Bullet Train Earthquake Safety: ముంబై-అహ్మదాబాద్ మధ్య పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ లో వేగానికే కాదు.. భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. గంటకు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలు మార్గంలో భూకంపం లాంటి ప్రకృతి విపత్తు ఎదురైతే పరిస్థితిని ఎలా నియంత్రించాలనే దానిపై ప్రత్యేక వ్యవస్థను రెడీ చేస్తున్నారు. ఇందుకోసం మొత్తం 28 సీస్మోమీటర్లను ఏర్పాటు చేబోతున్నారు.
508 కిలోమీటర్ల పొడవైన ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ మార్గంలో రైలు గరిష్ఠంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనుంది. రైలు డిజైన్ వేగం గంటకు 350 కిలోమీటర్లు. తొలి దశలో సూరత్-వాపి మధ్య 97 కిలోమీటర్ల మార్గంలో సర్వీసును ప్రారంభించేందుకు రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. B28 ట్రైన్ సెట్ గా పిలిచే తొలి బుల్లెట్ రైలును 2027 ఆగస్టు 15న ప్రారంభించాలని భావిస్తోంది.
హైస్పీడ్ రైలు ప్రయాణంలో భూకంపం వస్తే, తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సాధారణ రైళ్లతో పోలిస్తే బుల్లెట్ రైళ్ల వేగం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రకంపనలు గుర్తించిన వెంటనే స్పందించడం అవసరం. అందుకే, ఈ కారిడార్ లో ప్రత్యేక భూకంప గుర్తింపు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. భూమిలో ప్రకంపనలు మొదలైనట్లు సీస్మోమీటర్లు గుర్తిస్తే, సంబంధిత భద్రతా వ్యవస్థ వెంటనే అలర్ట్ అవుతుంది. ప్రభావిత ప్రాంతానికి విద్యుత్ సరఫరాను ఆటోమేటిక్‌గా నిలిపివేస్తుంది. విద్యుత్ సరఫరాలో మార్పును రైలు గుర్తించిన తర్వాత ఎమర్జెన్సీ బ్రేకులు పని చేస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్న రైలు వేగాన్ని తగ్గించి ఆగేందుకు వీలవుతుంది.
భద్రతా వ్యవస్థలో భాగంగా మొత్తం 28 సీస్మోమీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 22 పరికరాలను రైల్వే మార్గానికి సంబంధించిన ట్రాక్షన్ సబ్‌స్టేషన్లు, స్విచింగ్ పోస్టుల దగ్గర ఏర్పాటు చేయనున్నారు. మహారాష్ట్రలో ముంబై, థానే, విరార్, బోయిసార్ ప్రాంతాల్లో ఎనిమిది సీస్మోమీటర్లు ఉంటాయి. గుజరా లో వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, మహేమదాబాద్, అహ్మదాబాద్ ప్రాంతాల్లో మరో 14 పరికరాలను ఏర్పాటు చేయనున్నారు.
భూకంప భద్రతలో మరో ఆసక్తికరమైన అంశం ఆరు అంతర్గత సీస్మోమీటర్లు. ఇవి నేరుగా రైల్వే మార్గం వద్ద కాకుండా, భూకంప ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. గత 100 ఏళ్లలో బుల్లెట్ రైలు మార్గానికి సమీపంలో 5.5 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు నమోదైన ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రదేశాలను ఎంపిక చేశారు. మహారాష్ట్రలో ఖేడా, రత్నగిరి, లాతూర్, పాంగ్రి, గుజరాత్‌లో ఆదేసర్, ఓల్డ్ భుజ్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
ఈ భూకంప గుర్తింపు వ్యవస్థను జపాన్ షింకన్సెన్ సాంకేతికత ఆధారంగా అభివృద్ధి చేస్తున్నారు. జపాన్ నిపుణులు ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రత్యేక సర్వేలు నిర్వహించడంతో పాటు, నేలలోని సూక్ష్మ ప్రకంపనలను పరిశీలించి సెన్సార్లకు అనువైన ప్రదేశాలను గుర్తించారు. అంటే.. భూకంపం పూర్తిగా ఆగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు. ప్రకంపనలను వీలైనంత త్వరగా గుర్తించి, రైలు వేగాన్ని నియంత్రించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడమే ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ లో వేగం ఎంత ముఖ్యమో, ఆ వేగాన్ని అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా నియంత్రించడం కూడా అంతే ముఖ్యం. అందుకే, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
Read Also: గంటకు 350 కి.మీ.. భారత్ తయారు చేయనున్న కొత్త బుల్లెట్ రైలు ఇదే!