Amazon Processing Fee: ఆన్‌లైన్ షాపింగ్ ప్రేమికులకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఇప్పటి వరకు ఆఫర్లు, డిస్కౌంట్‌లు ఆస్వాదించిన అమెజాన్ యూజర్లు..ఇకపై కొత్త ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే. తాజాగా అమెజాన్ ప్రాసెసింగ్ ఫీజును ప్రవేశపెట్టింది. అయితే ఇది వినియోగదారుల పొదుపుపై ప్రభావం చూపించనుందా? ఇది ఎవరికి వర్తిస్తుంది? కేవలం వ్యాపార వ్యూహమా? ఇలాంటి క్రమంలో షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరం అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మన ఖర్చు మరింత
ఆన్‌లైన్ షాపింగ్ అంటే కేవలం సరదా మాత్రమే కాదు, డిస్కౌంట్‌లు అందుబాటులో ఉంటే అదో అదనపు ఆనందం. ముఖ్యంగా బ్యాంక్ ఆఫర్ల ద్వారా మంచి తగ్గింపును పొందితే, మన ఖర్చు మరింత తగ్గించుకోవచ్చు. అయితే, ఇప్పుడు అమెజాన్ తీసుకున్న కొత్త నిర్ణయం మీ పొదుపును కొంతవరకు ప్రభావితం చేస్తుంది. ఎలాగంటే మీరు షాపింగ్ చేసిన తర్వాత బిల్లు చెల్లించే క్రమంలో ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ (IBD) పొందినప్పుడు, అదనంగా రూ. 49 ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
డిస్కౌంట్‌కు రుసుము?
మీరు అమెజాన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు, బ్యాంక్ ఆఫర్ల ద్వారా కొన్ని తగ్గింపులు పొందే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు, మీరు రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను ఉపయోగించుకుంటే, అమెజాన్ అదనంగా రూ. 49 ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది.
Read Also: Air cooler Offer: రూ.2500కే 40 లీటర్ల టవర్ ఎయిర్ కూలర్.. ..
ఇది ఎలా పనిచేస్తుంది?
ఉదాహరణకు: మీరు రూ. 7,000 విలువైన ఉత్పత్తిని కొనుగోలు చేస్తున్నారని అనుకుంటే, దానిపై బ్యాంక్ మీకు రూ. 500 డిస్కౌంట్ అందించింది. ఆ క్రమంలో సాధారణంగా, మీరు రూ. 6,500 చెల్లించాలి. కానీ ఇప్పుడు, ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 49 అదనంగా పే చేయాలి. అంటే మీ మొత్తం బిల్లు రూ. 6,549 అవుతుంది. చాలామందికి ఇది చిన్న మొత్తం అనిపించవచ్చు, కానీ తరచుగా షాపింగ్ చేసే వాళ్లకు మాత్రం ఇబ్బందేనని చెప్పవచ్చు.
ఈ ఛార్జీకి కారణం ఏంటి
అమెజాన్ ప్రకారం, బ్యాంక్ ఆఫర్‌ల నిర్వహణకు ఖర్చు అవుతుందని, ఆ ఖర్చును సమతూకం చేసేందుకు ఈ ఫీజును తీసుకుంటున్నామని చెబుతోంది. మరొక విధంగా చెప్పాలంటే, డిస్కౌంట్ మీద అదనపు సేవా రుసుము అని భావించవచ్చు. ఒకవేళ మీరు ఆర్డర్‌ను రద్దు చేసినా లేదా రిఫండ్ కోరినా, ఈ ప్రాసెసింగ్ ఫీజు తిరిగి అందుబాటులోకి రాదు. అంటే, ఇది ఒకసారి చెల్లించిన తర్వాత, మీరు దాన్ని తిరిగి పొందలేరు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఇదే విధానమా?
అవును, అమెజాన్ మాత్రమే కాదు, ఫ్లిప్‌కార్ట్ కూడా ఇలాంటి ప్రాసెసింగ్ ఫీజును ఇంతకు ముందు నుంచే అమలు చేస్తుంది. అంటే, మీకు డిస్కౌంట్ లభించడమే కాకుండా, బ్యాంక్ ఆఫర్‌ను ఉపయోగించుకోవడానికి ఓ అదనపు ఛార్జీ కూడా ఉంటోంది. ఈ ట్రెండ్ చూస్తే భవిష్యత్తులో మరిన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్లు ఇదే విధానాన్ని అమలు చేస్తాయని అనిపిస్తోంది.
మీరు చేసుకోవాల్సిన స్మార్ట్ ప్లానింగ్
-ఈ కొత్త మార్పుతో, మీరు షాపింగ్ చేసే విధానాన్ని కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
-బ్యాంక్ ఆఫర్ ఉపయోగించే ముందు మొత్తాన్ని లెక్కించండి. డిస్కౌంట్ పొందే మొత్తం, అదనపు ఛార్జీ వల్ల మీరు ఎంత ఆదా చేస్తున్నారో లెక్కించుకోండి.
-మీ కార్ట్‌ను సర్దుబాటు చేయండి. మీ డిస్కౌంట్ రూ. 500 కంటే కాస్త ఎక్కువగా ఉంటే, దాన్ని రూ. 500 లోపల తేలికగా తగ్గించుకోవడం వల్ల ప్రాసెసింగ్ ఫీజును మిగిలించుకోవచ్చు.
-కార్డ్ ఆఫర్‌తో ఇతర క్యాష్‌బ్యాక్‌లను పోల్చి చూడండి. కొన్ని బ్యాంకులు ప్రత్యేకంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు ఇస్తుంటాయి. వాటిని ఉపయోగించడం వల్ల మీరు అధిక ప్రయోజనం పొందవచ్చు.