ్యాప్‌ను ఫుల్‌ఫిల్ చేయవచ్చన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.
ఈ నేపధ్యంలో పార్టీ శ్రేణుల్లో మరింత భరోసా పెంచడానికి పార్టీ పరంగా చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పార్టీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ సభ్యులు, పార్లమెంట్ పరిశీలకులు, కార్యదర్శులు అందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి 2,500 మంది జనాభా ఉన్న ప్రాంతాన్ని ఒక కోర్ కమిటీగా ఏర్పాటు చేయాలని, అక్కడ ఏడు అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు చేయాలని సజ్జల ఆదేశించారంట. సదరు కమిటీల నియామకంపై ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని, ఆ టాస్క్ ఫోర్స్ తో సమన్వయం చేసుకోవాలని సూచించారంట. త్వరితగతిన కమిటీల ఏర్పాటు పూర్తవ్వాలని, పార్టీ క్యాడర్ అందరికీ ఐడీ కార్డులు ఇవ్వాలని దిశానిర్ధేశం చేశారంట. మరి పార్టీ వ్యవహారాలకు జగన్‌లో వచ్చిన మార్పు, చేపడుతున్న చర్యలు వైసీపీని ఏ మాత్రం ట్రాక్‌లో పెడతాయో చూడాలి.
Story by: Apparao, Big Tv