Yamaha 250cc to 1000cc Bikes: భారత మార్కెట్లో ప్రీమియం బైక్‌లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో యమహా తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. ఇప్పటి వరకు 150-200cc విభాగంలో ఎక్కువగా కనిపించిన ఈ జపాన్ బ్రాండ్.. ఇకపై పెద్ద ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లపై ఫోకస్ పెట్టనుంది. 250cc నుంచి 1000cc వరకు కొత్త ప్రీమియం బైక్‌లను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ రెడీ అవుతోంది. అయితే, ఏ మోడళ్లను ఎప్పుడు తీసుకొస్తారనే పూర్తి వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
భారత్ లో ప్రస్తుతం యమహా పోర్ట్ ఫోలియోలో R2, R15, MT-15, FZ సిరీస్ లాంటి మోడళ్లు ఉన్నాయి. కంపెనీ అధికారిక ఆన్‌లైన్ లైనప్‌లో R2, R2M వంటి కొత్త ప్రీమియం మోడళ్లు కూడా కనిపిస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లలో యమహా మరింత విస్తృతమైన ప్రీమియం పోర్ట్ ఫోలియోను కలిగి ఉంది. R3, R7, R9 స్పోర్ట్స్ బైక్ లతో పాటు MT-07, MT-09, XSR900, టెనెరె 700 లాంటి మోడళ్లు ఉన్నాయి. వీటిలో కొన్ని మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకురానుంది.
యమహా గతంలోనే భారత్ లో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో R7, టెనెరె 700లను ప్రదర్శించింది. దీంతో ఈ రెండు మోడళ్లపై భారత బైక్ ప్రియుల్లో ఆసక్తి ఏర్పడింది. అయితే, వాటి ఇండియా లాంచ్ తేదీపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముఖ్యంగా టెనెరె 700 భారత మార్కెట్లోకి వస్తే అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగంలో యమహా పోర్ట్ ఫోలియోకు కీలక మోడల్‌గా మారే అవకాశం ఉంది. అంతర్జాతీయ వెర్షన్‌లో 689cc ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది.
ప్రస్తుత గ్లోబల్-స్పెక్ టెనెరె 700లో 689cc, లిక్విడ్ కూల్డ్, రెండు సిలిండర్ల ఇంజిన్ ఉంది. ఇది 73.4 PS గరిష్ట పవర్, 68 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ ను యాడ్ చేశారు. ఇక ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, స్విచ్చబుల్ ABS, ఎలక్ట్రానిక్ థ్రాటిల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. తాజా టెనెరె 700లో 6.3 అంగుళాల TFT డిస్ ప్లే, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్ లాంటి టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది.
భారత్‌లో ప్రీమియం బైక్‌ల ధరలు వినియోగదారుల నిర్ణయంలో కీలకంగా మారుతున్నాయి. అందుకే యమహా భారత్‌లో స్థానిక ఉత్పత్తిని పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది. దేశంలో ఇప్పటికే బలమైన సప్లయర్ నెట్ వర్క్ ఉండటంతో పాటు, ఇక్కడి నుంచి ఎగుమతులను కూడా పెంచే అవకాశం కంపెనీకి ఉంది. తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ ప్లాంట్ విస్తరణకు సంబంధించిన ప్రాజెక్టుకు 2025లో పర్యావరణ అనుమతి లభించింది.
Read Also: టియాగో To హారియర్.. టాటా ఈవీలన్నింటికీ BaaS ఆప్షన్!