Funeral Planning: మనిషి చేతిలో లేని వాటిల్లో మరణం ఒకటి. అలాంటిది మరణించిన తర్వాత అంత్యక్రియలు ఎలా నిర్వహించాలి అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. అయితే ఢిల్లీకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ.. అంత్యక్రియల కాన్సెప్ట్ నే తన వ్యాపార అస్త్రంగా మార్చుకొని అందరినీ సర్ ప్రైజ్ చేస్తోంది. చనిపోయిన తర్వాత తన అంత్యక్రియలు ఎలా జరగాలో బతికుండగానే నిర్ణయించుకునే వెసులుబాటును ఆ కంపెనీ కల్పిస్తోంది. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఢిల్లీకి చెందిన స్టార్టప్ సంస్థ ‘మోక్ష వాయేజ్’ (Moksha Voyage) ఈ వినూత్న సేవలను ఆఫర్ చేస్తోంది. దేశ రాజధానిలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF) వేదికగా ఈ వినూత్న సేవను ఆ సంస్థ పరిచయం చేసింది. ఎంచుకునే సేవలను బట్టి ఈ ప్యాకేజీల ధరలు రూ.6,000 నుంచి ప్రారంభమై రూ.1.5 లక్షల వరకు ఉన్నాయి. మరణం తర్వాత కుటుంబ సభ్యులపై ఆర్థిక భారం పడకుండా, తన అంత్యక్రియలను ఎలా జరగాలో ముందుగానే నిర్ణయించే సౌలభ్యం ఈ స్టార్టప్ అందిస్తోంది.
నమో గంగే వెల్‌నెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న మోక్ష వాయేజ్ సంస్థ.. అంత్యక్రియలకు సంబంధించిన పలు రకాల అవసరాలను తీర్చేలా సేవలను అందిస్తోంది. అంత్యక్రియల నిర్వహణలో సహాయం చేయడం, మృతదేహాన్ని తరలించడానికి వాహన సదుపాయం కల్పించడం, పాడె మోసేవారిని సమకూర్చడం, దహన సంస్కారాల అనంతర కార్యక్రమాల్లో సహాయసహకారాలు వంటివి ఎంచుకున్న ప్యాకేజీని బట్టి లభించనున్నాయి.
విదేశాలకు సంబంధించిన సేవలను కూడా ఈ సంస్థ అందిస్తోంది. ఒకవేళ ఎవరైనా విదేశాల్లో మరణిస్తే వారి భౌతికకాయాన్ని తిరిగి భారత్‌కు రప్పించే ఏర్పాట్లను మోక్ష వాయేజ్ దగ్గరుండి చూసుకుంటుంది. కాబట్టి ప్రవాస భారతీయులు సైతం.. తమ సంస్థ అందిస్తున్న సేవలను ఇప్పుడే బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఇప్పటికే 300 మంది ముందుకొచ్చి అంత్యక్రియల ప్యాకేజీని ఎంపిక చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read: చలికాలంలో మంచి ఆదాయం కావాలా? రూ. 1 లక్ష లోపు పెట్టుబడితో.. 5 లాభదాయక వ్యాపారాలు!
బతికుండానే అంత్యక్రియలను బుక్ చేసుకునే కాన్సెప్ట్ భారత్ లో వింతగా అనిపించినా.. విదేశాల్లో ఇప్పటికే ఈ తరహా సేవలు అందుబాటులో ఉన్నాయి. అంత్యక్రియలను ముందుగా ప్లాన్ చేసుకోవడం, ముందస్తు చెల్లింపులు చేయడం వంటి సర్వీసులను విదేశాల్లోని పలు సంస్థలు ఆఫర్ చేస్తున్నారు. అమెరికాలో అంత్యక్రియల సేవల రంగం ఏటా సుమారు 20.8 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోందని అంచనా. ఈ రంగంలో టాప్ కంపెనీ అయిన సర్వీస్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్ (SCI)కు దాదాపు 17 శాతం మార్కెట్ వాటా ఉంది.
Also Read: మధ్యతరగతికి అందని సొంతిల్లు.. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు చూస్తే షాకే!