Govt Schemes Interest rate up to 8.2%| దేశంలోని సీనియర్ సిటిజెన్ల కోసం బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు తమ పథకాల ద్వారా బయట మార్కెట్ కంటే ఎక్కువ వడ్డే రేట్లు ఇస్తుంటాయి. అందుకే వృద్ధ పౌరుల కోసం ప్రభుత్వం మంచి ఆర్థిక పథకాలు రూపొందిస్తూనే ఉంటుంది. వీటిలో పాటు కుటుంబం కోసం, పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కోసం కూడ ఉపయోగపడే పథకాలున్నాయి. ఈ పథకాల్లో బ్యాంకులు ఫిక్స్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. ఆ పథకాల వివరాలుమీ కోసం..
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ లోనే ఎక్కువ వడ్డీ లభిస్తోంది. ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, వృద్ధ పౌరులకోసం సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు (POTD), సుకన్య సమృద్ధి యోజన (SSY), మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS) లాంటి పథకాల్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ రేటుతో మంచి సంపాదన లభిస్తుంది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ 28, 2024న అధికారిక ప్రకటన ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2024-25 రెండో క్వార్టర్ (జూలై 2024 నుంచి సెప్టెంబర్ 30 2024) కు గాను స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో వడ్డీ రేటులో ఏ మార్పు లేదు. ఆ ప్రకారం వడ్డీ రేట్లన బట్టి పథకాల వివరాలిలా ఉన్నాయి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం
ఈ పథకంలో ప్రతి సంవత్సరం కనీస డిపాజిట్ రూ. 500, గరిష్ట డిపాజిట్ రూ. 1.50 లక్షలు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద డిపాజిట్లు మినహాయింపు కూడా లభిస్తుంది. ఈ పిపిఎఫ్ పథకంపై ప్రభుతవం 7.1 శాతం వార్షిక వడ్డీనిస్తుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)
వృద్ధ పౌరుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సేవింగ్స్ పథకంలో కనీస డిపాజిట్ రూ. 1000 తో ఖాతాని తెరవచ్చు. ఒకవేళ ఎక్కువ ఖాతాలున్నా.. అన్నికలిపి గరిష్ట పరిమితి రూ.30 లక్షలు మించకూడదు. వార్షిక వడ్డీ రూ.50000 దాటితే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.50000 కంటే ఎక్కువ వడ్డీ అయితే అందులో నుంచి టిడిఎస్ మినహాయించి ఇస్తారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రభుత్వం 8.2 శాతం వడ్డీ రేటు ఇస్తోంది.
Also Read: రిటైర్మెంట్ తరువాత నెలకు రూ.లక్ష సంపాదన.. ఇలా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది..
3 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్
కనీసం రూ.1000తో అకౌంట్ ఓపెన్ చేసుకొని 3 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ట పరిమితి లేదు. అయితే దీనిపై 7.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఒకవేళ అయిదు సంవత్సరాల టర్మ్ డిపాజిట్ తీసుకుంటే ఆదాయపు పన్ను సెక్షన్ 80సి కింద పెట్టుబడికి మినహాయింపు ఉంటుంది.
పోస్ట్ మంత్లీ ఆదాయ పథకం (POMIS)
కనీసం రూ.1000తో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ పథకంలో చేరవచ్చు. సింగిల్ అకౌంట్ కు గరిష్ట పరిమితి రూ.9 లక్షలు, అదే జాయింట్ అకౌంట్ అయితే రూ.15 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ పథకంలో ప్రభుత్వం 7.4 శాతం వార్షిక వడ్డీనిస్తోంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)
కనీసం రూ.1000తో అకౌంట్ ఓపెన్ చేసుకొని నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకంలో చేరవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఆదాయపు పన్ను సెక్షన్ 80సి కింద పెట్టుబడికి మినహాయింపు ఉంటుంది. అయితే 5 సంవత్సరాల గడువు తరువాతే పథకంలో మెట్యూరిటీ లాభాలు లభిస్తాయి. ఈ పథకంలో ప్రభుత్వం 7.7 శాతం వార్షిక వడ్డీ ప్రభుత్వం ఇస్తోంది. అయిదు సంవత్సరాలు పూర్తి అయిన తరువాతే వడ్డీ లాభాలు పొందవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర (KVP)
ఈ పథకంలో పెట్టుబడి పెడితే 115 నెలల (9 సంవత్సరాల 7 నెలలు)కు పెట్టుబడి రెండింతలు అవుతుంది. అయితే వడ్డీ రేటుని ప్రభుత్వం తరుచూ సవరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడి పెడితే వార్షిక వడ్డీ 7.5 శాతం లభిస్తుంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్
ఈ పథకం మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టబడింది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ లెక్కించి, అకౌంట్ లో క్రెడిట్ చేయబడుతుంది. అకౌంట్ క్లోజ్ చేసిన తరువాత చెల్లింపులు జరుగుతాయి. ఈ పథకం కోసం మహిళలు లేదా మైనర్ బాలిక గార్డియన్ అకౌంట్ ఓపెన్ చేసి లాభాలు పొందవచ్చు. ఈ పథకంలో 7.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది.
సుకన్య సమృద్ధి అకౌంట్
ఈ పథకం ఇంట్లో ఆడపిల్లలకు ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం తీసుకొచ్చింది. కనీసం రూ.250 లతో పథకం ప్రారంభించి గరిష్టంగా ఒక సంవత్సరానికి రూ.1,50,000 డిపాజిట్ చేయొచ్చు. అయితే డిపాజిట్ ని ఎన్నిసార్లైనా చేయొచ్చు. ఈ పథకంలో ప్రభుత్వం 8.2 శాతం వార్షిక వడ్డీ నిస్తోంది.