Azad Engineering Rakesh Chopdar Success Story: చదువు మధ్యలో ఆగిపోతే జీవితంలో అవకాశాలు కూడా అక్కడితో ఆగిపోతాయని చాలామంది అనుకుంటారు. కానీ, కొందరి కథలు ఆ ఆలోచనను పూర్తిగా మార్చేస్తాయి. హైదరాబాద్‌కు చెందిన రాకేష్ చోప్దార్ ప్రయాణం కూడా అలాంటిదే. పదో తరగతి చదువు పూర్తి చేయకుండానే చిన్న వర్క్ షాప్ లో పని మొదలుపెట్టిన ఆయన.. ఇప్పుడు ప్రపంచంలోని ప్రముఖ విమానయాన సంస్థలు నమ్మే ఏరోస్పేస్ భాగాలను తయారు చేసే సంస్థను నిర్మించారు. ఆయన స్థాపించిన ఆజాద్ ఇంజనీరింగ్ ఇప్పుడు అంతర్జాతీయ ఏరోస్పేస్ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది.
రాకేష్ చోప్దార్‌కు ఇంజినీరింగ్ ఇండస్ట్రీ కొత్తేం కాదు. ఆయన తండ్రికి హైదరాబాద్‌లో చిన్న ఫాస్టనర్లు, నట్స్, బోల్ట్స్ తయారు చేసే వర్క్ షాప్ ఉండేది. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన తర్వాత 16 ఏళ్ల వయసులోనే రాకేష్ అక్కడే పని ప్రారంభించారు. తర్వాతి 12 సంవత్సరాలు ఆయనకు తరగతి గది కంటే ఆ వర్క్ షాప్‌నే పెద్ద పాఠశాలగా మారింది. యంత్రాల మధ్య పనిచేస్తూ తయారీ ప్రక్రియ, లోహాల స్వభావం, కొలతల్లో కచ్చితత్వం, యంత్రాల పనితీరును స్వయంగా నేర్చుకున్నారు. ఆ అనుభవమే ఆయన భవిష్యత్ వ్యాపారానికి బలమైన పునాది వేసింది.
సాధారణ ఫాస్టనర్ల తయారీతోనే ఆగిపోవాలని రాకేష్ అనుకోలేదు. మరింత క్లిష్టమైన, అత్యంత కచ్చితత్వం అవసరమయ్యే భాగాలను తయారు చేయాలనే ఆలోచన ఆయనలో పెరిగింది. 2008లో ఆజాద్ ఇంజనీరింగ్‌ను ప్రారంభించిన తర్వాత ఈ ఆలోచనకు రూపం వచ్చింది. సాధారణ పారిశ్రామిక ఉత్పత్తుల నుంచి అత్యంత క్లిష్టమైన ఏరోస్పేస్ భాగాల తయారీ వైపు సంస్థ అడుగులు వేసింది. వాటిలో ఏరోఫాయిల్ బ్లేడ్లు ప్రత్యేకమైనవి. జెట్ ఇంజిన్లు, టర్బైన్లలో ఉపయోగించే ఈ భాగాలు అత్యంత వేడి, అధిక వేగం, తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఇవి 1,500 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి భాగాల తయారీలో చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకే ప్రతి దశలో కచ్చితత్వం కీలకం.
ఆజాద్ ఇంజనీరింగ్ ఎదుగుదలలో ఖరీదైన యంత్రాలే ప్రధాన కారణం కాదని రాకేష్ ప్రయాణం చెబుతుంది. ఉత్పత్తి ప్రక్రియలో ప్రతి అంశాన్ని కచ్చితంగా నమోదు చేయడం, నాణ్యతను నిరంతరం తనిఖీ చేయడం, తయారైన భాగాలపై పూర్తి స్థాయి ట్రాకింగ్ ఉండేలా వ్యవస్థలను రూపొందించడం సంస్థకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఏరోస్పేస్ రంగంలో నమ్మకం సంపాదించాలంటే కేవలం మంచి ఉత్పత్తి తయారు చేయడం సరిపోదు. ప్రతిసారి అదే స్థాయి నాణ్యతను అందించగలమని నిరూపించాలి. ఆ దిశగా ఆజాద్ ఇంజనీరింగ్ తన వ్యవస్థలను అభివృద్ధి చేసుకుంది.
కచ్చితత్వం, నాణ్యతా ప్రమాణాలతో సంస్థకు అంతర్జాతీయ అవకాశాలు లభించాయి. బోయింగ్, హనీవెల్, ఎయిర్‌బస్, రోల్స్ రాయిస్ లాంటి ప్రపంచ ఏరోస్పేస్ సంస్థలతో ఆజాద్ ఇంజనీరింగ్ కలిసి పని చేయడం మొదలు పెట్టింది. రోల్స్ రాయిస్‌తో ఏడేళ్ల కాంట్రాక్ట్ లాంటి ఒప్పందాలు సంస్థపై అంతర్జాతీయంగా నమ్మకం ఏర్పడేలా చేశాయి.
ఒకప్పుడు హైదరాబాద్‌లోని చిన్న ఫ్యాక్టరీలో నట్స్, బోల్ట్స్ తయారు చేసిన వ్యక్తి.. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ల కోసం అత్యంత కచ్చితత్వం అవసరమైన విమాన భాగాలను తయారు చేసే సంస్థను నిర్మించారు. ఇప్పుడు ఆజాద్ ఇంజనీరింగ్ విలువ రూ.15,000 కోట్లకు పైగా ఉంది. 12కుపైగా దేశాలకు కీలకమైన భాగాలను ఎగుమతి చేస్తోంది. పెద్ద డిగ్రీలు లేకపోయినా.. నేర్చుకోవాలనే తపన, సంవత్సరాల అనుభవం, నాణ్యతపై పట్టుదల, ఒక చిన్న అవకాశాన్ని పెద్ద లక్ష్యంగా మార్చుకునే ధైర్యం ఉంటే ఎదుగుదలకు కొత్త దారులు తెరుచుకుంటాయని రాకేష్ చోప్దార్ ప్రయాణం ఉదాహారణగా నిలుస్తోంది.
Read Also: ఇండియన్ బుల్లెట్ రైలు భూకంపాన్ని ముందే పసిగడుతుందా? అదిరిపోయే సేఫ్టీ సీక్రెట్ ఇదే!