ITR Filing Mistakes| ఈ రోజుల్లో ఆన్‌లైన్ పోర్టల్స్, డిజిటల్ ఫామ్‌లతో ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫైల్ చేయడం చాలా సులభతరం అయిపోయింది. చాలా మంది ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) సహాయం లేకుండా తమ రిటర్న్స్ కోసం సొంతంగా ఫైల్ చేస్తున్నారు. ఇది సమయాన్ని, డబ్బును ఆదా చేస్తుంది. అయితే, ఈ సౌలభ్యం ఉన్నప్పటికీ.. పన్ను చెల్లింపుదారులు తరచూ చేసే కొన్ని తప్పుల వల్ల రిఫండ్ ఆలస్యం కావడం లేదా ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు రావడం వంటి సమస్యలను సృష్టిస్తాయి. ఈ తప్పులను నివారించడం ద్వారా మీరు ఇబ్బందులను తప్పించుకోవచ్చు. అవేంటో చూద్దాం!
తప్పుడు ఐటీఆర్ ఫామ్ ఎంచుకోవడం
చాలా మంది తప్పుడు ఐటీఆర్ ఫామ్‌ను ఎంచుకుంటారు. మీ ఆదాయ వనరుల ఆధారంగా సరైన ఫామ్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు.. ఐటీఆర్-1 (సహజ్) రూ. 50 లక్షల వరకు జీతం లేదా పెన్షన్ ఆదాయం ఉన్నవారికి సరిపోతుంది. ఐటీఆర్-2 క్యాపిటల్ గెయిన్స్ ఉన్నవారికి, ఐటీఆర్-3, ఐటీఆర్-4 ఫ్రీలాన్సర్లు లేదా వ్యాపారస్తుల కోసం. తప్పుడు ఫామ్ ఎంచుకుంటే మీ రిటర్న్ తిరస్కరించబడవచ్చు. కాబట్టి, ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో ఫామ్ గైడ్‌ను తప్పక చూడండి. అక్కడుండే సూచనలను జాగ్రత్తగా పాటించండి.
తప్పుడు అసెస్‌మెంట్ ఇయర్ ఎంచుకోవడం
చాలా మంది ఫైనాన్షియల్ ఇయర్,అసెస్‌మెంట్ ఇయర్‌ల విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. 2024-25లో సంపాదించిన ఆదాయానికి అసెస్‌మెంట్ ఇయర్ 2025-26 అవుతుంది. దీన్ని జాగ్రత్తగా ఎంచుకోండి, లేకపోతే మీ రిటర్న్ చెల్లదు.
వడ్డీ ఆదాయం లేదా టీడీఎస్‌ను మరచిపోవడం
చాలా మంది వేతన ఆదాయాన్ని చూపిస్తారు కానీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా సేవింగ్స్ అకౌంట్ నుండి వచ్చే వడ్డీ ఆదాయాన్ని మరచిపోతారు. ఈ సమాచారం ఆదాయపు పన్ను శాఖకు ఇప్పటికే ఏఐఎస్ (అన్నువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్), ఫామ్ 26ఏఎస్‌లో ఉంటుంది. కాబట్టి, ఫైలింగ్‌కు ముందు ఈ రెండింటినీ తప్పక పరిశీలించి, అన్ని ఆదాయ వనరులను స్పష్టంగా డిక్లేర్ చేయండి.
తప్పుడు డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం
సెక్షన్ 80సీ (పీపీఎఫ్, ఎల్‌ఐసీ, ఈఎల్‌ఎస్‌ఎస్) లేదా 80డీ (హెల్త్ ఇన్సూరెన్స్) వంటి డిడక్షన్స్‌ను సరైన ఆధారాలు లేకుండా క్లెయిమ్ చేస్తారు. కొత్త పన్ను విధానంలో చాలా డిడక్షన్స్ లభించవని గుర్తుంచుకోండి. మీరు ఎక్సెంప్షన్స్ క్లెయిమ్ చేయాలనుకుంటే, పాత పన్ను విధానాన్ని ఎంచుకోండి.
ఈ-వెరిఫికేషన్ చేయకపోవడం
ఫైలింగ్ పూర్తయిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కితే సరిపోతుందని చాలా మంది భావిస్తారు. కానీ, 30 రోజుల్లో ఈ-వెరిఫికేషన్ చేయకపోతే మీ రిటర్న్ చెల్లదు. ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ లేదా ఈవీసీ కోడ్ ఉపయోగించి ఈ-వెరిఫై చేయండి.
Also Read: మ్యూచువల్ ఫండ్స్‌లో లాభాలొస్తాయని గ్యారంటీ లేదు.. నిపుణుల వార్నింగ్
ఈ సంవత్సరం కొత్తగా ఏముంది?
ఈ సంవత్సరం ఏఐఎస్ మరియు ఫామ్ 26ఏఎస్ మరింత వివరంగా ఉన్నాయి. మీ ఆదాయం గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తాయి. ఏఐఎస్ యాప్ ఇప్పుడు అందుబాటులో ఉంది. దీంతో మీరు మొబైల్‌లోనే మీ ఆదాయ రిపోర్ట్‌ను చూడవచ్చు. కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ఆప్షన్‌గా ఉంది. కానీ పాత విధానం మీకు లాభదాయకమైతే, దాన్ని ఎంచుకోవడం మర్చిపోవద్దు. ఫామ్ 16తో ఏఐఎస్, 26ఏఎస్‌ను సరిపోల్చడం ద్వారా తప్పులను నివారించవచ్చు.
సీఏ లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయడం ఇప్పుడు కష్టమేమీ కాదు. కానీ, చిన్న తప్పు పెద్ద తలనొప్పిని తెచ్చిపెడుతుంది. జాగ్రత్తగా, అప్డేట్ గా ఉన్న సమాచారంతో సకాలంలో రిటర్న్ ఫైల్ చేయండి. ఇది మీ డబ్బును ఆదా చేయడమే కాక, మీ ఆర్థిక విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇవన్నీ స్వతహాగా చేస్తుంటే.. బహుశా వచ్చే ఏడాది మీరు మరొకరి ఐటీఆర్ ఫైల్ చేయడానికి సహాయం చేయవచ్చు!