BigTV English

YS Jagan: సినీ స్టైల్లో జగన్ వార్నింగ్‌లు.. బాబు ఏంటిది? తెలుగు తమ్ముళ్లు గగ్గోలు

YS Jagan: సినీ స్టైల్లో జగన్ వార్నింగ్‌లు.. బాబు ఏంటిది? తెలుగు తమ్ముళ్లు గగ్గోలు

YS Jagan: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలపై విచారణలు జరిపించి చట్ట బద్దమైన చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వ పెద్దలు పదే పదే చెప్తున్నారు.. కక్షపూరిత చర్యలకు పాల్పడవద్దని తమ పార్టీ శ్రేణులకు హితబోధ చేస్తున్నారు. అంత వరకు బానే ఉన్నా.. ఇప్పటికీ వైసీపీ నేతలు చట్టం పరిధి దాటి దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నా.. చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుండటం విమర్శల పాలవుతుంది. జగన్ పోలీసులకు ఓపెన్ వార్నింగ్ ఇచ్చినా.. ఎన్నికల కోడ్ అతిక్రమించి తన టీమ్‌తో గుంటూరు యార్డులో పర్యటించినా.. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోలేదు.. ఆ మెతక వైఖరే వైసీపీ నేతలకు అలుసుగా మారుతుందని కూటమి శ్రేణులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయంట.


పోలీసులకు సినీ స్టైల్లో వార్నింగ్ ఇచ్చిన జగన్

విజయవాడ సబ్ జైలులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేనిని పరామర్శించడానికి వచ్చిన వైసీపీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలీసు అధికారులను బెదిరించిన తీరు, సినిమా స్టైల్లో ఇచ్చిన వార్నింగులు అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఐదేళ్ల పాలనలో జగన్ అధికార దుర్వినియోగం చేసిన తీరు, అన్ని విభాగాలను ఎంత అడ్డగోలుగా వాడేసుకున్నారో ప్రభుత్వ యంత్రాంగానికి తెలియందేమీ కాదు.. పలువురు ఐజీలు, ఎస్పీలు, డీఎస్పీల నుంచి కిందస్థాయి సిబ్బంది వరకు వైసీపీ కార్యకర్తల్లా వాడేసుకున్నారు.


ఆర్ఆర్ఆర్‌పై జలుం కేసులో పలువురు అధికారులపై కేసులు

నరసాపురం ఎంపిగా ఉన్న సమయంలో రఘురామకృష్ణంరాజును పోలీస్ టార్చర్ పెట్టిన తీరు ఎవరూ మర్చిపోలేరు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో రఘురామరాజుని చిత్ర హింసలు పెట్టిన ఘటనలో పలువురు ఉన్నతస్థాయి అధికారులు కేసుల్లో ఇరుక్కుని.. కొందరు జైలు పాలు కూడా అయ్యారు . నంద్యాల పర్యటనలో ఉన్న టీడపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై అక్రమ కేసు బనాయించి.. రాత్రి పూట అరెస్టు చేయడం.. గంటల కొద్దీ రోడ్లపై తిప్పడంలో వైసీపీ ప్రభుత్వం అధికారులను ఎంత దారుణంగా వాడుకుందో వేరే చెప్పనవసరం లేదు.

ప్రభుత్వ ఆదేశాలు కాదన లేక తలవంచి పలువు సిబ్బంది

ఇలా చెప్పుకుంటూ పోతే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రల అరెస్ట్, నటి జత్వాని కేసు దగ్గర నుంచి సాధారణ కార్యకర్తలను వేధించడం వరకు అందరిపై జులుం ప్రదర్శిస్తూ ఇష్టానుసారం కేసులు బనాయించిన పోలీసుల ఓవర్ యాక్షన్ అందరికీ తెలిసిందే.. అప్పట్లో రాష్ట్రాన్ని తన జాగీరులా భావించిన వైసీపీ నేతలు పోలీసులను తమ అనుచరుల్లా వాడుకున్నారు. ఇష్టమున్నా లేకపోయినా ప్రభుత్వ అదేశాలు కావడంతో పలువురు పోలీసులు వాటిని పాటించి చెడ్డపేరు తెచ్చుకున్నారు.

తీవ్ర విమర్శలు పాలవుతున్న జగన్ వైఖరి

అదంతా తన హక్కు అన్నట్లు.. ఇప్పుడు అన్యాయం గురించి జగన్ మాట్లాడుతున్నారు. తాము అధికారంలో రాగానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలు పాటించిన పోలీసు అధికారులు, వారిని ఆదేశించిన కూటమి నేతల బట్టలు ఊడదీసి నిలబెడతారంట. పోలీసు టోపీపై ఉన్న సింహాలకు మాత్రమే పోలీసులు సెల్యూట్ చేయాలని ఇప్పుడు తెలిసింది మాజీ సీఎంకి. అసలు పోలీసులను అలా వాడుకోవచ్చన్న సంస్కృతికి శ్రీకారం చుట్టిందే జగన్ .. అలాంటాయన ఇప్పుడు తమ పని తాము చేసుకుని పోతున్న యంత్రాంగాన్ని టార్గెట్ చేస్తుండటం తీవ్ర విమర్శల పాలవుతుంది.

