Trump Towers Hyderabad: హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్ ఏ విధంగా ఉంది? మార్కెట్లో ధరలు క్రమంగా పుంజు కుంటున్నాయా? ఇదే సమయంలో ట్రంప్ ఆర్గనైజేషన్ సంస్థ అడుగు పెట్టేసిందా? బుకింగ్ కూడా మొదలుపెట్టిందా? పెంట్‌హౌస్ రూ. 62 కోట్లకు వెళ్లిందా? ఈ లెక్కన హైదరాబాద్‌లో రియాల్టీ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయమనే వాదన అప్పుడే మొదలైంది.
దేశంలో ముంబై, పుణె, గురుగ్రామ్, నోయిడా, కోల్‌కతా వంటి నగరాల్లో ఎంట్రీ ఇచ్చింది ట్రంప్ బ్రాండ్ రియాల్టీ. దక్షిణ భారత్‌లో తొలిసారి హైదరాబాద్ ద్వారా ఇక్కడ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది ట్రంప్ బ్రాండ్. కోకాపేటలోని గోల్డెన్ మైల్ ప్రాంతంలో విలాసవంతమైన ట్రంప్ టవర్స్‌ను నిర్మించబోతోంది. హైదరాబాద్‌కు చెందిన ఐరా రియాల్టీ-ముంబైకి చెందిన ట్రిబెకా డెవలపర్స్ అధికారిక ప్రకటన చేశాయి. దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో 65 అంతస్తులతో రెండు టవర్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించాయి. దాదాపు 240 మీటర్ల ఎత్తులో నిర్మాణం చేపట్టనుంది. ఈ టవర్లు సుమారు 800 అడుగుల ఎత్తులో ఉంటాయి. 28వ అంతస్తులో రెండు టవర్ల మధ్య స్కై బ్రిడ్జ్ రానుంది. రెండు టవర్ల మధ్య విస్తరించిన బ్రిడ్జ్‌లో ట్రంప్ క్లబ్ ఉంటుంది. సుమారు నాలుగు సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని అంచనా.
దక్షిణ భారతంలో అత్యంత ఎత్తైన టవర్లు. ట్రంప్ టవర్లలో 450 విలాసవంతమైన నివాసాలు ఉండనున్నాయి. ల్యాండ్ విలువ కాకుండా ప్రాజెక్టు విలువ అక్షరాలా రూ.1,800 కోట్లు. మరి ఏ స్థాయిలో నిర్మాణం జరుగుతుందో? ఈ ఏడాది చివరలో ప్రాజెక్టు శంకుస్థాపనకు ట్రంప్ కుటుంబసభ్యులు రానున్నారు. నిర్మాణానికి రెండువారాల కిందట అనుమతి మంజూరు చేసింది రెరా. అందులోని ఫ్లాట్ ధరలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. మూడున్నర నుంచి 4 బీహెచ్‌కే ఫ్లాట్ల ధరలు మాత్రమే. ట్రంప్ టవర్స్‌లో 16 పెంట్‌హౌస్‌లు రానున్నాయి. 8 అప్పుడే రూ.250 కోట్లకు అమ్ముడుపోయాయి. ఒక్కో పెంట్‌హౌస్ అత్యధికంగా రూ.62 కోట్లు పలికింది. ఓ వ్యాపారవేత్త తమ కుటుంబసభ్యుల కోసం వాటిని కొనుగోలు చేశారు. వాటి విస్తీర్ణం దాదాపు 32 వేల చదరపు అడుగులు. హైదరాబాద్ సిటీలో ఈ స్థాయి ధర పలకడం ఇదే ఫస్ట్ టైమ్.
ఫ్లాట్ల అమ్మకాల ద్వారా రూ.3,500 కోట్ల నుంచి రూ.4,200 కోట్ల వరకు వస్తాయని నిర్మాణ సంస్థల అంచనా. ట్రంప్ టవర్స్ విక్రయం తర్వాత హైదరాబాద్ రియాల్టీ మార్కెట్‌లో ధరలు పెరగడం ఖాయమనే వాదన అప్పుడే ప్రజల్లో మొదలైంది. రాబోయే నాలుగేళ్లలో దేశంలోని బెంగళూరు, చెన్నైతోపాటు మరో నాలుగు ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్టులు రానున్నాయి. ముఖ్యంగా హోటళ్లు, గోల్ఫ్ కోర్సుల అభివృద్ధి పనులు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ట్రంప్ బ్రాండ్‌ను తొలిసారిగా హైదరాబాద్‌కు తీసుకురావడంచాలా ఆనందంగా ఉందని ట్రంప్ కుటుంబానికి అనుబంధంగా ఉన్న ది ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ ట్రంప్ ఓ ప్రకటనలో తెలిపారు.
ALSO READ: షాకిచ్చిన బంగారం-వెండి ధరలు.. ఒక్కరోజు 10 వేలు, మార్కెట్లో ఇవాళ మాటేంటి?