మాటల రచయిత పోసానికి మరొకరు మాటలు నేర్పాల్సిన అవసరం ఉంటుందా..? రచయితగా తన కలానికి పదును పెట్టే పోసానికి మరొకరు స్క్రిప్ట్ రాసి ఇవ్వాలా..? కానీ ప్రస్తుతం పోలీస్ కేసు విచారణలో మాత్రం పోసాని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అప్పట్లో తనకు సజ్జల స్క్రిప్ట్ ఇచ్చారని చెప్పిన పోసాని, తాజాగా తనకు సాక్షి మీడియా నుంచి స్క్రిప్ట్ వచ్చిందని సీఐడీ పోలీసులకు చెప్పినట్టు టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి. వైసీపీ అనుకూల మీడియా మాత్రం పోసాని అలాంటిదేమీ చెప్పలేదని. తనకెవరూ స్క్రిప్ట్ ఇవ్వలేదని ఆయన సీఐడీ ముందు ఒప్పుకుంటున్నట్టు కథనాలిస్తోంది. ఇంతకీ వీటిలో ఏది నిజం..? ఎంత నిజం..?
విశ్వసనీయ సమాచారం..!!
పోలీస్ విచారణలో జరిగింది ఎవరికీ పక్కా సమాచారం ఉండదు. ఎవరైనా విశ్వసనీయ సమాచారం అని తమకొచ్చిన సమాచారాన్ని బయటపెట్టాల్సిందే. అయితే ఇక్కడ ఆ సమాచారంలో విశ్వసనీయత ఎంతనేదే అసలు సమస్య. టీడీపీ అనుకూల మీడియా కథనాల ప్రకారం సీఐడీ పోలీసుల విచారణలో పోసాని తప్పంతా సాక్షి మీడియాపైకి నెట్టేశారనేది సారాంశం. సాక్షి పత్రిక వాళ్లే ప్రెస్ మీట్లు పెట్టాలన్నారని, సబ్జెక్ట్ కూడా వారే ఇచ్చేవారని, సీఐడీ విచారణలో పోలీసులు చెప్పినట్టు టీడీపీ అనుకూల మీడియా కథనాలిచ్చింది. అయితే తనకు ఇచ్చిన స్క్రిప్ట్ లో నిజానిజాలను తాను నిర్థారించుకోలేదని కూడా పోసాని చెప్పాడంటున్నారు. మొత్తం 32 ప్రశ్నలు అడిగారని, అందులో కొన్నిటికి సమాధానాలు చెప్పిన పోసాని, మరికొన్నిటిని దాటవేశారని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో గంట, లేదా రెండు గంటల ముందే తనకు సమాచారం ఇచ్చేవారని, ఆ తర్వాత తాను ప్రెస్ మీట్ పెట్టేవాడినని పోలీసుల ముందు పోసాని ఒప్పుకున్నట్టు చెబుతున్నారు.
సజ్జల స్క్రిప్ట్..?
మధ్యలో సజ్జల స్క్రిప్ట్ ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో సజ్జల తనకు స్క్రిప్ట్ ఇచ్చారని పోలీసుల ముందు చెప్పిన పోసాని, ఇప్పుడు సాక్షి పత్రిక పేరు చెప్పినట్టు టీడీపీ అనుకూల మీడియా కథనం సారాంశం. తన దగ్గర ఎలాంటి ఫొటోలు వీడియోలు లేవని, అవన్నీ తనకు ఇచ్చారని, వారు చెప్పమన్నట్టే తాను చెప్పానని పోసాని అన్నారట.
ఇక సాక్షి మీడియా కథనం మరోలా ఉంది. పోసాని తనకెవరూ స్క్రిప్ట్ ఇవ్వలేదని సీఐడీ పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చినట్టు వారు కథనాలిచ్చారు. అదే సమయంలో పోసాని తాను టీవీల్లో చూసిన వీడియోల ద్వారా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ పై విమర్శలు చేసినట్టు కూడా సాక్షి చెబుతోంది. అంటే నేరుగా పోసానిపైనే సాక్షి నెపం నెట్టేసింది. ఇప్పటి వరకు జరిగినదాంట్లో ఎవరి ఇన్వాల్వ్ మెంట్ లేదని, అంతా తానే సొంతగా చేసినట్టు పోసాని చెప్పారనేది సాక్షి కథనం. ఈ కథనం నిజమైతే.. పోసానిపైనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఓవైపు పోసానికోసం లాయర్ ని పెట్టి ఆయన బెయిల్ కోసం వైసీపీ చేస్తున్న ప్రయత్నాన్ని మనం శంకించాల్సి ఉంటుంది.
మొత్తమ్మీద.. ఎన్నో సినిమాలకు మాటలు రాసి, స్క్రిప్ట్ వర్క్ చేసి, మరెన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్న పోసాని.. చివరకు తనకెవరో రాసిచ్చిన స్క్రిప్ట్ తూచా తప్పకుండా చదివారంటే ఆలోచించాల్సిన విషయమే. అలా చదివినందుకే గత ప్రభుత్వంలో ఆయనకు పదవి లభించిందా అనే అనుమానం కూడా రాకమానదు. పోసాని వాంగ్మూలం విషయంలో మీడియా ఊహాగానాలను పక్కనపెడితే, అసలు ఏం జరిగిందనేది కేసు విచారణలోనే తేలాల్సి ఉంది.