Credit Card Debt: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు చాలా మంది జీవితాల్లో భాగమైపోయాయి. రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు, పే లేటర్ (BNPL) వంటి ఆకర్షణీయమైన ఆఫర్ల వల్ల చాలామంది క్రెడిట్ కార్డులను పరిమితికి మించి ఖర్చు ఉపయోగిస్తున్నారు. అయితే నెలాఖరులో పెద్ద మెుత్తంలో బిల్లు రావడం, సరిపడా డబ్బు చేతుల్లో లేకపోవడంతో సమస్య కొనితెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది క్రెడిట్ కార్డ్ యూజర్లను ఓ సందేహం వెంటాడుతూ వస్తోంది. క్రెడిట్ కార్డు బాకీ తీర్చకపోతే పోలీసులు ఇంటికి వస్తారా? జైలుకు పంపుతారా? అనే భయం తీవ్రంగా వేధిస్తుంటుంది. దీనిపై చట్టం ఏం చెబుతుందో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సమయానికి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడంలో విఫలమైతే భారతీయ చట్టాల ప్రకారం రాత్రికి రాత్రే నేరస్థుడిగా మారిపోరు. బిల్లు చెల్లించకపోవడం అనేది ‘సివిల్ వివాదం’ (Civil Dispute) కిందకు వస్తుంది తప్ప అది క్రిమినల్ నేరం కాదు. అందువల్ల కేవలం బాకీ తీర్చలేదనే ఒకే ఒక్క కారణంతో పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేయడంగానీ, జైలుకు పంపడంగానీ కుదరదు.
సాధారణంగా క్రెడిట్ కార్డ్ బిల్లులను రాబట్టుకోవడానికి బ్యాంకులు ఒక నిర్దిష్టమైన పద్దతులను అవలంభిస్తాయి. ముందుగా బిల్లు గడువు తేదీ దాటగానే ముందుగా ఎస్ఎంఎస్ (SMS), ఈమెయిళ్ల ద్వారా రిమైండర్లు పంపుతాయి. ఆ తర్వాత కూడా చెల్లింపు జరగకపోతే బ్యాంక్ రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని సంప్రదించడం ప్రారంభిస్తారు. ఈ దశ మానసికంగా కాస్త ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. ఒకవేళ ఏజెంట్ల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే బ్యాంకులు సివిల్ కోర్టును ఆశ్రయిస్తాయి. ఇది కోర్టు ద్వారా చట్టబద్ధంగా డబ్బులు వసూలు చేసే ప్రక్రియ.
సాధారణంగా క్రెడిట్ కార్డ్ బిల్లులకు సంబంధించిన వివాదాల్లో జైలు శిక్ష ఉండదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శిక్ష పడే ప్రమాదాన్ని కొట్టిపారేయలేం. కేస్ కోర్టుకు వెళ్లిన తర్వాత విచారణలో మీరు ‘కావాలనే డిఫాల్ట్’ (Willful Defaulter) అయ్యారని రుజువైతే సమస్యలు తలెత్తుతాయి. అంటే.. మీ వద్ద డబ్బులు ఉండి కూడా ఉద్దేశపూర్వకంగా చెల్లించకపోవడం, బ్యాంకును మోసం చేయాలనే ఉద్దేశంతోనే పదే పదే రుణాలు తీసుకుని ఎగవేస్తున్నారని ఆధారాలతో సహా నిరూపితమైతే ఆ కేస్ సివిల్ వివాదం నుంచి క్రిమినల్ నేరంగా మారుతుంది. అలాంటి సమయంలో బాకీ ఎగ్గొట్టినందుకు కాకుండా చట్టాన్ని మోసం చేసినందుకు లేదా కోర్టు ఉత్తర్వులను దిక్కరించినందుకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
Also Read: ట్రాయ్ టెలికాం యూజర్ల గణాంకాలు.. Jio, Airtelకి షాకిచ్చిన BSNL.. పాపం చతికిలపడ్డ వీఐ!
ఆర్థిక నిపుణుల ప్రకారం.. బ్యాంకులు ఎంత ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఇచ్చినప్పటికీ అందులో కేవలం 30 శాతం మాత్రమే ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు క్రెడిట్ కార్డు పరిమితి రూ.1 లక్ష అయితే మీ ఖర్చులు రూ. 30,000 మించకుండా చూసుకోవాలి. ఈ ’30 శాతం నియమం’ (30% Rule) పాటించడం వల్ల మీపై అప్పుల భారం పడకుండా ఉండటంతో పాటు సిబిల్ స్కోర్ దెబ్బతినకుండా నెలాఖరులో సులువుగా బిల్లు చెల్లించడానికి వీలవుతుంది.
Also Read: నలుపు vs నీలం సోలార్ ప్యానెళ్లు.. ఏది ఎక్కువ కరెంట్ ఇస్తుంది? మీ ఇంటికి ఏది బెస్ట్?