బ్యాంకులో లోన్ తీసుకోనివారు, ఈఎంఐ లు లేనివారు దాదాపుగా ఎవరూ కనిపించరు. అవసరానికి లోన్ తీసుకునేవారికంటే, అవసరం ఉన్నా లేకపోయినా ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అంటే చాలు వెంటనే ఓకే చెప్పేవారు చాలామంది కనపడతారు. ఆనందంగా అప్పు తీసుకుంటారు సరే, మరి వడ్డీతో పాటు దాన్ని నెలవాయిదాల్లో కట్టడం అందరికీ సులభమేనా. కొందరికి ఆ అప్పుని ముందుగానే చెల్లించే వెసులుబాటు కూడా ఉంటుంది. అలాంటి అవకాశం ఉంటే లోన్ ని ముందుగానే క్లియర్ చేయడం అంటే, ఫోర్ క్లోజ్ చేయడం మంచిదేనా? కాదా? ఇదే ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోర్ క్లోజ్ ఎప్పుడు చేయాలి..?
తీసుకున్న అప్పు ముందుగానే తీరుస్తామంటే ఎవరైనా ఎందుకు వద్దంటారు చెప్పండి. బ్యాంకులైనా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్(NBFC)లు అయినా చాలా వరకు ఫోర్ క్లోజ్ ని ఎంకరేజ్ చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో లోన్ ముందుగానే తీర్చేయడం ఉత్తమం. వడ్డీబాధనుంచి తప్పించుకోవడమే కాదు, నెల నెలా ఈఎంఐ కోసం బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉండేలా చూసే బాధ కూడా తప్పుతుంది. ఇలాంటి సందర్భాల్లో మనకు ఇంకో మేలు కూడా జరుగుతుంది. అదే క్రెడిట్ స్కోర్ పెరగడం. అవును లోన్ ని ఫోర్ క్లోజ్ చేస్తే మన క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. అంటే మ్యాగ్జిమమ్ సందర్భాల్లో లోన్ ని ఫోర్ క్లోజ్ చేయడం ఉత్తమం.
ఫోర్ క్లోజ్ ఎప్పుడు ఇబ్బందికరం..
అన్ని లోన్లూ ఒకేలా ఉండవు, లోన్లు ఇచ్చే రుణదాతలంతా ఒకటే నియమాల్ని పాటించరు. కొన్ని సందర్భాల్లో ఫోర్ క్లోజ్ చేయడాన్ని రుణదాతలు అంగీకరించరు. అయినా కూడా ఆ లోన్ క్లోజ్ చేయాలంటే అదనంగా మనమే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఫోర్ క్లోజింగ్ జార్జెస్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో లోన్ ముందుగానే తీర్చేశామన్న సంతోషం మనకు ఉండదు. ఎందుకంటే వడ్డీ తగ్గింది అనుకునే లోపు ఫోర్ క్లోజర్ చార్జీలు మనకి ఇబ్బందిగా మారతాయి. దీనివల్ల మనం కట్టాల్సిన ఇతర ఈఎంఐలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అంటే ఈ ఫోర్ క్లోజర్ వల్ల ఇతర ఈఎంఐలు లేట్ అయితే మన క్రెడిట్ స్కోర్ తగ్గుతుందనమాట. అంతే కాదు, లోన్ ఫోర్ క్లోజ్ చేస్తే అన్ని సందర్భాల్లో అది రుణ ఖాతాలో వెంటనే అప్ డేట్ కాదు. అంటే లోన్ తీర్చేసే సమయంలో ఈఎంఐ జనరేట్ అయితే మనకు తెలియకుండానే ఇబ్బందుల్లో పడతాం. ఆ ఈఎంఐ కట్టకపోతే కచ్చితంగా మన క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. సో.. లోన్ ఫోర్ క్లోజ్ చేయాలంటే ఈఎంఐ ఎప్పుడు జనరేట్ అవుతుంది, మనం ఎప్పుడు ఫోర్ క్లోజ్ చేస్తున్నాం. అనే విషయాలను జాగ్రత్తగా గమనించాలి.
వాస్తవానికి అప్పులిచ్చే బ్యాంకులు, ఇతర రుణదాతలు.. సమయానికి వడ్డీతో కలిపి అప్పు చెల్లించేవారిని ఎక్కువగా ఇష్టపడతారు. సమయానికి ముందే మొత్తం చెల్లించేస్తామనేవారిని వారు పెద్దగా ఎంకరేజ్ చేయరు. వడ్డీతోనే వారికి లాభం ఎక్కువ ఉంటుంది కాబట్టి.. అసలు కంటే వడ్డీయే వారికి ముద్దు. సో లోన్ ఫోర్ క్లోజర్ విషయంలో బ్యాంకుల నియమ నిబంధనల ప్రకారం మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.