Investment Schemes: స్టాక్ మార్కెట్ పతనం కావడంతో పొదుపులు చేసేవారి ఆలోచన మారిందా? మ్యూచువల్ ఫండ్స్ కంటే.. ఫిక్స్‌డ్‌గా రాబడి వచ్చేదానిపై ఫోకస్ చేస్తున్నారా? సీనియర్ సిటిజన్ల మాటేంటి? ఫిక్స్‌డ్ డిపాజిట్లు- సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, RBI ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లలో ఏది బెటర్?
పొదుపు చేయడానికి ఏ స్కీమ్ ఏది బెటర్
పెట్టుబడులు పెట్టేందుకు రకరకాల మార్గాలు కనిపిస్తుంటాయి. ఈ మధ్యకాలంలో మ్యూచువల్ ఫండ్స్ వైపు చాలామంది మొగ్గు చూపుతున్నారు. పదవీ విరమణ చేసిన సీనియర్ సిటిజెన్లు రిస్క్ కోరుకోరు. జీతం మాదిరిగా ప్రతీ నెలా రాబడి కావాలని కోరుకుంటారు. పెట్టుబడుల మీద వారికి ఎలాంటి ఆప్షన్లు ఉన్నాయి.
ఎక్కువ రిటర్న్స్ కావాలనుకునేవారు మ్యూచువల్ ఫండ్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఈ మధ్యకాలంలో స్టాక్ మార్కెట్ ఒక రోజు లాభాల్లో నడిస్తే.. రెండు రోజులు నష్టాలు పాలవుతున్నాయి. పైగా అంతర్జాతీయ పరిణామాలతో లింకు అయి ఉంటుంది. స్టాక్‌మార్కెట్ లాభాలు వస్తేనే మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ వస్తాయి.. లేకుంటే నష్టాలు తప్పవు.
సీనియర్ సిటిజన్స్.. ఆ మూడింటిపై చూపు
ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్స్ స్థిరంగా వచ్చే ఆదాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరికున్న ఆప్షన్స్ ఒకసారి పరిశీలిద్దాం. అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు. గతంలో చాలామంది ఎఫ్‌డీల వైపు మొగ్గు చూపేవారు. ప్రస్తుతం వడ్డీ రేట్లు పడిపోయాయి. వడ్డీ తగ్గినా ఫిక్స్‌డ్‌గా ఆదాయం వస్తుంది.
ఇక పోస్టాఫీస్ పథకాల్లో సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ పథకం-SCSS. సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. ఈ స్కీమ్‌లో పెట్టుబడితో ప్రతి 3 నెలలకు ఓసారి వడ్డీ వస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆదాయం మాదిరిగానే ఇందులోనూ ఆప్షన్ ఉంటుంది. ఆర్బీఐ బాండ్లలో మెచ్యూరిటీకి అసలు-వడ్డీ కలిపి వస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఆర్బీఐ బాండ్లలో పెట్టుబడి పరిమితి లేదు. SCSS లో గరిష్ఠంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడులు పెట్టే వీలుంది.
ఈ లెక్కన రూ.20 లక్షల పెట్టుబడిపై ఐదేళ్లలో సీనియర్ సిటిజెన్స్ ఎందులో రాబడి ఎక్కువగా వస్తుందో తెలుసుకుందాం. సేవింగ్స్ స్కీమ్‌లో రూ. 20 లక్షలు పెట్టుబడి పెడితే 8.20 శాతం వడ్డీ రేటు ఒక్కసారి చూద్దాం. ఐదేళ్ల పాటు ప్రతి మూడు నెలలకు ఓసారి వడ్డీ రూ. 41 వేలు వస్తుంది. అంటే ప్రతీ నెలకు దాదాపు రూ. 13600 వేల పైమాటే.
ALSO READ: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. 20 వేల మంది ట్యాక్స్ పేయర్లకు ఐటీ శాఖ నోటీసులు
బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు సీనియర్ సిటిజెన్లకు 7 నుంచి 8 శాతం వరకు ఉంటుంది. ఎస్బీఐలో ఐదేళ్ల వ్యవధి పరిశీలిస్తే 7.05 శాతంగా ఉంది. రూ. 20 లక్షలు ఎఫ్‌డీ చేస్తే.. ప్రతి 3 నెలలకు వడ్డీ సుమారు రూ. 35 వేలు పైగానే రావచ్చు. అంటే నెలకు రూ. 11,750 వరకు వస్తుందన్నమాట.
చివరగా ఆర్బీఐ సేవింగ్స్ బాండ్ల విషయానికి వద్దాం. ప్రస్తుతం వడ్డీ రేటు 8.05 శాతం. కాల పరిమితి 7 ఏళ్లు ఉంటుంది. సీనియర్ సిటిజెన్లు ముందుగా డబ్బులు తీసుకునేందుకు వెసులుబాటు ఉంది. రూ. 20 లక్షలు పెట్టుబడి పెడితే 8.05 శాతం వడ్డీ ప్రకారం ఏడాదికి రూ. 1.61 లక్షల వరకు వస్తుంది. నెల వారిగా చూస్తే రూ. 13,417 వరకు వస్తుంది. సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో అధిక రాబడి వస్తుంది. ఆ తర్వాత ఆర్బీఐ బాండ్లు కాగా, చివరలో బ్యాంక్ ఎఫ్‌డీల్లో వస్తుంది. వీటిలో ఎందులో పెట్టుబడి పెట్టినా రిస్క్ జీరో.
ముఖ్య గమనిక: ఆర్బీఐ నిర్ణయాల బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. పైన ఇచ్చింది అంచనాకు మాత్రమే, మరిన్ని వివరాల కోసం మీకు దగ్గరలో ఉన్న బ్యాంకు, పోస్టాఫీసులను సంప్రదించవచ్చు.