Adulterated Ghee: శాసనమండలిలో కల్తీ నెయ్యి అంశంపై చర్చ జరగకుండా వైసీపీ పలాయన మంత్రం పఠించింది. టీటీడీ కల్తీ నెయ్యి ఇష్యూపై మండలిలో చర్చ పెట్టాలని వైసీపీ డిమాండ్ చేసింది. తీరా చర్చ జరిగే రోజు మండలి నుంచి బయటకు వచ్చేసింది. ప్రభుత్వంపై బయటకు వచ్చి ఆరోపణలు చేసింది.అటు అసెంబ్లీలో కల్తీ నెయ్యి అంశంపై వైసీపీ ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొనలేదు…. బయట మైకుల ముందు గంభీరంగా మాట్లాడే వైసీపీ నేతలు, సభ లోపల ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేయడం వారి బలహీనతను చాటుతోందంటున్నారు. చర్చ జరిగితే కల్తీ నెయ్యి స్కామ్ లో ఎవరెవరి హస్తం ఉందో అధికారికంగా రికార్డుల్లోకి వెళ్తుందనే భయం వారిని వెంటాడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, కల్తీ నెయ్యి కుంభకోణం వంటి కీలకమైన అంశంపై చర్చకు రాకుండా తప్పించుకోవడం తీవ్ర విమర్శల పాలవుతోంది. మండలిలో తమకు అనుకూలమైన సంఖ్యాబలం, తమ మాట వినే చైర్మన్ ఉన్నా సరే, వైసీపీ నేతలు సభలో వాదన వినిపించలేక పలాయనం చిత్తగించడం వెనుక అసలు నిజాలు బయటపడతాయనే భయమే ప్రధాన కారణమంటున్నారు.
గత కొంతకాలంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశం ఆంధ్రప్రదేశ్ లో పెను రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై అధికార తెలుగుదేశం కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్ధం ఎడతెగకుండా కొనసాగుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక సిట్ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేసి.. కల్తీ వాస్తవమేనని ధృవీకరించింది. వాస్తవానికి అక్కడితో ఈ అంశంవై వివాదానికి ఫుల్ స్టాప్ పడాలి. ఇక కల్తీకి కారకులెవరన్నది చట్టం తేలుస్తుంది.
అయితే వైసీపీ మాత్రం కల్తీ విషయం అలా ఉంచండి.. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో చంద్రబాబు చెప్పినట్లుగా జంతువుల కొవ్వు లేదుగా అంటూ నానా హంగామా చేస్తోంది. చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేశారని ఎదురుదాడి మొదలుపెట్టింది. అక్కడితో ఆగకుండా హెరిటేజ్ కు లబ్ధి చేకూర్చడం కోసమే చంద్రబాబు లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వినియోగం అంటూ ఆరోపణలు గుప్పించారంటూ విమర్శలు మొదలు పెట్టింది. ఇందాపూర్ డెయరీతో కలిపి హెరిటేజ్ పై ఆరోపణలు మొదలుపెట్టింది.
దీనిపై శాసనమండలిలో చర్చకు సిద్ధం అని వైసీపీ సవాల్ విసిరింది. ఆ సవాల్ ను స్వీకరించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. చర్చ మండలిలో కాదు.. మొదట అసెంబ్లీలో చేద్దామంటూ ఈ నెల 24ని ముహూర్తంగా నిర్ణయించింది. అందుకు తగ్గట్లే ప్రభుత్వం వ్యూహాత్మకంగా శాసనసభలో ఆ అంశాన్ని చర్చకు పెట్టింది. దమ్ముంటే సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని వైసీపీకి సవాల్ కూడా విసిరింది. వాస్తవానికి వైసీపీకి ఇదో బంగారంలాంటి అవకాశం. వైసీపీ ఎమ్మెల్యేలుయసభకు హాజరై ఉంటే, కల్తీ నెయ్యి వినియోగం విషయంలో తమ పార్టీపై వస్తున్న ఆరోపణలను ఖండించడమే కాకుండా.. ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ పై తాము చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపడానికి అవకాశం ఉండేది. అయితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి వైసీపీ ముందుకు రావకపోవడంతో లడ్డూ ప్రసాదం తయారీలో వైసీపీ చేస్తున్న వాదనలకు, ఆరోపణలకు విశ్వసనీయత లేకుండా పోయిందంటున్నారు.
11 మంది ఎమ్మెల్యేలే ఉండటంతో అసెంబ్లీకి ముఖం చాటేస్తున్న వైసీపీ… కల్తీ నెయ్యి ఇష్యూపై తమకు తగినంత బలం ఉన్న శాసనమండలిలో చర్చకు పట్టుపట్డింది. దానికి అధికారపక్షం సిద్దమైతే వైసీపీ ఎమ్మెల్సీలు లేనిపోని హడావుడి చేసి సభ జరగకుండా చేశారు. సాధారణంగా ప్రభుత్వం ప్రకటన తర్వాత సభలో లఘుచర్చ ప్రారంభమవుతుంది. అయితే ప్రతిపక్షం మొదటగా మాట్లాడాలని బొత్స పట్టుబట్టారు. మండలి చైర్మన్ కూడా.. ప్రతిపక్షం మొదట మాట్లాడాలన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్..అసలు వివాదంపై ప్రభుత్వం ప్రకటన చేయకుండా ఎలా చర్చిస్తారని సభా నిబంధనలు ప్రస్తావించారు. దాంతో ఇదే సందనుకుని వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేసి సభ వాయిదా పడేలా చేశారు. సభ వాయిదా తర్వాత బొత్స సత్యనారాయణ కల్తీ నెయ్యిపై చర్చించే వరకూ ఆందోళన చేస్తామని గొప్పగా ప్రకటించారు.
ఈ అంశంపై పయ్యావుల కేశవ్ మీడియా పాయింట్ లో మాట్లాడి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కల్తీ నెయ్యిపై చర్చకు ఆసక్తిగా లేదని పారిపోవడానికి ప్రయత్నించిందన్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు.కల్తీ నెయ్యిపై చర్చకు వైసీపీసభ్యు లు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర శాసన మండలిలో మార్చి 4న తిరుపతి లడ్డు అంశంపై లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా వైసీపీ వాకౌట్..టాకౌట్ పార్టీగా మారిందని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. ఆ క్రమంలో వైసీపీ సభ్యులు అబద్ధాలతో ఎక్కువ కాలం ప్రజలను నమ్మించలేమని, సభలో చర్చకు భయపడటమే ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీ అసెంబ్లీకి వెళ్లడం లేదు.. మండలికి హాజరవుతున్నారు.. అయినా ప్రయోజనం లేని రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి మంత్రి కేశవ్ చెప్పినట్లు వైసీపీ సభ్యులు మార్చి 4న అయినా కల్తీ నెయ్యిపై చర్చల్లో పాల్గొంటారో లేదో చూడాలి.
Also Read: ఈ వేసవికి బెస్ట్ డెస్టినేషన్.. ఉత్తరాఖండ్‌లోని ‘బిన్సార్’ పూర్తి టూర్ ప్లాన్!
Story by: Apparao, Big Tv