గంజాయితో దొరికితే తీసుకెళ్లి జైలులో వేస్తారు, కానీ కొన్ని దేశాల్లో మాత్రం గంజాయి ఉత్పత్తుల అమ్మకం అధికారికం. అయితే ఇక్కడో యువకుడు తాను గంజాయితో వ్యాపారం చేసి కోట్లు గడించానని చెబుతున్నాడు. అతడి విజయగాధ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం 35వేల రూపాయల పెట్టుబడితో గంజాయి వ్యాపారం మొదలు పెట్టి తాను 36కోట్ల రూపాయలు వెనకేశానంటున్నాడు ఆ యువకుడు. అతడి ఆసక్తికర గంజాయి జర్నీని చాలామంది ఇష్టపడ్డారు, కొందరు తమకూ అలాంటి అవకాశం ఇవ్వాలని కోరారు.
23 ఏళ్లకే..
23 ఏళ్ల యువకుడు అతి తక్కువ సమయంలో 36 కోట్లు సంపాదించాడంటే ఆశ్చర్యమే. అయితే దానికోసం అతడు ఎంచుకున్న దారి కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. అతడు గంజాయితో వ్యాపారం చేశాడు. అది కూడా ఆన్ లైనే బిజినెస్ గా మార్చుకున్నాడు. దీనికోసం అతడు తన తల్లికి చెందిన బేస్ మెంట్ ని స్టార్టప్ గా ఎంచుకున్నాడు. ఆ బేస్ మెంట్ లో బిజినెస్ మొదలు పెట్టడం కోసం అతను పెట్టిన పెట్టుబడి కేవలం 35వేల రూపాయలు. ఆ తర్వాత అది 4.2 మిలియన్ డాలర్ల గంజాయి ఉత్పత్తుల వ్యాపారంగా మారింది. దాని పేరు డాంక్ స్టాప్. రెడిట్ లో తన ప్రయాణాన్ని ఆ యువకుడు షేర్ చేశాడు. దీనిపై చాలామంది తమ స్పందన తెలియజేశారు. తమని ఉద్యోగులుగా నియమించుకోవాలని కొంతమంది అభ్యర్థించారు. మరికొందరు ఆ సక్సెస్ సీక్రెట్ ని అడిగారు, ఇంకొందరు, ఇంకా ఆ బేస్ మెంట్ లోనే ఉన్నారా, లేక పక్కకు వెళ్లిపోయారా అని ప్రశ్నించారు.
డాంక్ స్టాప్
ఆన్‌లైన్ రిటైలర్ వ్యాపారం చేసేందుకు డాంక్ స్టాప్‌ను ప్రారంభించిన ఆ యువకుడు కంపెనీని ఎలా లాభదాయకంగా మార్చాడనే విషయాన్ని అందరూ ఆసక్తిగా చదివారు. 2020లో తమ ప్రాంతంలో గంజాయి ఉత్పత్తులు కొనేవారందర్నీ తన కస్టమర్లుగా మార్చుకున్నాడు. ఓవర్‌హెడ్ ఖర్చులు తొలగించి హోమ్ డెలివరీ చేయడం ద్వారా వ్యాపారం 4.2 మిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పాడు. మొదటగా బిగ్ కామర్స్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నానని, తర్వాత షాపిఫై కి మారానని చెప్పాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామంది ఈ పోస్ట్ కి రియాక్ట్ అయ్యారు. దాదాపుగా అందరూ అతడి సాహసాన్ని మెచ్చుకున్నారు. తక్కువ వయసులో విజయవంతమైన బిజినెస్ మేన్ గా మారాడని అభినందించారు. రెడిట్ లో పెట్టిన పోస్ట్ కాస్తా వైరల్ గా మారడంతో, ఆ తర్వాత సోషల్ మీడియాలో దీని గురించి చర్చ మొదలైంది.
సాఫ్ట్ వేర్ స్టార్టప్..
గంజాయి బిజినెస్ తో తన జీవితాన్ని మొదలు పెట్టిన ఆ యువకుడు, ఇప్పుడు దాన్నుంచి పూర్తిగా దూరం జరిగాడు. ప్రస్తుతం తాను ఆ బేస్ మెంట్ లో లేనని, వెకేషన్ రెంటల్ ప్రాపర్టీలను చూస్తున్నానని చెప్పాడు. ఒక అందమైన జీవిత భాగస్వామితోపాటు, ఓ కుక్కతో తాను స్థిరపడ్డానని అన్నాడు. ప్రస్తుతం ఒక సాఫ్ట్‌వేర్ స్టార్టప్‌ను నడుపుతున్నాని చెప్పాడు. మై అంబరిల్లా AI అనే కంపెనీని నిర్వహిస్తున్నానన్నాడు. ఇది చాలా ప్రత్యేకమైన కంపెనీ అని అంటున్నాడు ఆ యువకుడు.