Winter Business Ideas: చలికాలంలో వాతావరణంతో పాటు ప్రజల అవసరాలు, జీవనశైలిలోనూ స్పష్టమైన మార్పులు కనిపిస్తుంటాయి. ఈ సీజన్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటే తక్కువ పెట్టుబడితోనే మంచి లాభాలు ఆర్జించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రూ. లక్ష లోపు బడ్జెట్‌తో ప్రారంభించగలిగే కొన్ని ఆచరణాత్మక వ్యాపారాలను సైతం సూచిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
చలి పెరిగే కొద్దీ ఉన్ని దుస్తులు, స్వెటర్లు, జాకెట్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతుంది. హోల్‌సేల్ మార్కెట్ల నుంచి నాణ్యమైన ఉన్ని దుస్తులను తక్కువ ధరకు సేకరించి స్థానిక మార్కెట్లు, ఆన్‌లైన్ వేదికల ద్వారా విక్రయించవచ్చు. తక్కువ పెట్టుబడితో మొదలయ్యే ఈ వ్యాపారంలో సీజన్ మొత్తం గిరాకీ ఉండే అవకాశం ఉంది.
చలికాలంలో వేడి నీటి కోసం గీజర్లు, రూమ్ వెచ్చదనం కోసం హీటర్లను ఎక్కువగా వినియోగిస్తారు. ఏడాది పొడవునా మూలన పడిన ఈ పరికరాలు ఒక్కసారిగా వాడకంలోకి రావడంతో రిపేర్ సమస్యలు సహజంగానే తలెత్తుతుంటాయి. కాబట్టి ఎలక్ట్రికల్ పరిజ్ఞానం ఉన్నవారు లేదా శిక్షణ పొందిన సిబ్బందితో డోర్ స్టెప్ రిపేర్ సర్వీసులు అందిస్తే తక్కువ ఖర్చుతో కస్టమర్లను ఆకర్షించవచ్చు.
చలికాలం అంటేనే పెళ్లిళ్ల సీజన్ సందడి మొదలవుతుంది. శుభలేఖల ముద్రణతో పాటు రిటర్న్ గిఫ్ట్‌లు వంటి వాటిపై ప్రింటింగ్ సేవలకు ఈ సమయంలో మంచి ఆదరణ ఉంటుంది. చిన్న స్థాయి ప్రింటింగ్ సెటప్ లేదా స్థానిక ప్రెస్‌లతో సమన్వయం చేసుకుంటూ ఈ రంగంలోకి అడుగుపెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
చాయ్, కాఫీ, సూప్‌లు, వేడి స్నాక్స్ వంటి వాటికి చలికాలంలో ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీగా ఉండే ప్రాంతాలు, కార్యాలయాలు, కాలేజీల సమీపంలో శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ చిన్న స్టాల్ ఏర్పాటు చేస్తే గణనీయంగా ఆదాయం పొందొచ్చు. తక్కువ పెట్టుబడితో త్వరగా నిలదొక్కుకునే వ్యాపారాల్లో ఇదీ ఒకటి.
చలి తీవ్రత పెరిగే కొద్దీ ప్రతి ఇంటికీ దుప్పట్లు, రగ్గుల అవసరం ఏర్పడుతుంది. వివిధ రకాల సైజులు, ధరలలో వీటిని అందుబాటులో ఉంచితే ఫ్యామిలీ, బ్యాచిలర్స్, హాస్టళ్లలో ఉండేవారి నుంచి గిరాకా వస్తుంది. సీజనల్ డిమాండ్‌ను బట్టి స్టాక్ సర్దుబాటు చేసుకుంటే నష్టాలు తక్కువగా ఉండి మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: గెలుపు కోసం స్కెచ్.. డ్రెస్ మార్చి మూడు రకాలుగా నామినేషన్ వేసిన మహిళ.. చివరకు ఏమైందంటే?