SBI Credit Card Rules: మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే డిసెంబర్ 1 నుంచి కొన్ని చెల్లింపులు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రవాణా, ఇంధన ఖర్చులకు సంబంధించి ఎస్‌బీఐ కార్డ్ కొత్త ఛార్జీలను తీసుకొస్తోంది. ఇక ఒకేసారి ఎక్కువ మొత్తంలో రవాణా సేవలకు చెల్లించేవారు, నెలవారీగా పెట్రోల్, డీజిల్‌పై భారీగా ఖర్చు చేసేవాళ్ళపై ఈ ప్రభావం పడనుంది. అక్టోబర్ 27న విడుదల చేసిన నోటీసు ప్రకారం ఈ కొత్త ఛార్జీలు 2026 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక ఏ ఖర్చులపై ఎంత అదనంగా చెల్లించాలి? ఎలాంటి లావాదేవీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయో తెలుసుకుందాం.
ఎస్‌బీఐ (SBI) క్రెడిట్ కార్డుతో ప్రయాణాలకు సంబంధించిన పేమెంట్స్ చేసేవారికి కొత్త నిబంధనల ప్రకారం.. మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఒకేసారి రూ. 30,000 కంటే ఎక్కువ విలువైన ట్రావెల్ చెల్లింపు చేస్తే, ఆ పూర్తి మొత్తం మీద 1 శాతం అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ రూ. 30,000 పరిమితి నెల మొత్తానికి కలిపి కాదు, కేవలం ఒక్కో లావాదేవీకి (సింగిల్ ట్రాన్సాక్షన్‌కు) మాత్రమే వర్తిస్తుంది. అంటే మీరు ఒకే నెలలో విడివిడిగా రూ. 20,000 చొప్పున రెండుసార్లు చెల్లించినా ఎలాంటి ఫీజు పడదు. కానీ ఒక్కసారే రూ. 30,000 దాటితే మాత్రం ఈ 1% అదనపు రుసుము వసూలు చేస్తారు.
ఉదాహరణకు, మీరు ఒకేసారి రూ. 35,000 ట్రావెల్ బిల్లు కడితే అదనంగా రూ. 350, అదే రూ. 50,000 కడితే రూ. 500 అదనపు ఫీజు పడుతుంది. ఒకవేళ మీ పేమెంట్ రూ. 30,000 లేదా అంతకంటే తక్కువ ఉంటే ఒక్క రూపాయి కూడా అదనపు ఛార్జీ ఉండదు. ఈ కొత్త నిబంధన కేవలం బస్సు టికెట్లు, లోకల్ రైలు/మెట్రో ప్రయాణాలు, ఫాస్టాగ్ (FASTag) రీఛార్జ్‌లు, టోల్ గేట్ చెల్లింపుల వంటి ప్రయాణ సంబంధిత సేవలకు (బ్యాంకింగ్ భాషలో MCC 4111, 4784, 4131 కోడ్స్ కింద నమోదయ్యే లావాదేవీలకు) మాత్రమే వర్తిస్తుంది.
పెట్రోల్, డీజిల్ కోసం క్రెడిట్ కార్డు ఎక్కువగా ఉపయోగించేవారు మరో మార్పును గమనించాలి. ఒక బిల్లింగ్ సైకిల్‌లో చేసిన అర్హత కలిగిన ఇంధన లావాదేవీల మొత్తం రూ.50,000 దాటితే, మొత్తం ఇంధన ఖర్చుపై 1 శాతం ఛార్జీ విధిస్తారు. అంటే రూ.50,000 దాటిన మొత్తంపైనే కాకుండా, ఆ బిల్లింగ్ సైకిల్‌లో చేసిన పూర్తి ఇంధన ఖర్చుపై ఈ రుసుము లెక్కిస్తారు. ఒకవేళ ఒక బిల్లింగ్ సైకిల్‌లో మీరు పెట్రోల్, డీజిల్ కోసం మొత్తం రూ.55,000 ఖర్చు చేస్తే, 1 శాతం చొప్పున రూ.550 అదనంగా చెల్లించాలి. అదే ఖర్చు రూ.60,000 అయితే ఛార్జీ రూ.600 అవుతుంది. ఇంధన లావాదేవీలకు MCC 5172, 5541, 5542, 5983 కోడ్‌లు వర్తిస్తాయి.
ఈ మార్పులు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నందున, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు తమ ఖర్చులను ఒకసారి పరిశీలించుకోవడం మంచిది. ముఖ్యంగా ఇంధనంపై నెలవారీగా రూ.50,000 కంటే ఎక్కువ ఖర్చు చేసేవారు, రూ.30,000 దాటే రవాణా చెల్లింపులు చేసేవారు కొత్త ఛార్జీలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రుసుములకు వర్తించే పన్నులు అదనంగా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి లావాదేవీ చేసే ముందు మీ కార్డుకు సంబంధించిన లేటెస్ట్ రూల్స్ ను SBI Card ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో పరిశీలించండి.
Read Also: PPFపై లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా ? 5 సంవత్సరాల పాటు 1.5 లక్షలు జమ చేస్తే ఎంత తీసుకోవచ్చు ?