Empower Your Daughter: పెరుగుతున్న విద్యా ఖర్చులు, వివాహం వంటి భవిష్యత్తు అవసరాల కోసం ఆడబిడ్డల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మాయిల ఆర్థిక భద్రత కోసం తమ పెట్టుబడులను తెలివిగా ప్లాన్ చేసుకోవాలి. సుకన్య సమృద్ధి యోజన, మ్యూచువల్ ఫండ్స్ సహా పలు పథకాల్లో తక్కువ మొత్తంలో జమ చేసి పెద్ద మొత్తంలో రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంది. బాలికల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన బెస్ట్ పాలసీలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తల్లిదండ్రులు పసిబిడ్డ ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారో, ఆడబిడ్డ ఆర్థిక భవిష్యత్తు కోసం అంతే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సురక్షితమైన పెట్టుబడులు, బీమాల ద్వారా పిల్లల భవిష్యత్ కు ఆర్థిక భరోసా కల్పించే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న చదువుల ఖర్చులు తల్లిదండ్రులకు పెద్ద ఆందోళనగా మారింది. తమ పిల్లల చదువుల కోసం, పెళ్లి లాంటి భవిష్యత్తు ఖర్చుల కోసం పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముందస్తుగా ప్లాన్ ప్రకారం డబ్బులను సేవ్ చేయడం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలు ఆర్థిక అవసరాలను తీర్చుకునే అవకాశం ఉంటుంది.
సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన ఆడ పిల్లల భవిష్యత్ కు ఉపయోగపడే చక్కటి ప్రభుత్వ పథకం. ఇది పన్ను మినహాయింపులతో పాటు అధిక వడ్డీని అందిస్తుంది. అమ్మాయిలకు భవిష్యత్తులో ఆర్థి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. ఈ పథకంలో జమ చేసే డబ్బులు పిల్లల పెళ్లిళ్లకు సాయపడుతాయి. కేవలం రూ. 250 కనీస డిపాజిట్ తో పోస్టాఫీసు లేదంటే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఏడాదికి గరిష్టంగా రూ. 1.5 లక్షలు అకౌంట్ లో వేసుకోవచ్చు. 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా దాదాపు రూ. 8,000 అకౌంట్ లో జమ చేస్తే.. 8.2% వడ్డీ రేటుతో అమ్మాయి పెళ్లి వయసు వచ్చే సరికి దాదాపు రూ. 46.65 లక్షల మెచ్యూరిటీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్
పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు చక్కటి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. దాదాపు 10-12% సగటు వార్షిక లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. మంచి మ్యూచువల్ ఫండ్‌లో ప్రతి నెలా రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తే, సగటున 12% రాబడితో 15 సంవత్సరాలలో సుమారుగా రూ. 50.45 లక్షలను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది.
హెల్త్ కేర్ ఇన్సూరెన్స్
హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి కుటుంబానికి ఎంతో అవసరం. ఈ రోజుల్లో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగాయి. పిల్లలతో పాటు పెద్దలకు కవర్ అయ్యేలా హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం ఉత్తమం. కనీసం రూ. 5 లక్షల కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. వైద్య ఖర్చులతో ఇబ్బంది పడకుండా ఈ పథకం కాపాడుతుంది.
లైఫ్ ఇన్సూరెన్స్
కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. కష్ట సమయాల్లో కుటుంబ సభ్యులకు ఆర్థికంగా బాసటగా నిలుస్తుంది. 30 ఏళ్ల వ్యక్తి రూ. 1 కోటి విలువైన టర్మ్ పాలసీని పొందే అవకాశం ఉంది. వార్షిక ప్రీమియం సాధారణంగా రూ. 14,000 నుంచి రూ. 18,000 వరకు ఉంటాయి. ఈ పెట్టుబడి కుటుంబానికి ఎంతో భరోసా అందిస్తుంది.
Also Read: మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏడాదికి రూ.10 వేలు ఈ పథకంలో పెట్టండి.. 18 ఏళ్ల తర్వాత అదిరిపోయే బెనిఫిట్