మరికొన్ని గంటల్లో ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ కి రాబోతున్నారు. కర్నూలు జిల్లాలో ఆయన పర్యటిస్తారు. కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి ముందుగా శ్రీశైలం వెళ్తారు. అక్కడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో జరిగే పూజా కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు. అనంతరం శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరంలో కాసేపు గడుపుతారు. అనంతరం తిరిగి కర్నూలు చేరుకుని భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు, పూర్తయిన కొన్ని ప్రాజెక్ట్ లను ఆయన ప్రారంభిస్తారు. విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలు సహా ఇతర రంగాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయని స్వయంగా మోదీ ట్వీట్ వేశారు.
I will be in Andhra Pradesh tomorrow, 16th October. I will pray at the Sri Bhramaramba Mallikarjuna Swamy Varla Devasthanam in Srisailam. After that, I will be in Kurnool where development projects worth over Rs. 13,400 crores would be inaugurated or their foundation stones would…
— Narendra Modi (@narendramodi) October 15, 2025
సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్..
కర్నూలులో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ సవరణల ప్రయోజనాలను వివరిస్తూ కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయమై ప్రధాని నరేంద్రమోదీని ఏపీకి ఆహ్వానించారు. జీఎస్టీ తగ్గింపుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మోదీకి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో ప్రధాని చేతుల మీదుగా రూ.13,400 కోట్ల విలువైన ప్రాజెక్ట్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నాయి.
కర్నూలు-III పూలింగ్ స్టేషన్ ని బలోపేతం చేసేందుకు ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ కి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. రూ. 2,880 కోట్లకు పైగా పెట్టుబడితో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 765 KV డబుల్-సర్క్యూట్, కర్నూలు-III పూలింగ్ స్టేషన్, చిలకలూరిపేట ట్రాన్స్‌మిషన్ లైన్ నిర్మాణం కూడా ఉండటం గమనార్హం. కర్నూలులోని ఓర్వకల్, కడప జిల్లా కొప్పర్తిలోని పారిశ్రామిక ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ మొత్తం రూ. 4,920 కోట్లకు పైగా పెట్టుబడులతో పనులు మొదలు కాబోతున్నాయి. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (NICDIT), ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (APIIC) సంయుక్తంగా ఇక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నాయి. పరిశ్రమల కోసం ప్లగ్-అండ్-ప్లే మెథడ్ ని ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. వాక్-టు-వర్క్ ఎక్స్ పీరియన్స్ ని కలిగించేలా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. రూ. 21,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించే విధంగా, లక్ష ఉద్యోగాలను సృష్టించే విధంగా ఈ పారిశ్రామిక కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.
Also Read: విశాఖకు గూగుల్.. జగన్ కు మాటల్లేవ్
మంత్రులు బిజీ బిజీ..
ప్రధాని పర్యటనకు సంబంధించి ఏపీ మంత్రులు బిజీ బిజీగా కర్నూలులో కలియదిరుగుతున్నారు. దాదాపు 10మంది మంత్రులు కర్నూలులో మకాం వేసి వివిధ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణం వద్ద ఒక టీమ్, రవాణా, పార్కింగ్ ఏర్పాట్లను చూసుకోడానికి మరో టీమ్, ఆహారం, మంచినీటి సరఫరా కోసం మరో టీమ్ కార్యాచరణ మొదలు పెట్టింది. ప్రధాని సభను భారీ సక్సెస్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 4 లక్షల మందితో ఈ సభను నిర్వహించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోవడంతో జన సమీకరణ పెద్ద ఎత్తున మొదలైంది. కర్నూలు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూటమి పార్టీల కార్యకర్తలు, ప్రజలను ఈ సభకు తరలిస్తున్నారు. కర్నూలులో స్కూల్స్ కి సెలవు ఇచ్చారు. ఏపీఎస్ఆర్టీసీతోపాటు టీఎస్ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను కూడా ప్రజా రవాణా కోసం ఉపయోగించుకుంటున్నారు.
Also Read: ప్రిజనరీకి-విజనరీకి అదే తేడా-మంత్రి లోకేష్