Hyderabad Property Prices: ఒకప్పుడు హైదరాబాద్‌లో ఉద్యోగం సంపాదిస్తే చాలు.. చిన్నదో పెద్దదో ఓ సొంతిల్లు కొనుక్కోవచ్చనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగం ఉంది.. జీతం వస్తోంది.. బ్యాంకులో లోన్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. కానీ ఇల్లు కొనాలంటే మాత్రం గుండె గుభేల్‌మంటోంది. ఎందుకంటే భాగ్యనగరంలో ఇంటి ధరలు అలా పెరిగిపోతున్నాయి మరి. నిన్నటివరకు కోటి 90 లక్షలుగా ఉన్న సగటు ఇంటి ధర.. ఇప్పుడు రెండు కోట్ల పదిహేను లక్షలకు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.21 లక్షల పెరుగుదల. అసలు హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎందుకిలా పరుగులు పెడుతున్నాయి? కొనుగోలుదారులు వెనక్కి తగ్గుతున్నా బిల్డర్లు ధరలు ఎందుకు తగ్గించడం లేదు? అసలు రీజన్స్ ఏంటో చూద్దాం.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందంటే..
ముందుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పరిస్థితి ఎలా ఉందంటే… సీఆర్ఈ మ్యాట్రిక్స్, క్రెడాయ్ జాయింట్‌గా ఒక రిపోర్ట్‌ను రిలీజ్ చేశాయి. హైదరాబాద్‌లో సగటు ఇంటి ధరలు ఏడాది కాలంలో ఏకంగా 10.5 శాతం పెరిగాయి. గత ఏడాది మూడో త్రైమాసికంలో రూ.1.94 కోట్లుగా ఉన్న సగటు ఇంటి ధర.. ఈ ఏడాది అదే సమయానికి రూ.2.15 కోట్లకు చేరింది. ఒక్కసారి ఆలోచించండి. ఏడాది క్రితం ఇల్లు కొనాలని ప్లాన్ చేసిన వ్యక్తి.. ఇప్పుడు అదే ఇంటి కోసం మరో 21 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి.
ఢిల్లీ తర్వాత హైదరాబాద్ దే హవా..
దేశంలోని ప్రధాన నగరాల ధరలతో పోల్చినా హైదరాబాద్ పరిస్థితి ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఢిల్లీలో సగటు ఇంటి ధర 3.25 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే.. 2.15 కోట్లతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. బెంగళూరులో 1.85 కోట్లు, ముంబై, చెన్నైలో 1.39 కోట్లుగా యావరేజ్ ధరలు నమోదయ్యాయి. అంటే.. ఒకప్పుడు అందుబాటులో ఉన్న నగరంగా పేరొందిన హైదరాబాద్.. ఇప్పుడు దేశంలోనే అత్యంత ఖరీదైన మార్కెట్లలో ఒకటిగా మారిపోయింది.
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఇంతలా పెరగడానికి కారణమేంటి?
మొదటి కారణం.. భూముల ధరలు. ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు, మౌలిక సదుపాయాలు పెరగడంతో నగరంలోని కీలక ప్రాంతాల్లో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిసరాల్లో భూముల విలువ పెరగడం నిర్మాణ వ్యయంపై ప్రభావం చూపుతోంది.
రెండో కారణం..
ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్.. అంటే FSI నిబంధనలు. హైదరాబాద్‌లో ఎత్తైన భవనాల నిర్మాణానికి ఉన్న వెసులుబాటుతో బిల్డర్లు పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులను చేపడుతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో సగటు ఫ్లాట్ విస్తీర్ణం వెయ్యి నుంచి 1,500 చదరపు అడుగుల మధ్య ఉంటే.. హైదరాబాద్‌లో అది ఏకంగా 2,000 చదరపు అడుగుల వరకు ఉంటోంది. అంటే ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో కొనుగోలుదారులు పెద్ద ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా చదరపు అడుగు ధరతో పాటు ఇంటి మొత్తం ధర కూడా భారీగా కనిపిస్తోంది.
ఇక మూడో కారణం..
అంతర్జాతీయ పరిస్థితులు. ఇరాన్-అమెరికా యుద్ధ ప్రభావంతో రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు 10 నుంచి 15 శాతం వరకు పెరిగాయని బిల్డర్లు చెబుతున్నారు. నిర్మాణ సామగ్రిని తరలించడం దగ్గర నుంచి ప్రాజెక్టులను పూర్తి చేయడం వరకు ఖర్చుల భారం పెరుగుతోంది. దీనికి తోడు కార్మికుల కొరత, నిర్మాణ పనుల్లో జాప్యం, ముడిసరుకుల ధరలు, రుణాలపై వడ్డీ భారం.. ఇవన్నీ కలిసి బిల్డర్లపై అదనపు భారాన్ని మోపుతున్నాయి.
ఇంత ధర పెట్టి కొనేవాళ్లు ఉన్నారా?
సరే.. ధరలు పెరిగాయి. కానీ ఇంత ధర పెట్టి కొనేవాళ్లు ఉన్నారా? అంటే.. ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఇళ్ల కొనుగోలుపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌లో 13 వేల 270 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 13.5 శాతం తగ్గాయి. ముఖ్యంగా 1.5 కోట్లకు పైగా ధర ఉన్న ఇళ్ల అమ్మకాలు తగ్గాయి. అంతేకాదు.. అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ఇళ్లను విక్రయించడానికి గతంలో ఏడు నెలల సమయం పడితే.. ఇప్పుడు ఏకంగా పదిన్నర నెలలకు పైగా పడుతోంది. అంటే మార్కెట్లో ఇళ్లకు డిమాండ్ తగ్గుతోంది. కాని అమ్మేవారు మాత్రం నో కాంప్రమైజ్ అనే స్టైల్‌లో ఉన్నారు. బిల్డర్లు మాత్రం భూముల ధరలు, నిర్మాణ వ్యయాలు, వడ్డీ భారాన్ని రీజన్‌గా చెబుతూ ధరలు తగ్గించేందుకు సిద్ధంగా లేరు. మరోవైపు కోటి నుంచి కోటిన్నర రూపాయల మధ్య ధర ఉన్న ఇళ్లకు మాత్రం కొంతమేర డిమాండ్ కొనసాగుతోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో విచిత్ర పరిస్థితి
మొత్తానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి.. మరోవైపు అమ్మకాలు తగ్గుతున్నాయి. బిల్డర్లు ధరలు తగ్గించలేమంటున్నారు.. కొనుగోలుదారులు మాత్రం ఇంత ధర పెట్టి కొనలేమంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కువగా నష్టపోతున్నది ఎవరు? సొంతింటి కోసం ఏళ్ల తరబడి డబ్బు దాచుకుంటున్న మధ్యతరగతి కుటుంబాలే కదా. ఒకప్పుడు హైదరాబాద్‌లో సొంతిల్లు అనేది అంటే ఫ్యూచర్‌కు సేఫ్టీగా ఉండేది. కానీ ఇప్పుడు అదే సొంతిల్లు ఒక చాలెంజింగ్‌గా మారింది. మరి రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఇంకా పెరుగుతాయా? లేక కొనుగోలుదారుల డిమాండ్ తగ్గడంతో ధరలకు బ్రేక్ పడుతుందా? చూడాలి.. భాగ్యనగరంలో సామాన్యుడి సొంతింటి కల ఎప్పుడు ఈజీగా మారుతుందో.
Also Read: OLXలో బైక్ కొనేందుకు వచ్చి.. టెస్ట్ రైడ్ పేరిట బైక్‌తో పరారైన దుండగుడు