Joint vs Separate Bank Accounts: పెళ్లి తర్వాత ప్రేమానుబంధంతో పాటు డబ్బు లెక్కలు కూడా మొదలవుతాయి. ఇంటి అద్దె ఎవరు కట్టాలి? కిరాణా ఖర్చులు ఎవరు చూసుకోవాలి? నెల జీతంలో ఎంత పొదుపు చేయాలి? ఇద్దరి సంపాదనను ఒకే ఖాతాలో వేయాలా? ఇలా కొత్తగా పెళ్లైన జంటలకు ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. కొందరు జీతం మొత్తం ఒకే ఖాతాలో వేస్తే ఖర్చులు సులభంగా ఉంటాయని భావిస్తారు. మరికొందరు ఎవరి డబ్బు వాళ్ల దగ్గరే ఉంటే మంచిదని అనుకుంటారు. అయితే ఈ రెండింటికీ మధ్య ఒక స్మార్ట్ మార్గం ఉంది. అదే హైబ్రిడ్ బ్యాంకింగ్ విధానం. అంటే ఇంటి ఖర్చులు, ఉమ్మడి లక్ష్యాల కోసం ఒక జాయింట్ అకౌంట్.. వ్యక్తిగత అవసరాల కోసం ఎవరి ఖాతాలు వాళ్లకు ఉండటం. కొత్తగా పెళ్లైన జంటలకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుందని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విధానాన్ని ఎలా అమలు చేయాలో చూద్దాం.
భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఇంటి ఖర్చుల బాధ్యత కూడా ఇద్దరూ పంచుకోవాలి. ఇందుకోసం ఒక జాయింట్ బ్యాంక్ అకౌంట్ తెరిచి, ప్రతి నెలా ఇద్దరూ తమ జీతంలో కొంత మొత్తాన్ని అందులో జమ చేయవచ్చు. అయితే ఇద్దరూ తప్పనిసరిగా సమానంగా వేయాల్సిన అవసరం లేదు. ఎవరి ఆదాయం ఎంత ఉందో దానికి తగ్గట్టుగా వాటా నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు ఒకరికి నెలకు రూ.60 వేలు, మరొకరికి రూ.40 వేలు జీతం వస్తుంటే.. అదే నిష్పత్తిలో ఇంటి ఖర్చులకు డబ్బు కేటాయించవచ్చు. ఇంటి అద్దె, కిరాణా సరుకులు, కరెంట్ బిల్లులు, ఈఎంఐలు వంటి ఖర్చులన్నీ ఈ ఖాతా నుంచే చెల్లించుకోవచ్చు. దీంతో ప్రతి నెలా ఎవరు ఎంత ఖర్చు చేశారనే లెక్కలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు.
కేవలం నెలవారీ ఖర్చులకే కాకుండా భవిష్యత్తు లక్ష్యాల కోసం కూడా జాయింట్ అకౌంట్ ఉపయోగపడుతుంది. సొంత ఇల్లు కొనడం, పిల్లల చదువులు, కుటుంబ విహారయాత్రలు, అత్యవసర నిధి ఏర్పాటు వంటి అవసరాల కోసం ఇద్దరూ కలిసి డబ్బు దాచుకోవచ్చు. ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఈ ఖాతాలో జమ చేస్తూ వెళ్తే లక్ష్యాలకు అనుగుణంగా పొదుపు చేయడం సులభమవుతుంది. ఇలా ఇద్దరూ కలిసి ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం వల్ల డబ్బు విషయంలో పారదర్శకత పెరుగుతుంది.
జాయింట్ అకౌంట్ ఉందని పర్సనల్ బ్యాంకు ఖాతాలను మూసేయాల్సిన అవసరం లేదు. భార్యాభర్తలు తమ సొంత ఖాతాలను కొనసాగించడం కూడా అంతే ముఖ్యం. షాపింగ్, స్నేహితులతో బయటకు వెళ్లడం, వ్యక్తిగత ప్రయాణాలు, హాబీలు, ఇతర సొంత అవసరాలకు ఎవరి ఖాతాలోని డబ్బును వారు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ప్రతి చిన్న ఖర్చుకూ భాగస్వామికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న జంటలకు ఈ పద్ధతి ఆర్థిక స్వేచ్ఛను కాపాడుతుంది.
అనుకోకుండా ఒకరికి ఆరోగ్య సమస్య వచ్చినా, మరేదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా జాయింట్ అకౌంట్లోని డబ్బు ఉపయోగపడుతుంది. అయితే భాగస్వామి ఖాతాను ఎలా నిర్వహించవచ్చనేది బ్యాంకులో ఎంచుకున్న ఆపరేటింగ్ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఖాతా తెరిచేటప్పుడు ఇద్దరికీ ఉండే హక్కులు, డబ్బు విత్డ్రా చేసే విధానం, నామినీ వివరాలు వంటి విషయాలను ముందుగానే తెలుసుకోవాలి.
మొత్తానికి ఏది బెస్ట్? భార్యాభర్తలు ఒకే ఖాతాపై పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం లేదు. అలాగని ఎవరి డబ్బు వారిదే అన్నట్లు అన్ని ఖర్చులనూ విడివిడిగా చూసుకోవాల్సిన పనీ లేదు. ఉమ్మడి ఖర్చులకు జాయింట్ అకౌంట్, వ్యక్తిగత అవసరాలకు వేర్వేరు ఖాతాలు.. ఈ రెండింటినీ కలిపి ఉపయోగించుకోవడమే మంచి పద్ధతి. డబ్బు విషయంలో ఇద్దరూ ముందుగానే మాట్లాడుకుని, ఎవరి ఆదాయం ఎంత? ఖర్చులు ఎలా పంచుకోవాలి? ఎంత పొదుపు చేయాలి? అనే విషయాలపై స్పష్టత తెచ్చుకుంటే పెళ్లి తర్వాత ఆర్థిక జీవితం మరింత సాఫీగా సాగుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం: దీనిని పెట్టుబడి సలహాగా పరిగణించేముందు, ఆర్థిక నిర్ణయాలు ఎలాంటివైనా తీసుకునే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
Read Also: ఈక్విటీ, బంగారం, డెట్… 10 లక్షల పెట్టుబడి ఎక్కడ పెట్టాలి ?