Black vs Blue Solar Panels: సోలార్ విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. అయితే కొత్తగా ఇంటిపై సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావించే వారికి.. నలుపు, నీలం రంగుల్లో లభించే సోలార్ ప్యానెళ్లు వారి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. చాలామంది వీటిలో కలర్ మాత్రమే తేడా అని భావిస్తుంటారు. కానీ ఈ రంగుల వెనుక ప్యానెళ్లలో ఉపయోగించే సోలార్ సెల్ సాంకేతికత దాగుంది. కాబట్టి కేవలం రంగును చూసి నిర్ణయం తీసుకోకుండా.. ఇంటి అవసరాలకు ఏది సరిపోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నలుపు, నీలం రంగు ప్యానెళ్ల మధ్య వ్యత్యాసం ఏంటో ఈ కథనంలో చూద్దాం.
సాధారణంగా నీలం రంగులో ఉండే ప్యానెళ్లను ‘పాలీక్రిస్టలైన్’ (Polycrystalline) సాంకేతికతతో తయారు చేస్తారు. వీటి తయారీలో ఒకే సిలికాన్ స్ఫటికానికి బదులుగా అనేక సిలికాన్ ముక్కలను కలిపి ఉపయోగిస్తారు. ఈ నిర్మాణ శైలి వల్లే ఇవి నీలిరంగులో కనిపిస్తాయి. ఇళ్లకు, వాణిజ్య సముదాయాలకు ఇవి ఎంతో అనుకూలం. పైగా ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. నల్లటి ప్యానెళ్లతో పోలిస్తే ఇవి చౌక. కాబట్టి ఇంటి పైన తగినంత స్థలం ఉండి, పెట్టుబడి తగ్గించుకోవాలనుకునే వారికి నీలం రంగు ప్యానెళ్లు బెస్ట్ ఆప్షన్.
నల్లటి ప్యానెళ్లను ‘మోనోక్రిస్టలైన్’ (Monocrystalline) సాంకేతికతతో రూపొందిస్తారు. ఇవి ఒకే ఒక్క స్వచ్ఛమైన సిలికాన్ స్ఫటికంతో తయారవుతాయి. ఈ రకమైన నిర్మాణం వల్ల ఒకే రంగులో ముదురు నలుపులో కనిపిస్తాయి. నీలి రంగు వాటితో పోలిస్తే ఇవి.. అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. తక్కువ స్థలంలోనే ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఒకవేళ ఇంటిపై ప్యానెళ్లు అమర్చడానికి స్థలం తక్కువగా ఉన్నప్పుడు నల్లటి మోనోక్రిస్టలైన్ ప్యానెళ్లను ఎంచుకోవడం చాలా మంచిది.
Also Read: ఇది కదా SIP పవరంటే.. రూ. 9 వేలతో రూ. 3 కోట్ల సంపద.. సామాన్యులకు జాక్ పాట్!
సామర్థ్యం విషయానికి వస్తే నలుపు రంగు మోనోక్రిస్టలైన్ ప్యానెళ్లు సుమారు 18% నుండి 22% వరకు విద్యుత్ మార్పిడి సామర్థ్యాన్ని కలిగి ఉంటే.. నీలం రంగు పాలీక్రిస్టలైన్ ప్యానెళ్లు 15% నుండి 17% వరకు మాత్రమే సామర్థ్యాన్ని చూపుతాయి. అలాగే నల్లటి ప్యానెళ్లు మబ్బుగా ఉన్నప్పుడు, సూర్యకాంతి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో కూడా మెరుగైన పనితీరును కనబరుస్తాయి. అయితే కేవలం రంగు ఆధారంగానే పనితీరును అంచనా వేయలేం. తయారీదారు ఇచ్చే సాంకేతిక ప్రమాణాలు, ఉష్ణోగ్రత తట్టుకునే శక్తి వంటి అంశాలను కూడా గమనించాల్సి ఉంటుంది.
Also Read: పోస్టాఫీస్ NSC vs SBI ఎఫ్‌డీ.. మీ డబ్బుకు ఎక్కడ ఎక్కువ లాభం? 5 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్?