DMart Exit Check: నాణ్యమైన వస్తువులు తక్కువ ధర, అదిరిపోయే డిస్కౌంట్లతో లభించే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది డిమార్ట్ స్టోర్లకు వెళ్తుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ బడ్జెట్ లో నిత్యవసరాలు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అయితే, డిమార్ట్ లోకి వచ్చే ప్రతి వినియోగదారుడు షాపింగ్ పూర్తి అయిన తర్వాత బయటకు వచ్చే సమయంలో బ్యాగ్, బిల్ చెకింగ్ ఉంటుంది. బిల్ రిసీట్ మీద స్టాంప్ వేస్తారు. ఇంతకీ ఈ బిల్ చెకింగ్ వెనుక ఉన్న లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
డిమార్ట్ లో షాపింగ్ చేసిన తర్వాత స్టోర్ ఎగ్జిట్ దగ్గర బిల్ స్టాంపింగ్, బ్యాగ్-చెకింగ్ ఉంటుంది. కొంతమందికి ఇదో చిరాకు వ్యవహారంగా కనిపించినా, డిమార్ట్ సంస్థ మాత్రం నష్ట నివారణ, నాణ్యత నియంత్రణలో భాగం అని ఫీలవుతోంది. డిమార్ట్ 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 415 కంటే ఎక్కువ స్టోర్లను కలిగి ఉంటుంది. ఈ స్టోర్లలో ప్రతి నెలా లక్షలాది మంది వినియోగదారులు కొనుగోళ్లు చేస్తారు. ఈ తనిఖీలు అన్ని స్టోర్లలో కామన్ గా ఉంటాయి. రిస్క్ మేనేజ్ మెంట్ వ్యూహంలో వీటిని నిర్వహిస్తారు.
బిల్ స్టాంపింగ్ అసలు లక్ష్యం
ఎగ్జిట్ బిల్ స్టాంపింగ్ అనేది షాపుల దొంగతనాన్ని నిరోధించడం లక్ష్యంగా కొనసాగుతుంది. ఎగ్జిట్ సిబ్బంది వినియోగదారుల ట్రాలీ నుంచి కనీసం నాలుగు వస్తువులను బిల్లులో ఉన్నాయో? లేదో? అని క్రాస్ చెక్ చేస్తారు. స్టాంపింగ్ చేసే ముందు వారు వస్తువులను చెక్ చేసి, బిల్ చేయని వస్తువులు ఏవీ లేవని నిర్థారిస్తారు. ఈ స్టాంపింగ్ అనేది ఉద్దేశపూర్వక దొంగతనాలు, మిస్టేక్ లో చెల్లింపు చేయకపోవడాన్ని అరికడుతుంది.
రియల్ టైమ్ లో బిల్లింగ్ లోపాలను గుర్తించడం
బిల్ స్టాంపింగ్ అనేది దొంగతనాన్ని గుర్తించడం గురించి మాత్రమే కాదు, బిల్లింగ్ కౌంటర్ లో ఏవైనా పొరపాట్లు జరిగి వస్తువులకు బిల్ కాకపోవడం లేదంటే ఒకే వస్తువుకు ఒటికి మించి స్కాన్ చేయడం లాంటి మిస్టేక్స్ ను గుర్తించడంలో సాయపడుతుంది. మిస్సైన స్కానింగ్, తప్పు ధర, బరువులో తేడాలు, బార్ కోడ్ సమస్యలు లాంటి వాటిని గుర్తించే అవకాశం ఉంటుంది. డిమార్ట్ అనేది ప్రతి కస్టమర్ ను ఒకేలా ట్రీట్ చేస్తుంది. బిల్లింగ్ వ్యవస్థను పర్యవేక్షించడంతో పాటు జవాబుదారీ తత్వాన్ని ప్రోత్సహిస్తుంది.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?
దేశంలో బ్యాగ్ తనిఖీలను తప్పనిసరి చేసే నిర్దిష్ట చట్టం లేనప్పటికీ, ఆయా స్టోర్లు భద్రత, నష్ట నియంత్రణ కోసం ఇలాంటి చర్యలు చేపడుతాయి. డిమార్ట్ ఈ విధానాన్ని పకడ్బందీగా ఉపయోగిస్తుంది. బిల్ స్టాంపింగ్ అనేది కొద్ది సమయం తీసుకున్నప్పటికీ, కస్టమర్లతో పాటు స్టోర్ యాజమాన్యం నష్టపోకుండా కాపాడుతుంది. బిల్లును తనిఖీ చేయడం అనేది లోపాలు, మోసాలను అరికట్టేందుకోసం ప్రధానంగా ఉపయోగిస్తోంది డిమార్ట్.
Read Also: డి-మార్ట్ లో అత్యంత చౌకగా లభించే వస్తువులేంటీ? ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తారు?