GST Relief: మోదీ సర్కార్ మధ్యతరగతి, తక్కువ ఆదాయం కలిగిన ప్రజలపై దృష్టి పెట్టిందా? వారికి ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోనుందా? ఆయా వర్గాల ప్రజలు ఎక్కువగా వాడుతున్న వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని నిర్ణయించిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ అది జరిగితే ఏ వస్తువులపై మధ్యతరగతి ప్రజలకు చౌకగా వస్తువులు లభించనున్నాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఆదాయపు పన్ను పరిమితిని పెంచి మధ్యతరగతికి ఊరట కల్పించిన మోదీ సర్కార్. ఈసారి మరొక శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మధ్య తరగతి, తక్కువ ఆదాయం కలిగిన ప్రజలకు ఈసారి రిలీఫ్ దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆయా కుటుంబాలు ఎక్కువగా వినియోగించే వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని ఆలోచన చేస్తోంది. అదే జరిగితే మధ్య తరగతి ప్రజలకు బిగ్ రిలీఫ్.
కాకపోతే కంపెనీలు అదే రేటు పెట్టి ఆయా వస్తువు మోతాదుని కాస్త పెంచుతుందనేమో నన్న ఆలోచన లేకపోలేదు. ఈ నేపథ్యంలో 12 శాతంగా ఉన్న జీఎస్టీ శ్లాబ్‌ను తొలగించడం లేదంటే చాలా వస్తువులను 5 శాతం ట్యాక్స్ శ్లాబ్ పరిధిలోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వారిపై భారం తగ్గితే కొనుగోలు శక్తి పెరుగుతుందని అంచనా వేస్తోంది.
వాటిలో టూత్ పేస్ట్, పౌడర్, గొడుగులు, కుట్టు మిషన్లు, ప్రెజర్ కుక్కర్లు వంటింటి పాత్రలు ఉన్నాయి. అలాగే కరెంటు ఇస్త్రీ బాక్సు, గీజర్లు, చిన్నస్థాయి వాషింగ్ మెషీన్లు, సైకిళ్లు ఉండనున్నట్లు దాని సారాంశం. వెయ్యి కంటే ఎక్కువ ధర కలిగిన రెడీమేడ్ దుస్తులు, రూ. 1000 బూట్లు, స్టేషనరీ వస్తువులు, వ్యాక్సిన్లు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ పరికరాలు తగ్గవచ్చని ఆ కథనాల సారాంశం.
ALSO READ: సీఏ లేకుండానే ఐటీఆర్ ఫైలింగ్ చేస్తున్నారా? అందరూ చేసే తప్పులివి
అదే జరిగితే భవిష్యత్తులో ఆయా వస్తువులు చౌకగా లభించనున్నాయి. కేంద్రం తీసుకోబోయే ఈ నిర్ణయం వల్ల ఖజానా రావాల్సిన 40 నుంచి రూ.50 వేల కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని ఓ అంచనా. ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించడం ద్వారా వినియోగం పెరుగుతుందని, దానివల్ల ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చినట్టు అవుతుందని అంటున్నారు. దిగువ, మధ్య తరగతికి ఊరట కల్పించే దిశగా జీఎస్టీ రేట్లు తగ్గించాలని ఆలోచన చేస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయం సాధించాలి. జూలై చివరిలో జీఎస్టీ మండలి సమావేశంలో వీటి గురించి ప్రస్తావనకు రావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గించడంతో చాలామంది మధ్య తరగతి ప్రజలు ఇళ్లు కొనుగోలుపై దృష్టి సారించారు. జీఎస్టీ కూడా తగ్గిస్తే దాదాపు దశాబ్దం తర్వాత మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం లభించనుంది.