ATM : ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలు ఎంతగా వాడేస్తున్నా.. ఇప్పటికీ ATM కార్డుల అవసరం చాలా మందికే ఉంది. క్యాష్ కావాలంటే కార్డు గీకాల్సిందే. మరీ క్యూలైన్లు గట్రా లేకున్నా.. ఏటీఎమ్‌లలో రద్దీ బాగానే ఉంటుంది. క్రెడిట్ కార్డులు లేని వాళ్లు.. ఏటీఎమ్‌లతోనే ట్రాన్జాక్షన్స్ చేస్తుంటారు. అయితే, మే 1 నుంచి రూల్స్ మారిపోయాయ్. ఎడాపెడా కార్డు వాడేస్తే.. బ్యాంకులు వాయించేస్తాయ్. మీ జేబుకు ఇంకాస్త ఎక్కువే చిల్లు పెట్టనున్నాయి.
కార్డు పెడితే రూ.23 ఖతం
ATM ఛార్జీలను భారీగా పెంచేశాయి బ్యాంకులు. ఉచిత లావాదేవీల పరిమితిని దాటేస్తే.. భారీగా రుసులు వసూల్ చేస్తాయి. RBI నిబంధనల మేరకు.. మే 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ప్రతీ అదనపు లావాదేవీకి.. రూ. 23 వసూలు చేయనున్నారు. అంటే ఇప్పటి వరకూ ఉన్నదానికంటే అదనంగా మరో రూ. 2 భారం పడుతుంది.
ఉచిత ATM లావాదేవీలు
సొంత బ్యాంక్ ఏటీఎమ్‌లలో నెలకు 5 ట్రాన్జాక్షన్స్ వరకు ఉచితంగా వాడుకోవచ్చు. వేరే బ్యాంక్ ATMలలో కూడా మరో 5 సార్లు ఉచితంగా లావాదేవీలు జరపొచ్చు. కాకపోతే, హైదరాబాద్, విశాఖ లాంటి మెట్రో సిటీస్‌లో అయితే, ఇతర బ్యాంకు ఏటీఎంలతో కేవలం 3 సార్లు మాత్రమే ఉచితంగా కార్డు వాడేందుకు పర్మిషన్. ఆ ఫ్రీ ట్రాన్జాక్షన్స్ లిమిట్ దాటితే.. ఇక బాదుడే బాదుడు.
మే 1 నుంచి పైసా వసూల్
ప్రతీ అదనపు ట్రాన్జాక్షన్‌పై గతంలో 21 రూపాయలు వసూలు చేసేవారు. 2022 నుంచి ఇలా చార్జీలు బాదుతున్నారు. ఈ మే 1 నుంచి.. ఆ మొత్తం రూ.21 నుంచి రూ. 23కి పెరగనుంది. అంటే, ఎక్స్‌ట్రాగా మరో 2 రూపాయలు బొక్కన్న మాట. బ్యాంకులకు ఖర్చులు పెరుగుతున్నాయని.. ఇలా ఏటీఎంలపై బాదేస్తున్నారు. రోజురోజుకీ బాగా బతక నేర్చుతున్నాయి బ్యాంకులు. మన డబ్బులు మనం తీసుకుంటే వాళ్లకు పైసలు కట్టాల్సి రావడం దారుణం అంటున్నారు కస్టమర్లు.