Anil Ambani: రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. రుణాల మోసాలకు సంబంధించిన కేసులో ఈనెల 5న విచారణకు రావాలని ఆదేశించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి కష్టాలు మొదలయ్యాయి. 17 వేల కోట్ల రుణాల మోసాలకు సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తోంది ఈడీ. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. పోయినవారం అనిల్‌కి చెందిన కార్యాలయాల్లో మూడు రోజుల పాటు సోదాలు చేపట్టింది.
మొత్తం 50 కంపెనీలు, 25 మంది వ్యక్తులకు చెందిన ముంబై, ఢిల్లీ సహా మిగతా చోట్ల అంటే 35 ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. ఈ దాడుల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. లభించిన పత్రాల గుట్టు విప్పేందుకు సిద్ధమైంది. ఈనెల 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసు ఇచ్చింది. 17 వేల కోట్లకు సంబంధించి ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేయనుంది ఈడీ.
అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు వేల కోట్ల రూపాయలకు మోసానికి పాల్పడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి. 2017-19 మధ్య అనిల్ అంబానీ గ్రూప్‌కి చెందిన పలు కంపెనీలు ఎస్ బ్యాంక్ ఇచ్చిన 3 వేల కోట్ల రూపాయలు దారి మళ్లినట్టు ఆరోపణలు లేకపోలేదు. ఆ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు లంచం ఇవ్వచూపారనేది ప్రధాన అభియోగం.
ALSO READ: శుభవార్త.. తగ్గిన గ్యాస్ సిలిండర్ల ధరలు
అలాగే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరిట తీసుకున్న 10వేల కోట్ల రూపాయలను దారి మళ్లించారనేది ప్రధాన కారణం. దీనికితోడు ఆర్‌కామ్-కెనరా బ్యాంకుల మధ్య వెయ్యి కోట్ల రుణాల విషయంలో మోసాలు జరిగినట్లు ఆరోపణలు లేకపోలేదు. వీటి అన్నింటిపై ఫోకస్ చేసింది ఈడీ. బ్యాంకులు జారీ చేసే అడిషినల్ టైర్-1 బాండ్లు.. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ రూ.2,850 కోట్ల మేరా పెట్టుబడులు పెట్టిందనేది మరో ఆరోపణ.
ఈ విషయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడిందని మరో అభియోగం. ఈ విషయంలో అనిల్ అంబానీ కంపెనీ ఇప్పటికే ఫ్రాడ్ చేసినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ వ్యవహారంలో నిధులను దుర్వినియోగం చేసినట్టు గుర్తించామని ఆర్‌కామ్‌కు పంపిన లేఖలో స్పష్టం చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌కామ్ నడుచుకున్నట్టు పేర్కొంది. ఈడీ సోదాలకు ముందు పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ వ్యవహారంపై సీబీఐకి ఫిర్యాదు చేసేందుకు ఎస్బీఐ రెడీ అవుతోంది. ఇంతలోనే ఈడీ నుంచి అనిల్‌కు పిలుపు వచ్చింది. మరి ఈడీ విచారణలో అనిల్ ఎలాంటి కొత్త విషయాలు బయట పెడతారో చూడాలి.