Ultraviolette Shockwave Launch: ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి అల్ట్రావయోలెట్ నుంచి మరోసారి నిరాశ ఎదురైంది. బెంగళూరుకు చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ అల్ట్రావయోలెట్ తన షాక్‌వేవ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్‌ను వాయిదా వేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2026లోనే డెలివరీలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ బైక్ 2027 ఫస్ట్ క్వార్టర్ లో మార్కెట్లోకి రానుంది. అయితే, ఆలస్యానికి కారణం.. కంపెనీ కొత్త 100V ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించి బైక్‌ను మరింత శక్తివంతంగా, మెరుగైన థర్మల్ సామర్థ్యంతో, వేగంగా ఛార్జ్ అయ్యేలా అభివృద్ధి చేయడమేనని వెల్లడించింది.
షాక్ వేవ్ ను మొదటిసారి 2025లో ప్రదర్శించినప్పుడు.. తేలికైన, వేగవంతమైన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. తొలి 1,000 మంది కస్టమర్ల కోసం రూ.1.49 లక్షల ఎక్స్ షోరూమ్ ధరను కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ప్రొడక్షన్ వెర్షన్ లో కొత్త 100V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్ ను ఉపయోగించాలని అల్ట్రావయోలెట్ నిర్ణయించింది. దీని వల్ల పవర్ డెలివరీ, బ్యాటరీ థర్మల్ మేనేజ్‌మెంట్, ఛార్జింగ్ సామర్థ్యంలో మెరుగుదల వస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం షాక్ వేవ్ కోసం ఉత్పత్తి లైన్ ను ఏర్పాటు చేసే పనులు కూడా ప్రారంభమైనట్లు వెల్లడించింది.
షాక్ వేవ్ లో 3.5kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 165 కిలోమీటర్ల IDC రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. సిటీ ప్రయాణాలకు సరిపోయే రేంజ్ తో పాటు తక్కువ బరువును ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఈ మోటార్ సైకిల్ ను అభివృద్ధి చేశారు. ఈ బైక్ సింగిల్ సీట్, డ్యూయల్ సీట్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి రానుంది. అంటే రోజువారీ కమ్యూటింగ్‌తో పాటు స్పోర్టీ రైడింగ్‌ను కోరుకునే వినియోగదారులను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
పనితీరు విషయంలో షాక్‌వేవ్ ప్రత్యేకంగా నిలవనుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 14.5 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. వెనుక చక్రం వద్ద 505 Nm గరిష్ట టార్క్ ను అందిస్తుంది. ఈ బైక్ కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ వేగాన్ని అందుకుంటుందని అల్ట్రావయోలెట్ చెబుతోంది. దీంతో స్పోర్టీ రైడింగ్ అనుభూతిని కోరుకునే యువతను ఆకట్టుకునేలా దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
షాక్ వేవ్ మాత్రమే కాదు.. అల్ట్రావయోలెట్ మరో కీలక మోడల్ టెసరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో కూడా ఇదే తరహా మార్పు చేసింది. కొత్త 100V ఆర్కిటెక్చర్‌కు మారుస్తున్న కారణంగా టెసరాక్ట్ డెలివరీలను కూడా 2027 జనవరికి వాయిదా వేసింది. అయితే, ఫైనల్ ధర, పూర్తి ఫీచర్ల జాబితా, వేరియంట్లు, డెలివరీ వివరాలను లాంచ్ వేళ కంపెనీ ప్రకటించనుంది.
Read Also: యమహా నుంచి ప్రీమియం బైక్‌ల జోరు.. భారత్‌లో కొత్త మోడళ్లకు ప్లాన్!