కేంద్ర ప్రభుత్వం మహిళలను ఉద్దేశించి అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టింది. అందులోనూ ముఖ్యంగా షెడ్యూల్ తెగలకు (ST) సంబంధించిన అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహించింది. కేంద్ర ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండే NSTFDC ( నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) అనేక ఆర్థిక చేయూత పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగలకు (ST) చెందిన మహిళలకు ఈ స్కీములు పెద్ద మొత్తంలో ఆర్థిక చేయూత అందిస్తున్నాయి. ఇవి ముఖ్యంగా మైక్రో క్రెడిట్ స్కీమ్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ వడ్డీ రేటుకే ఈ స్కీముల ద్వారా రుణాలను పొందవచ్చు. అలాంటి స్కీముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్కీముల్లో ప్రధానంగా ఆదివాసి మహిళా సశక్తీకరణ్ యోజన, అలాగే షెడ్యూల్డ్ తెగల (ST) మహిళలకు స్వయం సహాయక బృందాల రూపంలో అందిస్తున్న మైక్రో క్రెడిట్ స్కీమ్స్ ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో NSTFDC కార్పొరేషన్ కింద మైక్రో క్రెడిట్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీం గురించి ప్రస్తుతం పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ మహిళలను ఉద్దేశించి NSTFDC కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైక్రో క్రెడిట్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్కీములో ప్రస్తుతం స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా మంజూరు చేస్తున్నారు. ఈ స్కీం కింద మహిళలకు గ్రూపుల వారీగా రుణాలను మంజూరు చేస్తారు. ఒక్కో గ్రూపుకు గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంది.
స్కీమ్ అర్హతలు ఇవే
>> ఈ స్కీం కింద షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళలు మాత్రమే అర్హులు.
>> ఒక్కో గ్రూపులో కనీసం ఐదు మంది సభ్యులు ఉండాలి.
>> సభ్యురాలి వయస్సు కనిష్టంగా 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు ఉండాలి
>> అయితే వీరి కుటుంబ గరిష్ట ఆదాయం సంవత్సరానికి లక్ష రూపాయలు మించకూడదు
>> ఈ స్కీమ్ ఉపయోగించుకొని సభ్యులు తమ వ్యాపారం చేసుకోవచ్చు.
వడ్డీ రేటు ఎంత అంటే..?
ఈ స్కీం కింద NSTFDC కార్పొరేషన్ నిధులు సమకూరుస్తుంది. ఇక వడ్డీ విషయానికి వస్తే రాష్ట్రాన్ని బట్టి 4 -6 శాతంగా ఉంది. తెలంగాణలో స్త్రీనిధి తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ స్కీం అమల్లో ఉంది.
తిరిగి చెల్లించే కాలం:
ఈ రుణాన్ని మూడు సంవత్సరాల కాలపరిమితిలోగా చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా ఆరు నెలల వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది.
ఈ రుణం కోసం ఎలా అప్లై చేసుకోవాలి:
ఈ ఋణం కోసం తెలంగాణలో మండల మహిళా సమాఖ్యను సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి స్త్రీ నిధి ఆఫీసర్ ను సైతం సంప్రదించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. దీంతో పాటు కావాల్సిన డాక్యుమెంట్ల విషయానికొస్తే క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే గ్రూపులో ఉన్న మహిళలందరూ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కులానికి చెందిన వారై ఉండాలి.
పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..