Fast Charging EV: చైనా ఆటో తయారీదారు BYD (Build Your Dreams), విద్యుత్ వాహన సంస్థ సంచలన ప్రకటన చేసింది. తాజాగా ఈ కంపెనీ, కేవలం 5 నిమిషాల్లోనే వాహనాన్ని పూర్తిగా ఛార్జ్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు చెప్పింది. ఈ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా వాహనం 400 కిలోమీటర్ల (దాదాపు 250 మైళ్ల) వరకు ప్రయాణించగలదు. ఈ ప్రకటనను BYD CEO వాంగ్ చువాన్‌ఫు ప్రకటించగా, ఈ వార్త BYD సంస్థ స్టాక్స్‌ను గణనీయంగా పెంచేసింది.
ఐదు నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్!
దీంతో ప్రస్తుతం Tesla సూపర్‌చార్జర్ స్టేషన్లలో అందించే ఛార్జింగ్ స్పీడ్ కంటే రెండు రెట్లు వేగంగా BYD కొత్త సాంకేతికత పని చేస్తుందని తెలుస్తోంది. Tesla సూపర్‌చార్జర్ దాదాపు 500 కిలోవాట్ల వేగంతో వాహనాలను ఛార్జ్ చేస్తుండగా, BYD కొత్త టెక్నాలజీ 1,000 కిలోవాట్ల వేగంతో ఛార్జ్ చేయగలుగుతుంది. అంటే కేవలం 5 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయడమే కాకుండా, 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థ్యాన్ని అందించనుంది. ఈ క్రమంలో BYD తన ఛార్జింగ్-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను చైనాలో విస్తృతంగా అమలు చేయాలని యోచిస్తోంది. ఈ అధునాతన ఛార్జింగ్ టెక్నాలజీతో వాహన చార్జింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.
కొత్త వాహనాల్లో ముందుగా అందుబాటులోకి
ఈ సాంకేతికతను BYD త్వరలో విడుదల చేయనున్న సెడాన్, SUV మోడళ్లలో అందించనుంది. ఈ వాహనాల్లో BYD కొత్త బ్యాటరీలు అమర్చబడి, వేగవంతమైన ఛార్జింగ్‌తో పాటు దీర్ఘకాలిక ప్రయాణ సామర్థ్యాన్ని అందించనున్నాయి. అయితే, ఈ వాహనాలను మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేస్తారో కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
Tesla పై BYD ఆధిక్యం
ఈ కొత్త టెక్నాలజీ ద్వారా BYD ప్రత్యక్షంగా Tesla సూపర్‌చార్జర్‌లను పోటీకి తెచ్చింది. Tesla ఇప్పటి వరకు వేగవంతమైన ఛార్జింగ్ సాంకేతికతను అందిస్తూ మార్కెట్‌ను శాసిస్తోంది. అయితే, BYD కొత్త టెక్నాలజీ Tesla కంటే రెండింతల వేగంతో పనిచేస్తుండడం విశేషమనే చెప్పవచ్చు. దీనివల్ల ఫ్యూచర్ EV మార్కెట్‌లో BYD ఆధిపత్యం ప్రదర్శించనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Also: Best 5g Phones Under 10000: రూ. 10 వేల బడ్జెట్ లోపు టాప్ …
బ్యాటరీ టెక్నాలజీలో విప్లవం
BYD అభివృద్ధి చేసిన ఈ నూతన టెక్నాలజీ విద్యుత్ వాహన రంగంలో గేమ్-చేంజర్‌గా మారనుంది. ప్రస్తుతం విద్యుత్ వాహనాలను పూర్తిగా ఛార్జ్ చేయడానికి సాధారణంగా 30 నిమిషాల నుంచి 1 గంట సమయం పడుతుంది. అయితే, BYD అభివృద్ధి చేసిన 1,000 కిలోవాట్ల ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా కేవలం 5 నిమిషాల్లో వాహనాన్ని పూర్తి ఛార్జ్ చేయడం అనేది వినియోగదారులకు చాలా ప్రయోజనంగా మారనుంది.
పర్యావరణ హిత EV మోడల్స్
BYD విద్యుత్ వాహనాలు తక్కువ కాలంలో భారీగా మార్కెట్‌ను ఆకర్షించాయి. కంపెనీ అందించే మోడల్స్ తక్కువ కార్బన్ ఉద్గారాలను కలిగి ఉండటంతో పాటు అధిక మైలేజీని అందిస్తున్నాయి. ఈ కొత్త టెక్నాలజీతో పర్యావరణ పరిరక్షణలో కూడా BYD కీలక పాత్ర పోషించనుంది.
శాసించే అవకాశం
ఈ ఛార్జింగ్ టెక్నాలజీ పూర్తిగా అమలులోకి వస్తే, BYD మార్కెట్ షేర్‌లో భారీగా వృద్ధి సాధించే అవకాశం ఉంది. వినియోగదారులు తక్కువ సమయంలో వాహనాలను ఛార్జ్ చేసుకోవడంతో విద్యుత్ వాహనాల అమ్మకాలు పెరిగే ఛాన్సుంది. వేగవంతమైన ఛార్జింగ్, అధిక మైలేజీ వంటి ప్రయోజనాలతో BYD వాహనాలు EV మార్కెట్‌ను శాసించే అవకాశం ఉంది.