భారతీయులు పెద్ద ఎత్తున విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ స్వదేశానికి తమ తల్లిదండ్రుల బాగోగులు చూసుకునేందుకు, భార్యా పిల్లల పోషణ కోసం డబ్బులు స్వదేశానికి పంపడం అనేది సర్వసాధారణ విషయం. మన దేశానికి చెందిన లక్షలాదిమంది నిపుణులు, కార్మికులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మీరందరూ తమ స్వస్థలాలకు స్వగృహాలకు డబ్బులను ఆన్లైన్ ద్వారా పంపిస్తుంటారు. మరి ఇలా పంపించిన డబ్బుపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాలా, వద్దా అనే సందేహం కలగవచ్చు. ఉదాహరణకు… గణేష్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. తన తల్లిదండ్రులు బాగోగుల కోసం ప్రతి నెల 50 వేల రూపాయలు ఆన్లైన్ ద్వారా రిటైర్మెంట్ అయినటువంటి తన తండ్రికి ట్రాన్స్ ఫర్ చేస్తున్నాడు. అయితే ప్రతి సంవత్సరం గణేష్ తండ్రి ఐటిఆర్ ఫైల్ చేస్తున్నారు. ప్రతి ఏడాది తమ కుమారుడు గణేష్ నుంచి ఆరు లక్షల రూపాయలు లభిస్తున్నాయి. మరి ఈ మొత్తం పైన పన్ను చెల్లించాలా వద్దా అనే సందేహం గణేష్ తండ్రికి కలిగింది. దీనికి సంబంధించి ఆదాయపన్ను శాఖ రూల్స్ ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, విదేశాల నుంచి తమ బంధువులు ఎవరికైనా నగదు రూపంలో కానీ వస్తు రూపంలో కానీ డబ్బు పంపినట్లయితే దానిని గిఫ్ట్ గా భావిస్తారు. కనుక ఈ మొత్తం పైన ఎలాంటి పనులు చెల్లించాల్సిన అవసరం లేదు.
అయితే నిజానికి విదేశాల నుంచి వచ్చే డబ్బులు, కానుకులకు ఆదాయ పన్ను శాఖ చట్టంలో అనేక నిబంధనలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)(x) ప్రకారం 50 వేల రూపాయల కన్నా విలువైన వస్తువు కానీ, నగదు కానీ ఒక సంవత్సరంలోగా ఒక వ్యక్తికి పంపించినట్లయితే దానిపై పన్ను వర్తిస్తుంది. అయితే అదే సమయంలో బంధువులకు మినహాయింపు ఇచ్చారు. ఇక్కడ బంధువులు అంటే తల్లిదండ్రులు, భార్యాభర్తలు, తోబుట్టువులు, వారసులు వంటి వారు వస్తారు. ఈ లెక్కన పైన ఉదాహరణ ప్రకారం గణేష్ తన తండ్రికి పంపిస్తున్నటువంటి 50 వేల రూపాయలు పన్ను పరిధిలోకి రావు. వీటికి ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ డబ్బులు తల్లిదండ్రులకు పంపించే గిఫ్ట్ గా భావించాల్సి ఉంటుంది.
అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు డబ్బు రూపంలో వచ్చిన బహుమతిని వడ్డీలుగా తిప్పడం కానీ, ఇతర రూపాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కానీ, ఆస్తులు కొనుగోలు చేసి వాటి ద్వారా ఆదాయం పొందడం ద్వారా కానీ చేసినట్లయితే దానిపై వచ్చిన ఆదాయానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ వచ్చిన డబ్బును కేవలం మీ వ్యక్తిగత ఖర్చుల కోసం మాత్రమే ఖర్చు చేసుకోవాలి. ఎలాంటి వ్యాపారాలు కానీ ఇతర పెట్టుబడులు కానీ పెట్టకూడదు అని నిబంధన ఉంది. ఈ లావాదేవీలన్నీ కూడా డిజిటల్ రూపంలోనే ఉంటాయి కాబట్టి ఆదాయపన్ను నిఘా ఉంటుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రుల జీవన భృతి కోసం మాత్రమే ఉద్దేశించి మీ పిల్లలు అమెరికా నుంచి డబ్బులు పంపినట్లయితే ఎలాంటి పనులు చెల్లించాల్సిన అవసరం లేదన్న సంగతి గుర్తించాలి.