Jeans Pocket: జీన్స్ ప్యాంటుపై కుడి వైపున ఉండే ఆ చిన్న పాకెట్ అందరికీ పరిచయమే. చాలామంది దీనిని నాణేలు (కాయిన్స్) లేదా ఇతర చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఉపయోగిస్తుంటారు. కానీ దాని అసలు కథ వేరు. నిత్యం మనం చూసే ఆ చిన్న డిజైన్ వెనుక 150 ఏళ్లనాటి గొప్ప చరిత్ర, ఆసక్తికరమైన విశేషాలు దాగి ఉన్నాయి. ఆవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఈ చిన్న జేబును కాయిన్స్ వేసుకోవడానికి తయారు చేయలేదు. 1873లో లేవీ స్ట్రాస్, జాకబ్ డేవిస్.. రక రకాల పనులకు పనికొచ్చేలా కాటన్ డెనిమ్ ట్రౌజర్ల కోసం పేటెంట్ పొందారు. ఆ కాలంలో మైనింగ్ చేసేవారు, కౌబాయ్‌లు, రైల్వే కార్మికులు చైన్‌లు ఉండే పాకెట్ వాచ్‌లను ఎక్కువగా వాడేవారు. పనులు చేసేటప్పుడు ఆ గడియారాలు పడిపోకుండా, గీతలు పడకుండా భద్రంగా ఉంచడం కోసమే ఈ చిన్న జేబును రూపొందించారు. అందుకే లేవీ స్ట్రాస్ కంపెనీ ఇప్పటికీ దీనిని ‘వాచ్ పాకెట్’ అని పిలుస్తుంది.
తొలిసారి మార్కెట్‌లోకి వచ్చిన జీన్స్ ప్యాంట్లలో ఈ చిన్న జేబు లేదు. 1890వ దశకంలో కార్పెంటర్లు, రైల్వే సిబ్బంది, రైతులు ఎక్కువగా జీన్స్ వాడటం మొదలుపెట్టిన తర్వాతే ఈ డిజైన్‌ను జోడించారు. కార్మికుల్లో పాకెట్ వాచ్‌ల వినియోగం పెరగడంతో, పేటెంట్ వచ్చిన కొన్నేళ్లకు లేవీ స్ట్రాస్ కంపెనీ ఈ మార్పు చేసింది.
చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన నిజం ఏంటంటే… రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ చిన్న జేబు దేశ రక్షణకు ఉపయోగపడింది. యుద్ధంలో ఆయుధాల తయారీకి లోహం (మెటల్) కొరత ఏర్పడటంతో, ఈ చిన్న జేబు అంచున వాడే మెటల్ గుండీలు తొలగించారు. ఆ రకంగా కొంత లోహాన్ని ఆదా చేసి యుద్ధ రంగానికి పంపించారు. యుద్ధం ముగిసిన తర్వాత మళ్లీ ఆ మెటల్ గుండీలను ప్యాంట్లకు అమర్చడం విశేషం.
కాలం మారే కొద్దీ ఈ జేబు పేరు, ఉపయోగం కూడా మారాయి. కాలానికి తగినట్లుగా ప్రజల అవసరాలు ఎలా మారాయో ఈ జేబుకు పెట్టిన పేర్లే చెబుతాయి. ప్రారంభంలో ‘ఫ్రాంటియర్ పాకెట్’ అని పిలిచిన ఈ జేబును తర్వాతి రోజుల్లో కాయిన్ పాకెట్, మ్యాచ్ (అగ్గిపెట్టె) పాకెట్, టికెట్ పాకెట్, కాండోమ్ పాకెట్ అని రకరకాల పేర్లతో పిలిచారు.
1800ల కాలంతో పోలిస్తే ఈ బుల్లి జేబు పరిమాణం ఈనాటి జీన్స్ ప్యాంట్లలో లేదనే చెప్పాలి. నాటి పాకెట్ వాచ్‌లు కాస్త లావుగా ఉండటంతో అప్పట్లో ఈ జేబు కాస్త పెద్దదిగా ఉండేది. కానీ కాలక్రమేణా చేతి గడియారాలు (రిస్ట్ వాచ్‌లు) రావడంతో పాకెట్ వాచ్‌ల వాడకం తగ్గిపోయింది. దాంతో పాటు ఈ జేబు సైజు కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయినా సరే.. జీన్స్ డిజైన్ నుంచి ఇది పూర్తిగా మాత్రం మాయం కాలేదు.
Also Read: లాడెన్ ఎక్కడ దొరికాడో మర్చిపోయావా? ఐరాసలో పాక్ ప్రధానికి ఇచ్చిపడేసిన భారత్!
ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్నో ట్రెండ్లు వచ్చాయి, పోయాయి. స్కిన్నీ జీన్స్, బ్యాగీ ఫిట్స్, లో రైజ్, హై-వేస్ట్, యాసిడ్ వాష్, జెగ్గింగ్స్.. ఇలా ఎన్ని రకాల మోడల్స్ వచ్చినా ఈ చిన్న జేబు స్థానం మాత్రం మారలేదు. ఒకప్పుడు కేవలం కార్మికుల దుస్తులుగా ఉన్న జీన్స్ నుంచి నేటి అధునాతన ఫ్యాషన్ జీన్స్ వరకు ప్రతీ దాంట్లో ఈ ‘వాచ్ పాకెట్’ సగర్వంగా తన ఉనికిని చాటుకుంటూనే ఉంది.
Also Read: ఐరాస వేదికగా పాక్ పరువు తీసిన జైశంకర్.. ఆ దేశ విలేకరి ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్!