Employee Work Pressure: ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులు ఎదుర్కొనే వాటిలో పని ఒత్తిడి అనేది ప్రధానమైన సమస్యగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఉద్యోగులు అనేక రకాల ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఎక్కువ పని భారం, నిరంతరం మీటింగ్స్, అంచనాలను చేరుకోవడం సహా అనేక విధాలుగా ఉంటాయి. దీంతో అనేక మందికి కంపెనీల్లో పని ఒత్తిడి అనేది దైనందిన జీవితంలో భాగంగా మారిపోతుంది. ఈ పరిస్థితుల వల్ల పలువురు ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఈ పని ఒత్తిడి గురించి ఓ సర్వే షాకింగ్ విషయాలను ప్రకటించింది.
కరోనా తరువాత ఉద్యోగుల పని జీవిత సమతుల్యతపై వచ్చే ఒత్తిడి భారతదేశంలోని 5 రాష్ట్రాలలో నిర్వహించిన ఓ సర్వేలో భారీ సంఖ్యలో ఉద్యోగులు బర్న్‌అవుట్ అనుభవిస్తున్నట్లు తెలిపింది. న్యూయార్క్‌కు చెందిన వ్యాపార ప్రక్రియ నిర్వహణ సంస్థ వెర్టెక్స్ గ్రూప్ ఈ సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో 52 శాతం మంది ఉద్యోగులు పని-జీవితానికి సంబంధించి తీవ్ర ఒత్తిడి అనుభవిస్తున్నారని చెప్పింది.
ఈ సర్వే ప్రకారం, చాలా మంది ఉద్యోగులు పని, వ్యక్తిగత జీవితం మధ్య సరైన సమతుల్యతను పాటించలేకపోతున్నారు. ఈ కారణంగా, వారు బర్న్‌అవుట్ అవుతున్నారు. ఈ క్రమంలో సర్వేలో పాల్గొన్న 1,500 మందిలో 52 శాతం మంది పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత లోపం, వారి ఆరోగ్యం, ఉత్పాదకత, సృజనాత్మకతను నాశనం చేస్తున్నాయని వెల్లడించారు.
కరోనా తరువాత ఉద్యోగుల మనోభావాలు, పని పట్ల వారి అభిప్రాయాలు, జీవితంలో సమతుల్యత కోసం చేస్తున్న యత్నాలు మరింత బలపడినట్లు సర్వే తెలిపింది. కార్పొరేట్ ప్రపంచంలో ముఖ్యంగా ఐటీ రంగంలో, పని-జీవిత సమతుల్యత ఒక అత్యవసర సమస్యగా మారిపోయింది. ఈ క్రమంలో ఉద్యోగులు తమ పని సమయంలో మరింత సమయాన్ని వ్యక్తిగత జీవితం కోసం కేటాయించాలని కోరుతున్నారు. వెర్టెక్స్ గ్రూప్ సర్వేలో తెలిపినట్లు సౌకర్యవంతమైన పని గంటలు, ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యత ఉద్యోగుల ప్రశాంతతకు కీలకమైన అంశాలుగా ఉన్నాయి. మనం ఒక్కొక్కరికి మంచి పని-జీవిత సమతుల్యతను అందించగలిగితే, వారు మరింత ఉత్పాదకంగా అందిస్తారని వెర్టెక్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు గగన్ అరోరా అన్నారు.
Read Also: Investing Tips: రూ. 4,700 సేవింగ్‌తో రూ. 4 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
సర్వే ప్రకారం ఉద్యోగులు వారాంతాల్లో మరింత విశ్రాంతి తీసుకోవాలని కోరుతున్నారు. వారాంతాల్లో వారికి విశ్రాంతి సమయం కావాలని అంటున్నారు. కాబట్టి వారాంతాల్లో అదనపు పని వారి మీద మోపకూడదని సర్వే తెలిపింది. ప్రతిసారీ అత్యవసరం అయితే తప్ప, వారాంతాల్లో ఉద్యోగులకు అదనపు పని అప్పగించడం పనికి రాదని గగన్ అరోరా పేర్కొన్నారు.
సర్వేలో ఒక ముఖ్యమైన వివరాన్ని సూచించగా 23 శాతం మంది ఉద్యోగులు సాధారణ పని గంటలకు మించి పనిచేస్తున్నారని వెల్లడైంది. ఇవి వారి ఉత్పాదకతపై నెగటివ్ ప్రభావం చూపిస్తున్నాయి. పని గంటలు పొడిగించడం వల్ల ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడం కంటే, అది తక్కువగా అవుతుందని సర్వేలో తెలిపారు.
సర్వే ప్రకారం 8-9 గంటల పని షిఫ్ట్ లో 20 శాతం మందికి కేవలం 2.5 నుంచి 3.5 గంటల వరకు మాత్రమే ఉత్పాదకత ఉంటుంది. దీని ఫలితంగా ఎక్కువ పని గంటలు పెంచడం కాకుండా, ఉద్యోగులు తమ పని సామర్థ్యాన్ని పెంచే విధానాలు, సాంకేతికత నైపుణ్యాల ద్వారా మార్పులు చేయడం చాలా అవసరం. ఈ క్రమంలో వ్యాపారవేత్తలు, కంపెనీలు ఉద్యోగుల ఆరోగ్యం దృష్ట్యా పని ఒత్తిడిని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని సర్వే సూచించింది.