Tesla Autopilot: అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. టెస్లా కంపెనీకి రూ.2100 కోట్ల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు 2019లో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినది. ఈ రోడ్డు ప్రమాదానికి ఆటో పైలట్ డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ కారణమని భావించి కోర్టు జరిమానా విధించింది. ఆటోపైలట్ డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ పాక్షికంగా బాధ్యత వహించిందని కోర్టు నిర్ధారించింది. దీంతో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాకు గట్టి షాక్ తగలింది.
2019లో ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదంలో టెస్లా మోడల్ ఎస్ వాహనం ఓ మహిళ మరణానికి కారణమైంది. ఈ ప్రమాదంలో మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో టెస్లా కారును జార్జ్ మెక్ గీ డ్రైవ్ చేస్తున్నాడు. ఆటోపైలట్ ఫీచర్ ఆన్ చేసి కారు నడుపుతున్నాడు. అయితే తన ఫోన్ అనుకోకుండా కారులోనే కింద పడిపోయింది. వంగి ఫోన్ తీసుకుంటున్న క్రమంలో కారు నేరుగా వెళ్లి రోడ్డుపై ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో బాధిత మహిళ నైబెల్ బెనవిడెస్ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె ప్రియుడు డిల్లాన్ గాయాలపాలయ్యాడు. నైబెల్ బెనవిడెస్ దాదాపు 75 అడుగుల దూరం పడిపోయింది.
దీంతో బాధిత కుటుంబం టెస్లా ఆటోపైలట్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని కోర్టులో ఫిర్యాదు చేశారు. ఫ్లోరిడా కోర్టు బాధిత కుటుంబ చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకుని, టెస్లాకు భారీ జరిమానా విధించింది. ఇందులో బాధిత కుటుంబానికి పరిహారంగా భారీ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది.
ALSO READ: IBPS Notification: డిగ్రీ అర్హతతో 10,277 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ వెకెన్సీలు.. డోంట్ మిస్
సుదీర్ఘ విచారణ జరిపిన ఫ్లోరిడా కోర్టు బాధిత కుటుంబానికి 329 మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 242 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,100 కోట్లు) టెస్లా కంపెనీ చెల్లించాలని పేర్కొంది. మిగిలిన మొత్తం డ్రైవర్ చెల్లించాలని తెలిపింది. ఫ్లోరిడా ఇచ్చిన తీర్పుపై టెస్లా కంపెనీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్టు సంస్థ యాజమాన్యం తెలిపింది.
టెస్లా ఈ తీర్పును అంగీకరించడం లేదు. ఈ నిర్ణయం తమ కంపెనీ వాహనాల సాంకేతికతపై ప్రజల్లో తప్పుడు అవగాహన కలిగించవచ్చని తెలిపింది. కంపెనీ ప్రకారం, ఆటోపైలట్ ఒక సహాయక వ్యవస్థ మాత్రమే, డ్రైవర్ ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండాలి. అయితే, జ్యూరీ టెస్లా మార్కెటింగ్ వ్యూహాలు ఆటోపైలట్ సామర్థ్యాలను ఎక్కువ చేసి చూపించాయని.. ఇది డ్రైవర్లలో నిర్లక్ష్యాన్ని కలిగించిందని చెప్పింది.
ALSO READ: Konda Surekha: కొండా సురేఖపై క్రిమినల్ కేసు.. కోర్టు కీలక ఆదేశాలు
ఈ కేసు ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్స్‌పై చట్టపరమైన నైతిక చర్చలను మరింత తీవ్రతరం చేసింది. టెస్లా ఆటోపైలట్ సాంకేతికత సురక్షితమని ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో వాదిస్తున్నప్పటికీ, ఈ తీర్పు కంపెనీ సాంకేతికతపై ప్రజల నమ్మకంపై ప్రభావితం చేయవచ్చు. ఇలాంటి కేసులు భవిష్యత్తులో టెస్లాకు మరిన్ని చట్టపరమైన సవాళ్లను తీసుకురావచ్చని విశ్లేషకులు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.