America: ఈ మధ్యకాలం అమెరికాలో పని చేస్తున్న కొన్ని కంపెనీల ఉద్యోగులు మిలియనీర్లు అవుతున్నారు. ఒక్కోసారి బిలియనీర్లు అయ్యే సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ సంస్థ బాస్.. తన కంపెనీని అమ్మేశాడు. వచ్చిన మొత్తంలో 15 శాతం నిధులను కార్మికులకు బోనస్‌గా ఇచ్చేశారు. ఏకంగా 540 మంది మిలియనీర్లు అయ్యారు.
అమెరికాలో ఫైబర్‌బాండ్ కంపెనీ ఉద్యోగులు మిలియనీర్లు
ప్రపంచవ్యాప్తంగా కంపెనీల విలీనాలు జోరుగా సాగుతున్నాయి. ఓనర్లు ఎలాగూ కోట్లకు పడగలెత్తుతారు. కార్మికులు కూడా మిలియనీర్లు అవుతున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నట్లు.. స్పేస్ ఎక్స్ ఐపీఓకు వెళ్లినప్పుడు చాలామంది ఉద్యోగులు మిలియనీర్లు, బిలియనీర్లు అయ్యారు. అందులో మాజీ ఉద్యోగులు కూడా ఉన్నారనుకోండి. అది వేరే విషయం.
అసలు విషయానికి వచ్చేద్దాం. అమెరికా లోని లూసియానాకు చెందిన ఫైబర్‌బాండ్ గురించి చెప్పనక్కర్లేదు. ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ తయారీ కంపెనీ. ఆ కంపెనీ ఏకంగా 1.7 బిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. భారత్ కరెన్సీలో సుమారు రూ. 14,000 కోట్లు అన్నమాట.
ఫైబర్‌బాండ్ కంపెనీని ఈటన్ సంస్థ కొనుగోలు చేసింది. కంపెనీ మాజీ యజమాని గ్రాహం వాకర్ డీల్ మొత్తంలో 15 శాతం అంటే 2 వేల కోట్లు పైగానే 540 మంది ఫ్యాక్టరీ కార్మికులకు బోనస్‌గా ఇచ్చేశారు. ఆ కంపెనీలో ఉద్యోగులకు ఎలాంటి షేర్లు లేకపోయినా ప్రతి ఉద్యోగికి సగటున రూ. 3.7 కోట్లు వచ్చాయి.
కంపెనీని అమ్మేసిన బాస్.. వచ్చిన మొత్తంలో 15 శాతం ఉద్యోగులకు బోనస్
1982లో గ్రాహం వాకర్ తండ్రి క్లాడ్ వాకర్ టెలిఫోన్-ఎలక్ట్రికల్ పరికరాల తయారీ కోసం ఈ కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీని ఫ్యామిలీయే నడిపింది. 1998 ఏడాది ఆ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ తర్వాత ఒకదాని తర్వాత మరొక సంక్షోభం కంపెనీని కోలుకోలేని దెబ్బ తీసింది.
తొలుత 900 మంది ఉన్న సిబ్బంది ఆ తర్వాత 320కి పడిపోయింది. ఆ గండం నుంచి గట్టెక్కడానికి కార్మికులు తీవ్రంగా కష్టపడ్డారు. యజమాన్యం కష్టాల్లో ఉన్నా ఉద్యోగుల జీతాలు ఏనాడూ ఆపలేదు. ఆ విధంగా యాజమాన్యం-ఉద్యోగుల మధ్య మంచి కెమిస్ట్రీ ఏర్పడింది. క్లిష్ట సమయంలో కంపెనీని నమ్మి నిలబడిన ఉద్యోగులకు వాకర్ ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.
కుదిరిన డీల్‌లో 15 శాతం ఎందుకు ఇచ్చారన్న ప్రశ్నకు ఆయన సింపుల్‌గా సమాధానం ఇచ్చారు. ఇది 10 శాతం కంటే ఎక్కువేనని సమాధానమిచ్చారు. డేటా-సెంటర్ మౌలిక సదుపాయాలలో 150 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది ఆ కంపెనీ. ఆ తర్వాత ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది.
ALSO READ: కేంద్రం కొత్త కసరత్తు.. ఇక బ్యాంకు ఉద్యోగులకు పండగే, అంతా డిజిటల్ మయం
కోవిడ్-19 సమయంలో క్లౌడ్ కంప్యూటింగ్‌కు డిమాండ్ పెరగడం, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం రావడం ఈ కంపెనీకి వరమైంది. ఐదేళ్లలో ఆ కంపెనీ సేల్స్ అమాంతంగా 400 శాతం పెరిగాయంటే ఆశామాషీ కాదు. ఈ క్రమంలో పవర్ మేనేజ్మెంట్ సంస్థ ఈటన్ కన్ను ఫైబర్‌బాండ్ సంస్థపై పడింది.
బోనస్‌తో ఫ్యాక్టరీ కార్మికుల జీవితాలు మారిపోయాయి. గతేడాది డిసెంబర్ 31న సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు గ్రాహం వాకర్.ఆయన కుటుంబం బిలియన్ డాలర్ల సంపదను పొందింది. కంపెనీ ఎదుగుదలకు కారణమైన వందలాది మంది కార్మికులకు జీవితాంతం గుర్తుండిపోయే ఈ బహుమతి ఇచ్చింది ఆ కంపెనీ.
బోనస్ చెల్లింపులు జూన్ నుంచి ఉద్యోగులకు ఇవ్వడం మొదలైంది. ఐదేళ్ల పదవీ విరమణ కాలంలో బోనస్‌ను పంపిణీ చేయనుంది. పూర్తి మొత్తాన్ని పొందడానికి ఉద్యోగులు కంపెనీలో కొనసాగాలి. 65 ఏళ్లు పైబడిన కార్మికులకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఇచ్చింది. దీనివల్ల చాలా కాలంగా పని చేస్తున్న సిబ్బంది పదవీ విరమణ చేయడానికి వీలు కలిగింది.