Mahesh Kumar Goud: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రేపు జరగబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం పర్యటనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నందున ఈ సభకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ ప్రజా పాలన అందిస్తున్నామని చెప్పారు. రైతు రుణమాఫీ, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం సరఫరా, సామాజిక భద్రతా పింఛన్ల ద్వారా ప్రతి కుటుంబానికి తోడ్పాటు అందిస్తున్నామని వివరించారు.
అందరూ భాగస్వాములు కావాలి
సిరిసిల్లతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఈ సభకు భారీగా తరలిరావాలని కోరారు. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులు, కార్మికులు , నేతన్నలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను సక్సెస్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఐక్యంగా సభను విజయవంతం చేద్దాం
గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పనిచేసి ప్రజలను సభకు సమీకరించాలని సూచించారు. ‘సిరిసిల్ల సభ మన ప్రజా పాలనకు, అభివృద్ధి-సంక్షేమానికి వేదికగా నిలవాలి. కాంగ్రెస్ కుటుంబమంతా ఐక్యంగా కదిలి ఈ సభను ఒక చారిత్రాత్మక విజయంగా మార్చాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: శ్రీమంతుడులా వచ్చి సిరిసిల్లలో పడ్డాడు.. కేటీఆర్‌పై ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు!