YSRCP Strategy: వైసీపీ నిర్మాణం, పార్టీ బలోపేతంపై పత్యేక ఫోకస్ పెట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ (YS Jagan) నిర్ణయించుకున్నారంట. దాంతో బూత్ కమిటీలను యాక్టివేట్ చేసే పనిలో వైసీపీ ముఖ్య నేతలు దృష్టి సారిస్తున్నారంట. అదీ కాక ఇటీవల ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల ఓట్లు తొలగింగించడం కుట్రపూరితమనే విషయాన్ని జనంలో ఎస్టాబ్లిష్ చేయాలని వైసీపీ చూస్తోందంట. తొలగించిన ఓట్లు వైసీపీ వారివే అన్న భావనతో.. పార్టీ సానుభూతి పరుల ఓట్లను కాపాడుకునేందుకు యాక్షన్ ప్లాన్ కూడా సిద్దం చేస్తున్నారంట. ఆ క్రమంలో ఓట్ల తొలగింపు అడ్డుకునేలా క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ 2019 ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో 151 సీట్లతో అధికారం చేపట్టింది. అయిదేళ్ల పాలనలో ప్రభుత్వ నిర్ణయాల లోపం కావచ్చు, మాజీ సీఎం జగన్ (YS Jagan) ఏకపక్ష వైఖరి కావచ్చు.. ఆ పార్టీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలు కావచ్చు.. లేకపోతే రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా విస్మరించడమో కాని.. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ, గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమై, కూటమికి చారిత్రాత్మక విజయం దక్కేలా చేసింది. అలా కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా వైసీపీ గద్దెదిగి 21 నెలలు గడుస్తున్నాయి. అధికారంలో ఉన్నంత కాలం పరదాల మాటున పాలన సాగించిన జగన్, ఓడిపోయాక కూడా తక్కువ సార్లే జనంలోకి వచ్చారు. పార్టీ పరంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా మాజీ సీఎం వాటిలో పెద్దగా పాల్గొనలేదు. అన్నీ పార్టీ నేతలతోనే చేయిస్తూ వచ్చారు. జగన్ జిల్లాల పర్యటనలు మొదలుపెడతారని ప్రచారం సాగినా అది కూడా ఆచరణలో అమలు కాలేదు. మరి ఈ కీలక సమయంలో పార్టీ బలోపేతానికి వైసీపీ ఏమి చేస్తోంది అంటే.. ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టే పనిలో పడిందంటున్నారు. వైసీపీలో కార్యకర్తలంతా నాయకులే అన్న సందేశాన్ని ఇవ్వాలని జగన్ భావిస్తున్నారంట. అంతే కాదు బాధ్యతలను కూడా వారు తీసుకుని ముందుకు సాగేలా కార్యాచరణ రూపొందించారంట.
Also Read: Gas cylinder shortage: గ్యాస్ కష్టాలపై రేవంత్ సర్కార్ ఫోకస్.. ఉత్తమ్ కుమార్ హైలెవెల్ మీటింగ్
ఇప్పటిదాకా దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సంస్థాగతంగా పటిష్టం అంటే సభ్యత్వ నమోదుకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. వైసీపీ మాత్రం దాని కంటే మరో అడుగు ముందుకేసి సభ్యత్వం కాదు బాధ్యతలే ఇస్తానంటోందంట. క్యాడర్‌కే కీలక బాధ్యతలు అప్పగిస్తే, వారంతా కేవలం పార్టీ సభ్యుడు అని స్టాంప్ వేయించుకుని మూలన ఉండకుండా, పార్టీ పదవితో క్రియాశీలకంగా ఉంటారని ఆలోచిస్తున్నారంట. అలాగే వారికి పదవులతో పార్టీ ప్రాముఖ్యత ఇస్తోంది అన్న సంతృప్తి ఉంటుందని, అలా జెండా పట్టిన ప్రతీ వారు క్రియాశీలకంగా ఉండడమే కాకుండా పార్టీకి కూడా వారు సరికొత్త ఆయుధంగా మారుతారని భావిస్తున్నారంట. అలా ఒక భారీ సైన్యంగా వారిని తయారు చేసే పనిలో వైసీపీ ఇపుడు బిజీగా ఉంది అని అంటున్నారు. వైసీపీకి రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఉన్నాయి. జిల్లాలు, నియోజకవర్గలలో కూడా కమిటీలు ఉన్నాయి. వాటిని మండల, గ్రామ, బూత్ లెవెల్ దాకా విస్తరించాలని చూస్తోంది. అంతే కాదు ప్రతీ చోటా పార్టీ ప్రధాన కమిటీతో పాటు ఏడు అనుబంధ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తోంది. మహిళ, యువత, విద్యార్ధి, టీచర్స్, రైతు, కార్మిక, సోషల్ మీడియా వంటి అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయనుందని అంటున్నారు. దీంతో వైసీపీ బలం గ్రౌండ్ లెవల్ నుంచి పెరుగుతుందని భావిస్తున్నారంట.
