Gold Price : రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్న బంగారం మరోసారి కస్టమర్స్ కు షాక్ ఇచ్చింది. వరుసగా మూడో రోజు బంగారం ధర భారీగా పెరగటంతో ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి పుత్తడి చేరింది.
బంగారం ధరలు వరుసగా మూడోరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో పుత్తడి ధరలు భగభగమన్నాయి. నేడు 22క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1200 పెరగటంతో రూ.77,300గా నమోదైంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1310 పెరిగటంతో రూ.84,330 గా నమోదైంది. ఇక రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరగటం చర్చనీయంశంగా మారింది. ఇక బంగారం ధరలు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్న పసిడి ప్రియులు.. ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి ఈ ధరలు చేరటంతో హడలెత్తిపోతున్నారు. బంగారంతో పాటు పోటీపడి పెరుగుతున్న వెండి సైతం షాక్ ఇస్తుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,07,000గా నమోదైంది.
రేపు పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2025 బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దేశవ్యాప్తంగా పెరిగి రికార్డు స్థాయిని తాకాయి. పెట్టుబడిదారులు, మార్కెట్ భాగస్వాములు బడ్జెట్‌లో వచ్చే మార్పుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ప్రపంచ పరిస్థితులు సైతం పత్తడి ధరపై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
ముఖ్యంగా బంగారంపై దిగుమతి సుంకాలు ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం మార్కెట్ ఈ పన్నుల ధోరణికి అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయంగా బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. ప్రభుత్వం నుండి వచ్చే కీలకమైన ద్రవ్యోల్బణం డేటా కోసం ఇన్వెస్టర్స్ ఎదురుచూడటమేకాకుండా.. దేశీయ, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల చుట్టూ పెరిగిన అనిశ్చితి, పెట్టుబడిదారులు ఈ ధరలను విపరీతంగా పెంచేస్తున్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా బంగారంను భావించటంతో పాటు ఇండియాలో బంగారంపై ఉన్న ఆసక్తి సైతం నిత్యం బంగారం ధరలు పెరిగేందుకు దోహదపడుతున్నాయి.
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేసిన ప్రతిసారి గోల్డ్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయన్నట్లు కనిపిస్తోంది. నిజానికి 2017లో అమెరికా అధ్యక్షుడుగా మొదటిసారి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు 24 క్యారెట్ల గ్రాము బంగారం రేటు రూ. 3,008 ఉండగా.. 22 క్యారెట్ల గ్రాము గోల్డ్ రేటు రూ. 2,698గా ఉంది. ఇక ఆ టెర్మ్ ట్రంప్ పదవీకాలం పూర్తయిపోయినప్పటికి అంటే 2020 చివరిలో 24 క్యారెట్ల గ్రాము గోల్డ్ రేటు రూ. 5,134 ఉండగా.. 22 క్యారెట్ల గ్రాము గోల్డ్ రేటు రూ. 4,700గా ఉంది. అంటే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్లలో దాదాపు 70 శాతం ధర పెరిగింది.
అక్టోబర్ 6, 2024 ట్రంప్ ప్రచార సమయంలో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 7784 ఉండగా.. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 7137గా ఉంది. ఇక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచే సమయానికి అంటే నవంబర్ 6, 2024న 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 8,035 ఉండగా.. 22 కేరట్ల గ్రాము బంగారం ధర రూ. 7,365గా ఉంది. ఇక ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 20న 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 8,209 ఉండగా.. 22 కేరట్ల గ్రాము బంగారం ధర రూ. 7,525 ఉంది. ఇక ఈ రోజున జనవరి 31న 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ 8,433 ఉండగా.. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 7,730గా ఉంది. ఇక ముందు ముందు బంగారం ధర మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది.
ALSO READ : మహిళలు, మధ్య తరగతి వర్గాలకు లక్ష్మీ కటాక్షం – హింట్ ఇచ్చిన ప్రధాని మోదీ..