పక్కా ఆధారాలతో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి ఫిర్యాదు చేసినందుకు దళితుడైన సత్యవర్దన్ ను కిడ్నాప్ చేసిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. పక్కా ఆధారాలు సేకరించాకే వంశీని హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చి విజయవాడ జైల్లో పెట్టారు. అలాంటి వంశీని పరామర్శించడానికి వచ్చిన జగన్ పరామర్శించి వెళ్లిపోయి ఉంటే ఏ గొడవా ఉండేది కాదేమో.. అయితే జైలు బయటకు వచ్చి నాలుగుగేళ్ల తర్వాత ఎప్పుడో జరిగే ఎన్నికల్లో తానే అధికారంలోకి వస్తానని కలలు కంటూ.. పోలీసులను పరుష పదజాలంతో దూషించడం వివాదాస్పదమైంది.

జగన్ వ్యాఖ్యలను ఖండిస్తున్న పోలీసు అధికారుల సంఘం

ఎంతటి వారైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా.. అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసు నమోదు చేసే వెసులుబాటు పోలీసులకు ఉంటుంది. అయితే జగన్ వ్యాఖ్యలపై స్పందించిన పోలీసు అధికారుల సంఘం సభ్యులు పోలీసులపై అవమానకర బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలని సూచిస్తున్నారు. జగన్ పోలిసులను ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామని రాజకీయనాయకుల్లా స్టేట్‌మెంట్ ఇచ్చారు. పోలీస్ అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలు ఊడదీసి నిలబెడతానని జగన్ వార్నింగ్ ఇవ్వడం రాష్ట్ర పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఉందంట.

జగన్ హితవు పలుకున్న పోలీసు అధికారుల సంఘం

రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు గత ప్రభుత్వంలో పని చేసిన వారేనని.. మాజీ సిఎం జగన్ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని పోలీసు అధికారుల సంఘం సభ్యలు హితవు పలుకుతున్నారు. తక్షణమే జగన్మోహన్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మాత్రం చెప్పడం లేదు. ఆ క్రమంలో అంతలా దూషించినప్పటికీ జగన్ పై కేసు నమోదు కాకపోవడం పోలీసుల ఆత్మస్తైర్యం దెబ్బతీసిందంటున్నారు. జగన్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం తప్పు పట్టింది కాని చర్యలకు డిమాండ్ చేయలేదు.

ఎన్నికల అధికారి ప్రేక్షకపాత్ర వహించడంపై అసంతృప్తి

ఇక ఎన్నికల కోడ్ ఉండగానే గుంటూరు మిర్చియార్డుకు జగన్ వచ్చినప్పుడు కూడా ఎన్నికల అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ చూసి చూడనట్టు వ్యవహరించారు. యార్డులో జగన్ పర్యటనకు జిల్లా పోలీసులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా అనుమతినిరాకరించారు. అయినా జగన్ మిర్చియార్డకు వచ్చి నానా హంగామా చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటే.. తమ పార్టీ పోటీ చేయడం లేదని వితండవాదం చేశారు. ఆ టైమ్‌లో ఎన్నికల అధికారి ప్రేక్షకపాత్ర వహించడంపై కూటమి శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Also Read: పుష్పరాజ్‌ను టార్గెట్ చేసిన ఏపీ మంత్రి

మరుసటి రోజు తాపీగా జగన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

ఇంతా చేస్తే గుంటూరు మిర్చి యార్డుకి వచ్చి వెళ్లిపోయిన మరుసటి రోజు పోలీసులు జగన్ టీమ్‌పై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండి.. అనుమతి లేకుండా గుంటూరు మిర్చియార్డులో పర్యటించారంటూ జగన్‌ సహా 9 మందిపై కేసు పెట్టారు. A-1గా జగన్‌ పేరు చేర్చి తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కావాటి మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పేర్ని నానిలపై కేసు బుక్ చేశామంటున్నారు.

ప్రభుత్వం జగన్ పట్ల మెతకవైఖరి వీడాలంటున్న కూటమి శ్రేణులు

ఆ కేసు పెట్టి చర్యలు తీసుకునేదేదో జగన్ పర్యటన రోజే జరిగుంటే.. పోలీసుల్లో స్థైర్యం పెరిగేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వైసీపీ హాయంలో అరాచకాలపై చట్టపరంగా చర్యలు తీసుకునే సాహసం పోలీసు అధికారులు చేయాలంటే కూటమి ప్రభుత్వం జగన్ పట్ల మెతకవైఖరి వీడాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు మెతక వైఖరి ఉన్నారని, ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే వైఖరి అవలంభిస్తే.. యంత్రాంగానికి తప్పుడు సంకేతాలు వెళ్లి అసలుకే మోసం వస్తుందని కూటమి శ్రేణులు సూచిస్తున్నాయి. పాత ఘటనలపై కేసులు, విచారణలు అంటున్న ప్రభుత్వ పెద్దలు.. కళ్ల ముందు జరుగుతున్న వాటిపై కూడా ఉదాసీన వైఖరి అవలంభిస్తుండం.. వైసీపీ నేతలకు అలుసుగా మారుతోందని తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×