ఇంతకాలం పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టకుండా, జగన్ ఫేస్ వాల్యూనే నమ్ముకుని వైసీపీ కార్యకలాపాలు సాగిస్తూ వచ్చింది. అయితే క్షేత్ర స్థాయిలో పటిష్టంగా ఉండటం ఎంత అవసరమో జగన్ తెలుసుకున్నారంటున్నారు. అందుకే పార్టీ హైకమాండ్ తో నేరుగా గ్రామ స్థాయి కమిటీలను అనుసంధానం చేయాలని, పార్టీ పరంగా ఒక పిలుపు ఇస్తే చాలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఎక్కడికక్కడ రీ సౌండ్ ఇచ్చేలా ఉండాలని వైసీపీ అధ్యక్షుడు ఆలోచిస్తున్నారంట. ప్రతి నియోజకవర్గంలో కనీసంగా 12 వేల మంది దాకా వైసీపీ సైన్యం ఉండేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారంట. మొత్తం 175 అసెంబ్లీ నియోజ్కవార్గాల్లో ఏకంగా 18 లక్షల మంది భారీ సైన్యం ఉండేలా చేసుకుంటే కంటిన్యూస్ గా ప్రభుత్వం మీద ప్రజా పోరాటాలు చేయడానికి వీలు అవుతుందని అంచనా వేస్తున్నారంట. అంతే కాదు ప్రతీ నియోజకవర్గంలో ఒక కీలకమైన ఓటు బ్యాంక్ గా తమ సైన్యం ఉండాలని, జనాలని మోటివేట్ చేసే బలమైన శక్తిగా ఈ కమిటీలు పనిచేయాలని టార్గెట్ పెట్టుకున్నారంట. మొత్తానికి ఉగాది తరువాత జగనన్న సైన్యం రంగంలోకి దిగబోతోంది అని ప్రచారం సాగుతోంది.
అందులో భాగంగా కేంద్ర కార్యాలయంలో పార్టీ బూత్ కమిటీ విభాగాల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. పార్టీ జోనల్ ఇంఛార్జ్‌లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, పార్టీ జిలా స్థాయి బూత్ కమిటీల అధ్యక్షులు హాజరయ్యారు రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లపై సమాశంలో చర్చించారు. అధికార పక్షం చేసే అవవతకలు, అక్రమాలను అడ్డుకోవడంతో పాటు, ఎక్కడా పార్టీ ఓట్లు తొలగించకుండా చూడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారంట. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా జగన్ అభీష్టాన్ని వినిపించారు. ఉన్న ఓట్లు తీసివేయకుండా, అక్రమ ఓట్లు చేర్చకుండా చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుందని సజ్జల సూచించారు.
ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ, పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇంఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ .. అధికార పార్టీ ఆగడాలు, వైసీపీ శ్రేణులను టార్గెట్ చేసి వేధిస్తున్న తీరుపై అందరూ అప్రమత్తంగా ఉండాలని మార్గ నిర్దేశం చేశారు. 2029 ఎన్నికల్లో ఏ విధంగా ముందుకుసాగాలనే దానిపై అందరూ దృష్టి పెట్టాలని, పార్టీ ఓట్లను తొలగించకుండా కాపాడుకోవడం మన కర్తవ్యమని బోధించారు. రానున్నది మంచి కాలం, మనమంతా కష్టపడి పనిచేసి మళ్ళీ వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న వైసీపీ నేతలు .. ఆ దిశగా పెద్ద కార్యాచరణే మొదలుపెట్టినట్లు కనిపిస్తున్నారు. మరి జగన్ తన టార్గెట్ రీచ్ అయ్యేలా వారెంతవరకు వర్కౌట్ చేస్తారో చూడాలి.
Also Read: Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ కొత్త గేమ్ ప్లాన్.. ముందు చేసిన తప్పు చేసేది లేదంటూ..!