Rapido Fined: బైక్, ఆటో, ట్యాక్సీ బుకింగ్ సర్వీస్ రాపిడోకు పెద్ద షాక్ తగిలింది. వినియోగదారుల హక్కులను కాపాడే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) రాపిడోపై రూ. 10 లక్షల జరిమానా విధించింది. కస్టమర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తోందని కారణంతో సీసీపీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
10 లక్షల జరిమానా- కారణం ఇదీ
రాపిడో ఇచ్చిన యాడ్ లో ఐదు నిమిషాల్లో వస్తుంది లేదంటే రూ. 50 ఇస్తాం అని చెప్పింది. అంటే, బుక్ చేసిన 5 నిమిషాల్లో ఆటో రాకపోతే, రూ. 50 రీఫండ్ ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే వాస్తవానికి ఒక్కరికి కూడా ఆ రూ.50 ఇవ్వలేదు. ఇక వినియోగదారుల వ్యవహారాల శాఖ 2025 ఆగస్టు 21న రాపిడోపై చర్యలు తీసుకుంది. ప్రకటనను క్షుణ్ణంగా పరిశీలించి, రీఎంబర్స్‌మెంట్ వ్యవహారంపై విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇలాంటి యాడ్ వల్ల ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా ఉంటుందని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.
Also Read:iPhone Price Drops: ఐఫోన్ 15 ధర తగ్గిందోచ్.. మళ్ళీ ఈ ఆఫర్ ఉండదేమో..?
క్యాష్ కాదు- రాపిడో కాయిన్స్ అంటూ ట్విస్ట్..
సీసీపీఏ దర్యాప్తులో మరో ట్విస్ట్ బయటపడింది. ప్రకటనలో రూ.50 ఇస్తామని చెబుతూ, చిన్న అక్షరాల్లో “అది క్యాష్ కాదు రాపిడో కాయిన్స్ మాత్రమే” అని రాసి ఉంది. ఈ కాయిన్స్‌ను కేవలం బైక్ రైడ్స్ కోసమే ఉపయోగించుకోవచ్చు. అంతేకాక, అవి 7 రోజుల్లోనే ఎక్స్‌పైరీ అవుతాయి. అంటే, యాడ్‌లో చెప్పినది ఒకటే, వాస్తవం మరొకటి అన్నమాట. అలాగే ఆఫర్ షరతుల్లో కూడా ఒక నివేదిక ఇచ్చారు. ఆలస్యం జరిగితే కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని, అది పూర్తిగా డ్రైవర్ల బాధ్యతని రాసి ఉంది. ఇది కంపెనీ తన జవాబుదారీ నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నమేనని సీసీపీఏ తేల్చింది.
రాపిడో పై ఫిర్యాదుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 మే వరకు 575 ఫిర్యాదులు రాగా, 2024 జూన్ నుంచి 2025 జూలై వరకు 1,224 ఫిర్యాదులు వచ్చాయి. అంటే దాదాపు రెట్టింపు. వీటిలో ఎక్కువ ఫిర్యాదులు రీఫండ్ ఇవ్వకపోవడం, ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం, చెప్పినట్లు సర్వీస్ ఇవ్వకపోవడం, 5 నిమిషాల్లో ఆటో రాకపోతే రూ. 50 ఇవ్వకపోవడం వంటివే. ఇవన్నీ రాపిడో సేవలపై వినియోగదారుల అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని సీసీపీఏ ఈ నిర్ణయం తీసుకుంది.